వివక్షలే ఉద్యమాల పుట్టుకలు


Sun,April 7, 2013 11:19 AM

ఒక ప్రాంతం సాంస్కృతిక ఆధిపత్యమే రెండు ప్రాంతాల మధ్య అనెక్యతకు ప్రధాన కారణంగా నిలుస్తుంది. ఒక ప్రాంతం తన సాంస్కృతిక ఆధిపత్యాన్నే రాజకీయ, ఆర్థిక ఆధిపత్యంగా మార్చేసుకుంటుంది. ప్రపంచంలో ఎక్కడెనా ఏ ప్రాంతానికైనా సాంస్కృతిక సంపద ఉంటుంది. ఆ సాంస్కృతిక సంపదను ఏ మేరకు కొల్లగొట్టగలిగితే ఆ నేలను ఆక్రమించుకోవటం అంత సులువవుతుంది. తమ భాష, యాస, తన కళలు, తమ పాటలు, తమ సాహిత్యం, తమ సంస్కృతి అనే దాన్ని ఆ ప్రాంతం నుంచి వేరు చేసి చూస్తే ఆ ప్రజల స్థితి నీటిలోని చేపలను నేల మీద వేసినట్లుగా అవుతుంది. సరిగ్గా అదే స్థితిని తెలంగాణ సమాజం ఎదుర్కుంటుంది.

ఆధిపత్యవాదులు కుట్రతో చేసిన ఈ పనే మొత్తం తెలంగాణ సంస్కృతిని విధ్వంసం చేసింది. అది క్రమంగా పెరిగి ఒకే తెలుగు జాతి, ఒకే తెలుగు సమాజం పేరున తెలంగాణ నేలంతా కబ్జాకు గురైంది. ఈ విషయాన్ని ఆదిలోనే గుర్తించి 1969 ఉద్యమంగా ముందుకు వచ్చింది. పాఠ్యాంశాలలో ప్రధానంగా తెలంగాణ భాషను రాకుండా చేశారు. తెలంగాణ సంస్కృతిని సర్వనాశనం చేసి, తెలంగాణ సాహిత్యాన్ని తెలంగాణ భాషను ధ్వంసం చేసి ప్రాంతేతర ఆధిపత్య సంస్కృతిని, భాషను నూరిపోశారు. దీంతో భాషను కత్తిగా చేసి తెలంగాణ గొంతును కోసేశారు. ఇలా తెలంగాణ సాహిత్య సాంస్కృతిక సంపదను ఛిన్నాభిన్నం చేసి ఆధిపత్య సంస్కృతిని చాపకింది నీరులాగా ప్రవహింపచేశారు. క్రమంగా తెలంగాణపై ఆర్థిక, రాజకీయ పట్టును సంపాదించారు. తెలంగాణ ప్రజలు అన్నీ కోల్పోయి తన నేలపై తాను నిలిచేందుకు అస్థిత్వ పోరాట రూపంగా మారాల్సిన స్థితి వచ్చింది. తెలంగాణ తన నేలపై తన పట్టును కోల్పోయి పట్టతప్పి పోవటానికి కారణం తన సాంస్కృతిక సంపదను తాను కోల్పోవటమేనని గుర్తించి ముందుకు వచ్చింది. అందుకే తెలంగాణ నేల నుంచి ఎగిసిన ఉద్యమం సాంస్కృతిక ఉద్యమం కాబట్టే సమస్త తెలంగాణ సమాజం కదలివచ్చింది. తెలంగాణ సమాజం తాను కోల్పోయిన సాహిత్య సాంస్కృతిక పూర్వ వైభవాన్ని పొందేందుకు ఉద్యమిస్తూ ముందుకు సాగుతుంది. ఈ న్యాయబద్దమైన తెలంగాణ రాష్ట్ర డిమాండును సీమాంధ్ర ప్రాంత ప్రజలు వ్యతిరేకించటం లేదు.

ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలలో అధికారం చెలాయిస్తున్నవాళ్లు కొందరు పెట్టుబడిదారులు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యక్తులే తెలంగాణ నేలను కబ్జా చేశా రు. ఆర్థిక, రాజకీయ పట్టును సంపాదించుకున్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఏ ఒక్క కవి, రచయిత, సాంస్కృతిక రంగంలో ఇప్పటి వరకు విశిష్ట కృషి చేసిన వ్యక్తులు ఎవరూ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాన్ని వ్యతిరేకించటం లేదు. ఇది ప్రజాస్వామిక ఉద్యమమని చెపుతున్నారు. కాగా పోగా ఆక్రమిత సంస్కృతితో అధికారాన్ని చెలాయించేవాళ్లే తెలంగాణకు అడ్డుపడుతున్నారు.

