మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Oct 15, 2020 , 01:04:04

కథాబలమున్న చిత్రాలే నిర్మిస్తాను

కథాబలమున్న చిత్రాలే నిర్మిస్తాను

‘శారీరక వర్ణం పరంగా ఉండే వివక్ష, అసమానతల్ని సీరియస్‌ కోణంలో ఆవిష్కరిస్తూ నిజాయితీగా తెరకెక్కించిన చిత్రమిది. నా నిజజీవితంలో ఎదురైన అనుభవాల నుంచి స్ఫూర్తి పొంది ఈ కథరాసుకున్నాను’ అని అన్నారు సాయిరాజేష్‌నీలం. బెన్నీ ముప్పానేనితో కలిసి ఆయన నిర్మించిన చిత్రం ‘కలర్‌ఫొటో’. సుహాస్‌, చాందినిచౌదరి జంటగా నటించారు. సందీప్‌రాజ్‌ దర్శకుడు. ఈ నెల 23న ఆహా ఓటీటీ ద్వారా ఈ చిత్రం విడుదలకానుంది. బుధవారం సాయిరాజేష్‌ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ప్రేమకథకు  వినోదం, భావోద్వేగాలను మేళవిస్తూ తెరకెక్కించిన చిత్రమిది.  1996-97 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. సాంకేతికత అందుబాటులో లేని ఆ కాలంలో ప్రేమకథలు ఎలా ఉండేవి? ప్రణయరాయబారాలు ఏ విధంగా నడిచేవో ఈ సినిమాలో చూపించబోతున్నాం. నిర్మాతగా నా గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్‌ కథాంశంతో ఈసినిమాను తెరకెక్కించాం. ట్రైలర్‌ చూసి పలువురు సినీ ప్రముఖులు ప్రశంసించారు. మా సంస్థకు గౌరవాన్ని తీసుకొచ్చే చిత్రమవుతుందనే నమ్మకముంది. భవిష్యత్తులో నిర్మాతగా కథాబలమున్న చిన్న సినిమాల్నే నిర్మిస్తాను. కమర్షియల్‌ సినిమాల్ని రూపొందించే సాహసం చేయను. హీరోగా ఈ చిత్రం సుహాస్‌కు చక్కటి శుభారాంభాన్ని అందిస్తుందనే నమ్మకముంది.  చాందిని చౌదరి తన పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేసింది. గోదావరి వెటకారంతో విలనిజాన్ని పండించే ప్రతినాయకుడిగా సునీల్‌ పాత్ర విభిన్నంగా సాగుతుంది’ అని తెలిపారు. 
logo