
మడవి తుకారం ఒక సాధారణ గోండు తెగ గిరిజన వ్యక్తి. ఆయ న ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని లక్సెట్టిపేట ఏజెన్సీ గూడెంలో 1951 మే 4వ తేదీన జన్మించాడు. కుటుంబ పోషణ కు సరిపడే సాగు భూమి లేక దినసరి కూలీగా కాలం వెళ్లదీసే నిరుపేద కుటుంబం ఆయనది. తండ్రి బాబురావ్ లక్సెట్టిపేట గ్రామ పోలీస్ పటేల్‌గా తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసేవాడు. పేదరికంలో అవమానాలను భరిస్తూ, తన వారసులైనా ఉన్నత చదువులు చదివించాలనే తపన తుకారాంను ఐఏఎస్ స్థాయికి చేర్చింది. తుకారాం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నాల్గో తరగతి వరకు చదివాడు. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు ఆదిలాబాద్‌లో గిరిజన వసతి గృహంలో ఉంటూ, ప్రభు త్వ పాఠశాలలో చదివాడు. కాగజ్‌నగర్‌లో ఇంటర్, డిగ్రీ చదివాడు. కాగజ్‌నగర్‌లోని అటవీశాఖ కార్యాలయంలో దినసరి వేతనంలో ఉద్యో గం చేస్తూ, ఎంఏ, పీహెచ్డీ పూర్తి చేశాడు. తుకారాం విద్యార్థిదశ నుంచి నిజాయితీగా ఉండేవాడు. అట్లాగే తుకారాం మాతృభాష గోండితోపాటు మరాఠీ, హిందీ, ఇంగ్లిష్‌లో మాట్లాడేవాడు. గోండుల సంస్కృతీ సంప్రదాయాలను తప్పక పాటించేవాడు.
భారతదేశంలో గిరిజన జాతులు, భాష, సంస్కృతి అధ్యయనం కోసం (నైజాం కాలంలో) ఆదిలాబాద్‌కు రెండోసారి వచ్చిన మానవ పరిణామ శాస్త్రవేత్త హైమన్‌డార్ఫ్ దృష్టి విద్యాధికుడైన తుకారంపై పడింది. గోండు గిరిజనుల సంస్కృతి అధ్యయనంలో డార్ఫ్, గోండిభాషకు అను వాదకుడిగా తుకారాంను చేరదీశాడు. గోండుల రాచరిక చరివూతను పుస్తక రూపంలో ప్రపంచానికి చాటి చెప్పడానికి హైమండార్ఫ్కు సహకరించిన వారిలో తుకారాం ముఖ్యు డు. గోండుల పండుగల్లో ముఖ్యమైనవి పెర్సాపేన్ పూజలు, యేత్మసర్పేన్ దండారి పూజలు (దీపావళి). ఉత్సవాల్లో గుస్సాడీ నృత్యాలు, డెమ్చా నృ త్యా లు, ఫర్రా గుమ్మెల నృ త్యాలు భారతదేశ సాంస్కృ తిక నృత్యాలుగా విరజిల్లడానికి డార్ఫ్ కృషికి తోడు, తుకారాం సహకా రం మరువలేనిది.
హైమన్‌డార్ఫ్ లండన్ వెళ్లిన తర్వాత ఆయన స్ఫూర్తితో గ్రూప్-1 అధికారిగా ఎన్నికైన తుకారాం మొదట కాకినాడలో ఆర్టీవోగా విధుల్లో చేరాడు. 1981 ఏప్రిల్ 21న ఇంద్ర కోయత్తోర్, గోండు గిరిజనుల హక్కుల సమావేశంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో చాలామంది గిరిజనులు మరణించారు. వారి కుటుంబాలు నిరాదరణకు గురయ్యాయి. ఆ సందర్భంలో తుకారాం ఉట్నూరు-సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లో సహా య ప్రాజెక్టు అధికారి (జనరల్)గా నియమింపబడి, పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ప్రతి ఇంటికి గూన పెంకులు, ఎడ్ల జత, కరెంట్ మోటార్, ఆయిల్ ఇంజన్ల పంపిణీకి తనవంతు కృషి చేశారు. కోయ కోయత్తోర్, గోండ్, పర్థాన్, తోటి, కోలాం, మన్నేవార్లు, నాయక్‌పోడ్, అంధ్ తెగ గిరజనులున్న గ్రామాల సమస్యలను, వారి కుటుంబ తగాదాలను వారే పరిష్కరించుకోవడానికి ‘రాయ్ సెంటర్’ ఏర్పాటైంది. దీనికి ఏపీవోగా తుకారాం తగిన సహాయమందించారు. ప్రతి గిరిజన గూడెంలో పాఠశాల ఏర్పాటుకు కృషి చేశారు. ఐటీడీఏ ద్వారా పలు గిరిజనాభివృద్ధి ప్రణాళికలను, సంక్షేమ కార్యక్షికమాలను చిత్తశుద్ధితో అమలుచేస్తూ, ఉత్తమ అధికారిగా పేరు గడించారు.
గోండుల ఉత్సవ దేవత యేత్మసర్పేన్ దండారి ఉత్సవాలను సామూహికంగా నిర్వహించడానికి, కేస్లాపూర్‌లోని నాగోబా జాతర సందర్భంగా జరిగే ‘దర్బార్’ నిర్వహణకు తుకారాం కష్టపడి పనిచేశారు. గుస్సాడి నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలోనూ ఆయన కృషి ఎనలేనిది. తుకారాం ఏపీవో బాధ్యతల తర్వాత డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ (కరీంనగర్), గిరిజన సంస్కృతి పరిశోధన శిక్షణా సంస్థ (హైదరాబాద్) ఇన్చార్జి డైరెక్టర్‌గా, డీఆర్వోగా (మహబూబ్‌నగర్) పనిచేసి ఐఏఎస్‌గా పదోన్నతి పొందారు. తుకారాం మొదట నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్‌గా, బాల కార్మిక కమిషనర్‌గా, ప్రభుత్వ సహాయ కార్యదర్శి హోదాలో తన విద్యుక్త ధర్మాన్ని నిర్వహించారు. తుకారాం అనారోగ్యంతో 1998 నవంబర్ 29న తనువు చాలించారు. తుకారాం ఉత్తమ సేవలను నాటి ప్రభుత్వం గుర్తించింది. ఉట్నూరులో తుకారాం కాంస్య విగ్రహన్ని ఏర్పాటు చేసింది. ప్రతి ఏటా తుకారాం వర్ధంతి రోజున గోండు గిరిజనులు ఆనవాయితీగా నివాళులర్పిస్తారు.
-గుమ్మడి లక్ష్మీనారాయణ
ఆదివాసీ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
(నేడు తుకారాం 14వ వర్ధంతి)