2009 డిసెంబర్ 9 ప్రకటన వెలువడ్డప్పటికినీ, తెలంగాణ పోరు సెగలు కక్కుతున్నప్పటికినీ తెలంగాణపై నేటికినీ యథేచ్ఛగా సాంస్కృతిక ఆధిపత్య అధికారం కొనసాగుతుంది. ఇంతకంటే అమానుషత్వం మరొకటి లేదు. ప్రపంచ మానవహక్కుల వేదిక మీద చర్చించాల్సిన అంశం ఇది. ఒక ప్రాంతం కళలను, సంస్కృతిని ఇంత చిన్న చూపు చూస్తూ గేలిచేస్తుంటే రెచ్చగొట్టబడ్డ ప్రజలు పోరాటానికే దిగటం సర్వసాధారణం. పైగా న్యాయబద్ధమైనది కూడాను. ఆ న్యాయబద్ధ పోరాటాన్నే తెలంగాణ తన భుజాన వేసుకుంది.
రెండు ప్రాంతాల మధ్య బెర్రలు గీసుకుని యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని పోరుసైరన్ మోగిస్తున్న ఈ తరుణం లో సమతుల్యం పాటించాల్సిన పాలకులే విషం గ్రక్కుతుంటే దీన్ని ఏ రకమైన ఆధిపత్యం అంటారు? డిసెంబర్ 27, 28, 29 తేదీలలో తిరుపతిలో జరుగనున్న ప్రపంచ తెలుగు మహాసభలకు 25 కోట్ల రూపాయలను కేటాయించి, ఆ నిధులను విడుదల చేసి ముమ్మర ఏర్పా ట్లు చేస్తున్నారు. రెండు ప్రాంతాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న ఈ సందర్భంలో, వేయిమంది ఆత్మబలిదానాలతో ఈ నేలంతా తల్లడిల్లుతుంటే ప్రపంచ తెలుగు మహాసభలను ఎలా జరుపుతారని? వీటిని మేం బహిష్కరిస్తున్నామని తెలంగాణ రచయితల వేదిక గత రెండు సంవత్సరాల నుంచి చెబుతూ వస్తుంది. రోశయ్య ప్రభుత్వంలో జరగాల్సిన ఈ మహాసభలు వాయిదాపడ్డాయి. కిరణ్ ప్రభుత్వం డిసెంబర్‌లో జరుపుతుంది. ఇది పచ్చిగా ఆధిపత్య సంస్కృతిలో భాగం జరుగుతూనే ఉంది. అందుకే తెలంగాణలో అన్ని సాహిత్య, సాంస్కృతిక సంస్థలు, అరసం, విరసం, తెలుగు భాషోద్యమ సమాఖ్యల దగ్గర నుంచి జనసాహితీల వరకూ ఈ ప్రపంచ తెలుగు మహాసభల్ని బహిష్కరిస్తున్నాయి. తెలంగాణ కవులు, రచయితలు, కళాకారులు నిరసన సభలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రచయితల వేదిక వూరూ వాడ తిరిగి ఈ ఆధిపత్య ప్రభుత్వ మహాసభలను బహిష్కరించడన్న పిలుపునిస్తూ ప్రచారం చేస్తూ ఉంది. అయినా ప్రభుత్వం ఆధిపత్యంతో అడుగులు వేస్తూనే ఉంది.

