అమిత్ షా తప్పుడు వ్యూహం


Thu,September 22, 2016 11:40 PM

తమ తప్పుల్ని దాచిపెట్టి, ఎదుటివారిలో తప్పుల్ని వెతికే విధంగా ఆలోచించడం వల్ల అనుకూలత కంటే ప్రతికూల ఫలితాలే ఉంటాయని చరిత్ర చెబుతున్నది. చిన్న గీత, పెద్ద గీత తరహాలో అమిత్ షా ఆలోచించడం, అందుకు అనుగుణంగా ప్రజల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం ద్వారా మాత్రమే బీజేపీ బలం పెంచుకోవచ్చని ఆశించడం అందని ద్రాక్షగా మిగిలిపోక తప్పదు. ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం ద్వారా మాత్రమే పార్టీ బలపడుతుంది తప్ప నెగటివ్ రాజకీయాలతో ఆశించిన ఫలితాలు రావనేది చారిత్రక సత్యంబీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ పర్యటన కు ఎప్పుడు వచ్చినా ఒక ఎజెండాతోనే వస్తారన్న అభిప్రాయమున్నది.

vishwa
తెలంగాణ ప్రజల విశ్వసనీయతను కోల్పోయిన బీజేపీకి ప్రాణం పోయాలని అమిత్ షా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా బలపడాలనే కోరుకుంటుంది. బీజేపీ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. ప్రజల నాడికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవ డం ద్వారా పార్టీ బలపడుతుంది. కానీ అమిత్ షా మాత్రం దీనికి భిన్నంగా ప్రయాణిస్తునట్లు అర్థమవుతున్నది. ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించడం ద్వారా బలంగా ఉన్న టీఆర్‌ఎస్‌ను బలహీనపర్చవచ్చని, ఫలితంగా ఆ పరిణామాలను బీజేపీకి అనుకూలంగా మార్చుకోవచ్చని అనుకుంటున్నారు. అందుకు మజ్లిస్‌ను బూచీగా చూపి ప్రజల మధ్య చిచ్చుపెట్టే అస్ర్తాన్ని ఎంచుకున్నారు.
తరతరాలుగా గంగా-జమునా తెహజీబ్ స్ఫూర్తి తో హైదరాబాద్ నగరంలో మత సామరస్యంతోనే ప్రజలు జీవిస్తున్నారు. ఇలాంటి ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేసే విధంగా అమిత్‌షా వ్యాఖ్య లు చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు.

మజ్లిస్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రజల మధ్య విద్వేషాలను సృష్టించే రహస్య ఎజెం డా ఉన్నట్లున్నది. అందుకే మజ్లిస్ అంటే కేసీఆర్‌కు భయం అన్న వ్యాఖ్యలు చేశారు! ప్రధాని మోదీ స్వయంగా ఇదే తెలంగాణ గడ్డపై గజ్వేల్ బహిరంగసభలో సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టులను బీజేపీ పాలిత రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. తెలంగాణకు వచ్చి అధ్యయ నం చేసి వెళ్ళాయి. మిషన్ కాకతీయ ప్రాజెక్టును ఉమాభారతి పలు సందర్భాల్లో ప్రశంసించారు. కండ్ల ముందు ఇన్ని కనిపిస్తున్నా నిజంగా తెలంగా ణ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని, కేంద్రం నిధులు మంజూరు చేస్తూ ఉం టే వాటిని ప్రజల కోసం ఖర్చు పెట్టకుండా ప్రజా ప్రతినిధులను కొనడానికి వెచ్చించారని అమిత్ షా వ్యాఖ్యానించడం వెనక ఉద్దేశం ఏమిటి? ప్రధాని మోదీగానీ, ఉమాభారతి గానీ, పలువురు కేంద్ర మంత్రులుగానీ తెలంగాణ పాలనను సరిగా గ్రహించలేకపోయారని భావించాలా? వారి అభిప్రాయాలతో అమిత్ షా విభేదిస్తున్నారని అనుకోవాలా?
పార్టీ, ప్రభుత్వం జోడుగుర్రాల్లా ప్రయాణం చేయడం ద్వారా మాత్రమే ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతాయని బీజేపీ అగ్రనేతలు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. తాజాగా కేంద్ర మంత్రు లు సైతం ఇదే విధానాన్ని అవలంబిస్తున్నారు.

