సాగర సమరహారం


Sun,April 7, 2013 10:03 AM

ఎంత రాసినా తనివితీరని కావ్యం/ఎంత చెప్పినా వొడవని ముచ్చట
గాయాలతో విముక్తి పాఠాలను రాస్తూ
అనుభవాలతో పోరాటాలను పండిస్తూ
చెదిరిన పిట్టల గుంపు/మానవ సంబంధాల గూడు తెలంగాణ
మిలియన్ మార్చ్ జీవిత పాఠం/సకల జనుల సమ్మె జీవన సమరం
తెలంగాణ మార్చ్ జీవిత పదం/అంతంలేని బాట తెలంగాణ
కోట్లమందిని ఒక్క సూత్రంతో/ఏకం చేసిన హారం తెలంగాణం
సాగరహారం జనసమూహ దృశ్యం/బుడిబుడి అడుగులబోసి నవ్వులు
తల్లి కడుపులో తిరుగుతున్న బిడ్డ
యవ్వన తేజం/ఉద్యమ పరిపూర్ణ తేజం
సమస్త మహా జనావళి చూపులన్నీ తెలంగాణే


మిలియన్ మార్చ్‌తో ట్యాంక్‌బండ్ థింక్‌బండ్
తెలంగాణ మార్చ్‌తో సాగరహారం సమరగీతం
తల్లి ఒడిలోకి బిడ్డ చేరుకున్నట్లు
తన నేల మీద తన పాట పాడుకుంటూ
రొట్టె కట్టుకుని రుమాలు చుట్టుకుని
యింటికొకరు కదలి కదలి
ఒక చేతితో జెండా/యింకో చేత్తో గుండె నిండా ఆశయం
దండ్లుగా.. దండయాత్రగా... దీర్ఘయాత్రగా.. మహాయాత్రగా..
జనం నడక.. ఆకాంక్షల నడక
కాలం ఎప్పుడూ పోరాటాలతోనే పుడతది


పొట్టమీదికొచ్చిన పంటలాగ
తెరపీయకుండా కురుస్తున్న ముసురులాగ
వుడుకుతున్న బువ్వలాగ/పాలు పొంగుకొచ్చినట్లు
మహానగరమంతా అస్తిత్వ ఆకాంక్షలను పరుచుకుంది
తెలంగాణను తలపోసుకుంటుంది
సాగరహారం ఉద్యమ కంఠమై మెరుస్తుంది
వందలమంది ఆత్మబలిదానాల నెత్తుటి చమురుతో
తెలంగాణ కాగడా మండుతుంది
సాగరహారం వైపుకు చీమలదండ్లన్నీ వింతగా చూస్తున్నయి


అది జనదండకారణ్యంలాగా ఉంది
గోదావరి లోయ ప్రతిఘటన పోరురూపులాగ వుంది
మా ఏలె లక్ష్మణ్ మట్టిగీతలాగ/వైకుంఠం బొమ్మకు పెట్టిన బొట్టులాగ
కాపురాజయ్య బొమ్మల సందుకలాగ
ఒక్కమాటలో చిత్తప్రసాద్ ఉద్యమ చిత్రంలాగా ఉంది
కలిసేపోదాం... నడిచేపోదామన్న
అల్లం.. ‘వీరన్న’ పాటలాగా వుంది/లాంగ్ మార్చ్ గీతంలాగా ఉంది
నెక్లెస్ రోడ్డిప్పుడు ఆకాంక్షలను కప్పుకున్న
ఓ చరిత్ర పుస్తకంలా వుంది
నెక్లెస్ రోడ్డిప్పుడు ట్రిగ్గర్ మీద వేలు తీసి


పిడికిలి బిగించిన గాంధీలాగవుంది
నీటిచుక్కల ఉప్పెనలాగ వుంది
సమసమాజాల భవిష్యత్‌లాగ వుంది
విలువల్ని పొదిగన పగడాల హారంలాగ వుంది
ఎంత అందం ఎంత అందం/జనచిత్రం ఎంతెంత అద్భుతం
ఎంత అందం ఎంత అందం
సాగరమెంత అందం.. జనసాగరమెంతెంత అందం
ప్రవాహంలా కదిలిపోతున్న జనజాతర ఎంతెంత అందం
చరిత్ర అందమంతా ప్రళయాలు.. పోరాటాలే!!

నా నేలను నేను ప్రేమిస్తాను/నా నేల కోసం మట్టినౌతాను
విముక్తి విత్తనాన్ని/విప్లవాల పంటను/సమూహ పాటను
తెలంగాణను ఆవిష్కరిస్తున్న/ఉద్యమాల అక్షర మాలను
పోరాటాల పెద్ద బాలశిక్షను
ఆలోచనలన్నీ కుప్పలుగా రాలిపడ్తుంటే
ఆచరణను తొడుక్కున్నవాణ్ణి
బతుకు దారాలతో ఉప్పొంగిన నరాల్తో
ఉద్యమ గీతాలుగా మారినవాణ్ని
ఈదురుగాలులకు ఎదురుగా/నిలబడ్డ నిలకడను
ఈమట్టి ఎందుకు మసలుతుందో

కళ్లారా చూసిన పోరు శాస్త్రాన్ని/రాలిపోతున్న నక్షత్రాల
జనరహస్యాల్ని విప్పిచెపుతున్న జననేంద్రియాన్ని
ప్రళయానికి పుట్టుకను/శాంతి విత్తనాన్ని
అంతం కావటం/అవతరించటం తెలియటమే కవిత్వం
నా అక్షరాల ఆవేశపు పరుగే ఆలోచన
దోరకాయ మాగినపండ్ల రుచే కావ్యం
కవి...కలం రాజ్యాంగం/కలల రాజ్యాంగం/కల్లోల రాజ్యాంగం
పరవశించిన పదును కవిత్వం