ఒక నేలపై సాంస్కృతిక ఆనవాళ్లను తుడిచివేస్తూ దానిపై ఆధిపత్య చిహ్నాలను పెడితే ఆ సమాజం ఒప్పుకోదు. ప్రధానంగా వివక్షను ప్రశ్నించి తీరుతుంది. గురజాడ శతజయంతి సభలకు ఐదు కోట్ల రూపాయలు కేటాయించారు. కానీ పోతన పేరున అవార్డు పెట్టండి అంటే ప్రభుత్వం తిరస్కరించింది. కాటన్‌దొర ఉత్సవాలకు కోట్ల రూపాయలు కేటాయించారు. నల్గొండ మ్యూజియం నుంచి, కొలనుపాక నుంచి బౌద్ధా రామాలను, విగ్రహాలను, బౌద్ధ ఆనవాళ్లను ఆంధ్రాకు, అమరావతికి తరలించివేశారు. తెలంగాణ వాదులు కోర్టులో కేసు వేస్తే తిరిగి వాటిని వెనక్కు పంపారు. నేలకొండపల్లిలో భక్తరామదాసు తిరుగాడిన ప్రదేశంలో ఆ కోట చీమలపుట్టగా మారింది. విశ్వవిఖ్యాతమైన రామప్పదేవాలయానికి చెదలుపట్టి ప్రాకారాలు కూలిపోతున్నాయి. తెలుగు ప్రాచీన భాషా హోదాకోసం తెలుగు సమాజమంతా తిరిగినా ఆ జాడ ఎక్కడా దొరకలేదు. కరీంనగర్ జిల్లా కోటిలింగా ల మట్టిదిబ్బగా మారింది. వరంగల్ జిల్లా బమ్మెర గ్రామం పోతన వూరు. ఆయన తిరుగాడిన చారివూతక ప్రదేశాలు నేలమట్టమౌతున్నాయని ఆవేదన చెందిన చుక్కా రామయ్య ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. ప్రపంచ ప్రసిద్ధి వహించిన నిర్మల్ బొమ్మలు అంతరించిపోతున్నాయి.

ఈ దేశం గర్వించతగ్గ సాహితీవేత్త సామల సదాశివపేరున ఆదిలాబాద్‌లో సామల సదాశివ విజ్ఞానకేంద్రం నెలకొల్పాలని అడిగితే పట్టించుకున్న దాఖలాలు లేవు. ట్యాంక్‌బండ్‌పై కూలిన విగ్రహాలను తిరిగి పునః ప్రతిష్ఠ చేశారు కానీ తెలంగాణ సాహితీమూర్తుల, తెలంగాణ తేజోమూర్తుల విగ్రహాల డిమాండ్‌ను కనీసం వినలేదు. ఒక్క కొమరంభీమ్ విగ్రహాన్ని నెలకొల్పి తప్పించుకున్నారు.

శ్రీకృష్ణదేవరాయల పంచశతి ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయలను కేటాయించింది. ఆయన పాలనకు తెలంగాణకు సంబంధం లేదు. కాకతీయుల పాలనలో ఆరుగురు చక్రవర్తులున్నారు. దేశచరివూతలోనే మొట్టమొదటి హిందూ మహారాణిగా, తొలి మహిళా చక్రవర్తిగా వెలుగొందిన రాణీ రుద్రమదేవి చరివూతను సృష్టించింది. కాకతీయ సామంతరాజులకున్నంత స్థాయి కూడాలేని శ్రీకృష్ణదేవరాయల పేరున రాష్ట్రవూపభుత్వం 500 కోట్ల రూపాయలను కేటాయించి పంచశతి ఉత్సవాలను హైద్రాబాద్ రవీంద్ర భారతిలో జరిపారు. 350 సంవత్సరాలు ఏకఛవూతాధిపత్యంగా పాలన కొనసాగించిన కాకతీయ ఉత్సవాలను వరంగల్‌కు పరిమితం చేయటం విచారకరం. కాకతీయుల కాలంలో నిర్మించిన దేవాలయాలు శిధిలావస్థలో ఉన్నాయి. వాటికి వెంటనే మరమత్తులు చేపట్టాలి. ఆ దేవాలయాలకు వెళ్ళేందుకు రోడ్ల నిర్మాణం, రోడ్ల మరమత్తులు యుద్ధ ప్రాతిపదికపై చేపట్టాలి. వీటిని టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి. కాకతీయుల కాలంలో వందలాది చెరువులు నిర్మించబడ్డాయి.