మోదీ ప్రవేశపెట్టిన పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్ళడానికి మంత్రులంతా ప్రతి రాష్ట్రంలో పర్యటించాలన్న నిర్ణయం జరిగింది. ఒకవేళ అమిత్ షా వ్యాఖ్యానించినట్లుగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు తెలంగాణలో సక్రమంగా అమలుకాకుంటే కేంద్ర మంత్రులు ఎక్కడా అసంతృప్తి వ్యక్తం చేయలేదెందుకు? ప్రధాని ప్రశంసలు గుప్పిస్తూ ఉంటే పార్టీ అధినేతగా అమిత్ షా విమర్శలు చేయడం దేనికి నిదర్శనం? ఒక జాతీయ పార్టీగా బీజేపీలో ఇద్దరు అగ్రనేతల మధ్య రెండు ధోరణులు ఉంటా యా? ఈ వైరుధ్యం ఎందుకు కనిపిస్తోంది? మోదీ, అమిత్ షాలు ఒకరికొకరు ఆత్మలుగా ఉంటారనే అభిప్రాయం ప్రజల్లో ఉన్నది. అలాంటి ఆత్మలు భిన్నంగా ఎందుకు ఆలోచిస్తున్నాయి?మోదీ, అమి త్‌షా వ్యాఖ్యలు చూస్తే ఇద్దరి మధ్య ఎంత వైరు ధ్యం ఉన్నదో స్పష్టమవుతున్నది.
తెలంగాణలో వివిధ పథకాలు సంతృప్తికరంగా మాత్రమే కాకుండా దేశంలో మరే రాష్ట్రంలో లేని తీరులో అమలవుతున్నాయని వివిధ మంత్రిత్వశాఖలు అవార్డులతో సత్కరించాయి. స్వచ్ఛభారత్‌లో కరీంనగర్ జిల్లాకు ఉత్తమ అవార్డు వచ్చింది. ప్రధా ని నరేంద్ర మోదీ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిన సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకం అమలు లో కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ దత్తత తీసుకున్న వీర్నపల్లి గ్రామం దేశంలోనే తొమ్మిదవ స్థానం సంపాదించుకున్నది.

నిజంగా అమిత్ షా మాటల ప్రకారమే చూస్తే స్కోచ్, ఇండియా టుడే, సీఎన్‌బీసీ లాంటి సంస్థలు తెలంగాణ రాష్ర్టానికి ఉత్తమ అవార్డులు ఎందుకిచ్చినట్లు? సీఎం కేసీఆర్ దేశంలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిన సీఎంలలో ఒకరిగా ఎందుకు గుర్తిం పు పొందారు. ఇవి అమిత్ షాకు కనబడడంలేదా? అంటే టీఆర్‌ఎస్‌ను ప్రత్యక్షంగా విమర్శించినట్లయితే దాన్ని ప్రజలు స్వీకరించరనే ఉద్దేశంతో అబద్ధాలను పదేపదే వల్లించడం ద్వారా ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించవచ్చన్నదే అమిత్ షా వ్యూహం. మజ్లిస్ లాంటి పార్టీతో తలపడే శక్తి ఉంటే ఆ దిశలో కార్యాచరణ చేపట్టడానికి బీజేపీకి ఎలాంటి ఆటంకాలూ లేవు. అందుకు టీఆర్‌ఎస్ సహా ఏ రాజకీయ పార్టీకీ ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. పార్టీ బలపడటం కోసం ప్రజల్లో విస్తృతంగా పని చేయాలె. ప్రభుత్వపరంగా ప్రజలకు సంక్షేమ పథకాలు, సేవలు, అభివృద్ధి పనులు అందకపోతే వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రభుత్వానికి వ్యతిరేకం గా పోరాడవచ్చు. ప్రతిపక్షాలు తరచూ దీన్నే పాటి స్తూ ఉంటాయి. రాజకీయాల్లో విశ్వసనీయతకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. నీతి తప్పిన రాజకీయాలను ప్రజలు ఎప్పుడూ నమ్మరు. పైగా చీదరించుకుంటారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చలేదన్నది సుస్పష్టం. ఆంధ్రప్రదేశ్‌పై అమిత ప్రేమ చూపిస్తున్న అమిత్‌షా ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు ఒత్తిడికి, ప్రలోభాలకు లొంగినట్లు భావించడానికి ఆస్కారం పుష్కలంగా ఉంది. తెలంగాణ ఏర్పాటై రెండున్నరేండ్లయినా చట్టంలో ఇచ్చిన హామీ ప్రకా రం హైకోర్టు విభజన ఇంతవరకూ పూర్తి కాలేదు. వెనకబడిన జిల్లాల అభివృద్ధికి ఒక్కో జిల్లాకు 50 కోట్ల చొప్పున ఏటా ఇచ్చే నిధుల్ని తెలంగాణకు ఇవ్వడంలో వివక్ష కొనసాగుతూ ఉన్నది. ఏపీకి వరుసగా మూడు సంవత్సరాలకూ ఏడు జిల్లాలకు 1,050 కోట్లను విడుదల చేసిన కేంద్రం తెలంగాణకు మాత్రం తొమ్మిది జిల్లాలకు కేవలం ఒక్క సంవత్సరమే 450 కోట్లను విడుదల చేసి చేతులు దులుపుకున్నది. ఇంకా రెండు సంవత్సరాలకు రావాల్సిన నిధులు రానేలేదు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కేంద్రం కనికరించలేదు. ప్రతి రాష్ర్టానికి ఒక జాతీయ ప్రాజెక్టును ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా ఈ రెండున్నరేండ్లలో తెలంగాణ విషయం లో మాత్రం ఇంకా దయ చూపలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాల్లో తెలంగాణను కేంద్రం విస్మరించిందనడానికి ఆధారాలున్నాయి.

