ఏదో ఒక మార్గంలో ప్రేమకు ప్రతిస్పందన వ్యక్తం చేయడం అవశ్యమనే వినూత్నమైన పాయింట్‌తో ఫీల్ మై లవ్ అంటూ ‘ఆర్య’ సినిమాతో తెలుగు చిత్రసీమలో సంచలనం సృష్టించారు ప్రముఖ దర్శకుడు సుకుమార్. అదే సృజనాత్మక ఒరవడిలో వయొలెన్స్ ఈజ్ ఫ్యాషన్ అంటూ గ్యాంగ్‌వార్ డ్రామాగా ‘జగడం’ చిత్రాన్ని రూపొందించారు. సుకుమార్ నిర్దేశకత్వంలో వచ్చిన ‘జగడం’ యాక్షన్ చిత్రాల్లో ప్రత్యేకంగా నిలిచిపోయింది. రామ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం విడుదలై నేటికి పద్నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఈ సినిమా 15వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని రామ్‌తో ‘జగడం’ రీమేక్‌ను తెరకెక్కించాలనే అభిలాషను వ్యక్తం చేశారు సుకుమార్. ఆయన మాట్లాడుతూ “ఆర్య’ కంటే ముందే ఈ కథ అనుకున్నా. అప్పటికే నా దగ్గర చాలా ప్రేమకథలున్నాయి. అయితే వయొలెన్స్ నేపథ్యంలో ఏదైనా సినిమా చేద్దామనుకొని ‘జగడం’ కథ తయారుచేసుకున్నా. ఈ సినిమా షూటింగ్ సమయానికి రామ్ వయసు పదిహేడేళ్లు. తొలి చిత్రం ‘దేవదాస్’ విజయంతో ఉత్సాహంగా ఉన్నాడు. అప్పుడే రామ్‌తో సినిమా చేయాలని ‘స్రవంతి’ రవికిషోర్‌ను కలిశాం. ఆయన అంగీకరించడంతో సినిమా మొదలైంది. ఆ టైమ్‌లో రామ్ ఏది చెప్పినా చేసేవాడు. చేత్తో కాయిన్ తిప్పమని అడిగితే పదినిమిషాల్లో ప్రాక్టీస్ చేశాడు. రామ్‌లోని ఆ షార్ప్నెన్ వల్లే ఇప్పటికి విజయాలు వరిస్తున్నాయి. సంగీతపరంగా ‘జగడం’ సంచలనం సృష్టించింది. దేవిశ్రీప్రసాద్ స్వరాలు ఉర్రూతలూగించాయి. చంద్రబోస్ రాసిన ‘5 ఫీట్ 8 ఇంచెస్’ పాట విశేష ఆదరణ సొంతం చేసుకుంది. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు చేసిన సినిమాల్లో ‘జగడం’ ఉత్తమమైనదిగా చెప్పొచ్చు. అప్పట్లో స్టీవెన్ స్పీల్బర్గ్ తన సినిమాలకు ఉపయోగించిన సాంకేతికతను ఈ సినిమా కోసం మేమూ ఉపయోగించాం. సూపర్ 35 ఫార్మాట్లో చిత్రీకరణ జరిపాం. ముంబైలోని చాలా మంది దర్శకుల లైబ్రరీలలో ‘జగడం’ సినిమా ఉందని, టెక్నికల్ రిఫరెన్స్‌గా సినిమాను వాడుకుంటున్నారని ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్‌గారు నాకు ఓ సందర్భంలో చెప్పారు. రామ్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. త్వరలో తప్పకుండా చేస్తా. రామ్‌తో ‘జగడం’ రీమేక్ చేయాలని ఉంది’ అని చెప్పారు.