పాకాల, లక్కవరం, రామప్ప చెరువులు మహానదుల్లాగా ఉంటాయి. వాటికి మరమత్తులు చేస్తే మరో 1000 సంవత్సరాల వరకు అవి సజీవంగా ఉంటాయి. కాకతీయుల కాలంలో వచ్చిన సంస్కృత, తెలుగు సాహిత్యాన్ని పునర్మువూదించాలి. తెలంగాణకు పేరు తెచ్చిన అందరి కవుల, రచయితల మోనోక్షిగాఫ్‌ను ఈ సందర్భంగా వెలువరించాలి. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే ప్రకృతి అందాలను ప్రసాదిస్తున్న 540 గుట్టలను క్వారీలపేరుతో ధ్వంసం చేశారు. వరంగల్ జిల్లాలో కూడా క్వారీల పేరున జరుగుతున్న విధ్వంసాన్ని ఆపాలి. కాకతీయ ఉత్సవాలకు నిధులివ్వమంటే కేటాయించలేదు. పైగా ఆ ఉత్సవాలను వాయిదా వేశారు. 850 ఏళ్ల చరివూతగల వేయిస్తంభాల గుడి శిధిలాలుగా మారేదశగా తయారయ్యింది. 800 ఏళ్ల రామప్పకు చెదపట్టి అంతరించిపోయే స్థితికి చేరుకుంటుంది. సూర్యాపేట జాతీయరహదారిపై భీమిడ్డి నర్సింహాడ్డి స్మారకకేంద్రం నెలకొల్పమని అడిగితే ఇప్పటికీ ప్రభుత్వం నోరువిప్పలేదు. వీర తెలంగాణ సాయుధ పోరాటానికి చిహ్నంగా మ్యూజియంను నెలకొల్పామని అడిగితే ఉలుకూ పలుకూ లేదు.


తెలంగాణ దర్గాలకు, దేవాలయాలకు,పురాతన చారివూతక కట్టడాల రక్షణకు, తెలంగాణలోని పుణ్యక్షేవూతాలకు, పుణ్యతీర్థాలకు, ఇక్కడి పర్యాటక కేంద్రాల అభివృద్ధికి నిధులివ్వమని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుంటే పట్టించుకున్న పాపాన పోలేదు. అదే గుంటూరు జిల్లా కొండవీడుకోట రక్షణకోసం, అభివృద్ధి కోసం 150 కోట్ల రూపాయలను కేటాయించారు. అదే తెలంగాణలోని రాచకొండ, దేవరకొండ, ఉర్లుకొండ, ఉండ్రుకొండ, అర్వపల్లి, భువనగిరి, రామగిరి మొదలగు దుర్గాల అభివృద్ధి ఆగిపోయింది. ఇంత జరుగుతుంటే తెలంగాణ మంత్రులూ మీరేం చేస్తున్నారు? తెలంగాణ సాహిత్య సాంస్కృతిక సంపదలను కాపాడలేని వారు ఈ ప్రాంత ప్రజావూపతినిధులుగా నిలబడటానికి అనర్హులుగా మారతారు. బతుకమ్మ ఉత్సవాలను పట్టించుకొని ప్రభుత్వం, తెలంగాణ సంస్కృతిని ధ్వంసం చేసేందుకు ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తుంది. ఈ ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగానే తెలంగాణ సమాజం ఏకం అవుతుంది.

-జూలూరు గౌరీశంకర్
తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు

37

GOURI SHANKAR JULUR

Published: Sun,April 7, 2013 11:51 AM

యుద్ధ వచనం

ఇక తప్పదు, దెబ్బతప్పదు, దెబ్బలూ తప్పవు, సహనాన్ని ఎంతని అదిమిపెట్టాలిరా!ఆగ్రహాన్ని ఎవరూ కట్టేయలేరురా! అన్నీ చూస్తూనే ఉన్నాం, అన్నిం

Published: Sun,April 7, 2013 11:39 AM

‘తెలంగాణ’ లేకుండా తెలుగు మహాసభలా!

తెలంగాణ సాహిత్య సాంస్కృతిక ముఖ్యులు లేకుండా జరిగినవి ప్రపంచ తెలుగు మహాసభలు ఎట్లా అవుతాయి? తెలంగాణను గాయాలకు గురిచేశారు కాబట్టే ఈ న

Published: Sun,April 7, 2013 10:03 AM

సాగర సమరహారం

ఎంత రాసినా తనివితీరని కావ్యం/ఎంత చెప్పినా వొడవని ముచ్చట గాయాలతో విముక్తి పాఠాలను రాస్తూ అనుభవాలతో పోరాటాలను పండిస్తూ చెదిరిన పి