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ప్రాజెక్టులకు దేశవ్యాప్తంగా మంచిపేరు వస్తూ ఉంటే వాటిని క్షేత్రస్థాయిలో పర్యటించి అధ్యయనం చేసిన నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సహా పలువురు అధికారులు ఆర్థికసాయం చేయాల్సిందిగా నాలుగు నెలల కింద ట కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు సిఫారసు చేశారు. ఇప్పటికీ ఆ గొంగడి అక్కడే ఉంది. ప్రజలకు నేరు గా ప్రయోజనం కలిగే ఈ పథకాలకు కేంద్రం ఎం దుకు ప్రాధాన్యం ఇవ్వడంలేదు. ఈ పథకాలు సమర్థంగా అమలైతే రాష్ట్ర ప్రభుత్వానికి మంచిపేరు వస్తుంది కాబట్టి వీలైనంత వరకు అవి ఉనికిలోకి రాకుండా, ప్రజలకు చేరకుండా ఉంటే ఆ మేరకు తెలంగాణ ప్రభుత్వం ప్రజల్లో పల్చబడుతుంది. కాబట్టి ఆర్థికంగా ఇబ్బందులు కలిగించి బద్నాం అయ్యే పరిస్థితుల్ని కల్పించాలన్నది బీజేపీ ప్రయ త్నం. కానీ ఈ ప్రాజెక్టుల దీర్ఘకాలిక ప్రయోజనాలు గమనించిన అనేక ద్రవ్య సంస్థలు రుణాలు ఇవ్వడానికి ముందుకొచ్చాయి.

తమ తప్పుల్ని దాచిపెట్టి, ఎదుటివారిలో తప్పు ల్ని వెతికే విధంగా ఆలోచించడం వల్ల అనుకూలతకంటే ప్రతికూల ఫలితాలే ఉంటాయని చరిత్ర చెబు తున్నది. చిన్న గీత, పెద్ద గీత తరహాలో అమిత్ షా ఆలోచించడం, అందుకు అనుగుణంగా ప్రజల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం ద్వారా మాత్రమే బీజేపీ బలం పెంచుకోవచ్చని ఆశించడం అందని ద్రాక్షగా మిగిలిపోక తప్పదు. ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం ద్వారా మాత్రమే పార్టీ బలపడుతుంది తప్ప నెగటివ్ రాజకీయాలతో ఆశించిన ఫలితాలు రావనేది చారిత్రక సత్యం. బీజే పీ అగ్రనేత అమిత్‌షా ఈ చారిత్రక సత్యాన్ని ఎంత తొందరగా తెలసుకుంటే అంత మంచిది.

43

DHURJATI MUKHARJI

Featured Articles