యుద్ధగీతానికి నిలువెత్తు సాక్ష్యం తెలంగాణం
మానవీయ మహాకావ్యం తెలంగాణ
మార్చ్ మార్చ్ మార్చ్/తెలంగాణ మార్చ్
దీర్ఘయాత్ర దీర్ఘయాత్ర /తెలంగాణ మహాయాత్ర
అక్టోబర్ విప్లవాలకు/ఇగురులు వేస్తున్న సెప్టెంబర్

ఆగస్టు 15/ డిసెంబర్ 9..
స్వేచ్ఛగా రెపరెపలాడటమే కవిత్వం
నిరంతరం పోరును /మోస్తున్న తల తెలంగాణ
మేలు కొలుపును గంటకొట్టి /లేపటమే కవిత్వం
అక్షరాల్తో/ఉద్యమ దప్పిక తీర్చిన వారే కవులు
నడుస్తున్న చరిత్రంతా/తెలంగాణ కవులదే
జరుగుబాటుకు తిరుగుబాటుకు/పుట్టినిల్లురా తెలంగాణ
పోరాటాలకు పాఠ్యాంశం/జీవితాలకు విముక్తి సూత్రం నా తెలంగాణ
తెలంగాణ మార్చ్/తెలంగాణ మార్చ్
కవాతు కవాతు/ఇది జన ఆకాంక్షల కవాతు


కవాతు కవాతుైపజల కంట్లో ఒత్తేసుకుని చూస్తున్న
ఆశయాల కవాతు
తెలంగాణ కన్నెర్రజేస్తే/కేక పెట్టిన పది జిల్లాల పోరు కవాతు
కదం తొక్కి పదం పాడుతున్న
మహాదీర్ఘ యాత్రకు రిహార్సల్ ఈ కవాతు
కవాతు కవాతు/నా తెలంగాణ మండిన కన్నీళ్ళ కవాతు
ప్రజాహిత రాజకీయాల కొనసాగింపు ఈ కవాతు
ప్రళయాలను సృష్టించే లాంగ్‌మార్చ్...


తెలంగాణమార్చ్.. సామూహిక పాదముద్రల కవాతు
పొడిపొడిగా తడితడిగా/తెరపీయకుండా కురుస్తున్న వాన ఈ కవాతు
ఎగుస్తున్న దువ్వ, వీస్తున్న గాలి
ముంచుకొస్తున్న మబ్బుల వర్షం ఈ కవాతు
అమ్మతోడు ఇగ/ఇడిసిపెట్టమేనన్న జన తెలంగాణ
మహాజన తెలంగాణ/సబ్బండ వర్ణాల అక్షరమాల తెలంగాణ మార్చ్
ఇది ఆయుధాలతో యుద్ధం కాదు
ఆశయాలతో ఎగిసిన పిడికిళ్ళ పంట


వందలమంది తల్లుల గర్భశోకపు మాట ఈ తెలంగాణ మార్చ్
ఎదురొస్తే అడ్డంగా ఇసిరికొట్టే ఈదురుగాలి ఈ మార్చ్
చీకటిని చీల్చేసే పొద్దుపొడుపుల ఉద్యమ మార్చ్
తెగిన ఆవేశానికి ప్రాణం పోస్తున్న దీర్ఘయాత్ర
మహాప్రస్థానాలు, మరో ప్రస్థానాలకు
నిజరూప సందర్శిని ఈ జైత్రయాత్ర /ఇది మహాయాత్ర ఇది దీర్ఘయాత్ర..
ఇది యమ యాతనలకు విరుగుడు యాత్ర..

తెలంగాణ గుండెదండోరాల యాత్ర.. గుండెమండిన యాత్ర...
ఇది పోరు యాత్ర.. ఇది సలసల మండుతున్న సకలజన యాత్ర...
లాంగ్‌మార్చ్.. లాంగ్‌మార్చ్.. తెలంగాణ మార్చ్..
-జూలూరు గౌరీశంకర్
తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు

37

GOURI SHANKAR JULUR

Published: Sun,April 7, 2013 11:51 AM

యుద్ధ వచనం

ఇక తప్పదు, దెబ్బతప్పదు, దెబ్బలూ తప్పవు, సహనాన్ని ఎంతని అదిమిపెట్టాలిరా!ఆగ్రహాన్ని ఎవరూ కట్టేయలేరురా! అన్నీ చూస్తూనే ఉన్నాం, అన్నిం

Published: Sun,April 7, 2013 11:39 AM

‘తెలంగాణ’ లేకుండా తెలుగు మహాసభలా!

తెలంగాణ సాహిత్య సాంస్కృతిక ముఖ్యులు లేకుండా జరిగినవి ప్రపంచ తెలుగు మహాసభలు ఎట్లా అవుతాయి? తెలంగాణను గాయాలకు గురిచేశారు కాబట్టే ఈ న

Published: Sun,April 7, 2013 11:19 AM

వివక్షలే ఉద్యమాల పుట్టుకలు

ఒక ప్రాంతం సాంస్కృతిక ఆధిపత్యమే రెండు ప్రాంతాల మధ్య అనెక్యతకు ప్రధాన కారణంగా నిలుస్తుంది. ఒక ప్రాంతం తన సాంస్కృతిక ఆధిపత్యాన్నే రా