మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Oct 02, 2020 , 02:03:49

థియేటర్లో బొమ్మ బ్లాక్‌బస్టర్‌ అవుతుందా!

థియేటర్లో బొమ్మ బ్లాక్‌బస్టర్‌ అవుతుందా!

థియేటర్లలో ప్రేక్షకుల చప్పట్లు, విజిల్స్‌  వినిపించి ఆరు నెలలు దాటిపోయింది.  బాక్సాఫీస్‌ రికార్డులు, ఓపెనింగ్స్‌ లెక్కలు, ఆన్‌లైన్‌బుకింగ్స్‌  ఊసులేదు. ఒకప్పుడు ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు,  అభిమానుల కోలాహంలంతో సందడిగా కనిపించే థియేటర్లు  లాక్‌డౌన్‌ కారణంగా నిర్మానుష్యంగా మారిపోయాయి. కరోనా ప్రభావంతో థియేటర్స్‌, మల్టీప్లెక్స్‌లు  మూడువేల కోట్ల రూపాయల్ని నష్టపోయాయి. అన్‌లాక్‌ పేరుతో ప్రభుత్వం అన్ని రంగాలకు అనుమతులు ఇస్తున్న నేపథ్యంలో థియేటర్‌లను పునఃప్రారంభించాలంటూ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. సినిమా తాలూకు వినోదానికి దూరమైన సగటు  అభిమానులు సైతం ఆ అనందాన్ని ఆస్వాదించే రోజు కోసం చాలా రోజులుగా నిరీక్షిస్తున్నారు. అన్‌లాక్‌-5లో భాగంగా అక్టోబర్‌ పదిహేను నుంచి థియేటర్‌లను పునఃప్రారంభించుకోవచ్చని ప్రభుత్వం కొన్ని నిబంధనలతో కూడిన ఆదేశాలు జారీ చేసింది. దీంతో థియేటర్ల పునఃప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కరోనా సంధికాలంలో తలెత్తిన పరిస్థితుల్ని థియేటర్ల యాజమాన్యాలు ఎలా అధిగమిస్తాయి? పూర్వంలా ప్రేక్షకులు థియేటర్లకు తరలివస్తారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఓటీటీ టు థియేటర్‌ 

ఓటీటీకి, టీవీలకు అలవాటుపడిన ప్రేక్షకుల్ని తిరిగి సినిమా హాళ్లకు రప్పించడమనే అతిపెద్ద సవాల్‌ థియేటర్‌ వర్గాలపై ఉన్నది. థియేటర్‌లు మూతపడటంతో  మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో చాలా మంది నిర్మాతలు ఓటీటీల ద్వారా తమ సినిమాల్ని విడుదలచేశారు. అగ్రనాయకానాయికలు నటించిన చిత్రాలు సైతం ఓటీటీ ద్వారా అభిమానుల ముందుకొచ్చాయి. తొలుత ఓటీటీలో సినిమాల విడుదల పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికి   నెమ్మదిగా ప్రేక్షకులు ఆ పంథాకు అలవాటుపడిపోయారు. గత కొన్ని నెలలుగా ఓటీటీకి అలవాటుపడిన ప్రేక్షకులు భయాల్ని పక్కనపెట్టి  థియేటర్‌లకు వస్తారా? అన్నది పెద్ద సందేహంగా మారింది. పూర్వం మాదిరిగా థియేటర్లు ప్రేక్షకులతో  సందడి చేస్తాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్‌ నోలన్‌ దర్శకత్వంలో ఎన్నో అంచనాలతో రూపొందిన హాలీవుడ్‌ చిత్రం ‘టెనెట్‌' సినిమా వసూళ్లే అందుకు  ఉదాహరణగా చెప్పవచ్చు. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత అమెరికాతో పాటు పలు దేశాల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సరైన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అమెరికాలో ఈ సినిమా కేవలం నలభై మిలియన్ల డాలర్ల వసూళ్లు మాత్రమే సాధించింది. థియేటర్లలో ఈ సినిమాకు 25 నుంచి 40 మధ్య ఆక్యుపెన్సీ నమోదైంది.  ప్రేక్షకుల్ని థియేటర్‌లకు రప్పించడానికి హాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు టామ్‌  క్రూజ్‌ సైతం ‘టెనెట్‌' సినిమాను థియేటర్‌లో చూస్తూ ప్రచారం చేశారు.    అయినప్పటికి ఈ సినిమా సాధారణ వసూళ్లను రాబట్టింది. కోవిడ్‌ పరంగా అత్యున్నత భద్రతా ప్రమాణాల్ని  పాటించే అమెరికాలాంటి దేశాల్లో  పరిస్థితి ఆ విధంగా ఉంటే మన దేశంలోని ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో అనే సందేహాలు వ్యక్తమవు తున్నాయి.

థియేటర్లపై అదనపుభారం? 

థియేటర్‌ల ప్రారంభానికి అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం కేవలం యాభై శాతం ఆక్యుపెన్సీతోనే వాటిని నడుపుకోవాలనే నిబంధన విధించింది.  కరోనా కారణంగా అసలే నష్టాల్లో మునిగిపోయిన థియేటర్ల వ్యవస్థపై ఈ నిబంధన మూలిగే నక్కపై తాటికాయపడ్డ చందంగా మారింది. ప్రస్తుతమున్న నిర్వహణ వ్యయాలకు తోడు కోవిడ్‌ జాగ్రత్తల పేరుతో ప్రతి షోకు శానిటైజ్‌ చేయడం వంటి కొత్త  చర్యల వల్ల  థియేటర్‌లపై అదనపు భారం పడే అవకాశం ఉందంటున్నారు. వీటన్నింటిని భరిస్తూ యాభై శాతం ఆక్యుపెన్సీతో నడిపిస్తే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు పూర్తిగా నష్టపోయేప్రమాదముందనేది కొందరి వాదన. ముఖ్యంగా సింగిల్‌స్క్రీన్‌ థియేటర్‌లకు ఈ నిబంధన శరాఘాతంగా మారింది. ఇప్పటికే నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న సింగిల్‌స్క్రీన్‌ యజమానులు ఈ నిబంధనల్ని పాటిస్తూ థియేటర్‌లను నడపటం కష్టమనే చెబుతున్నారు. ఈ నష్టాల్ని భరించడానికి టికెట్‌ రేట్లు పెంచుతారనే ఊహాగానాలు వ్యక్తమవుతుంది. అయితే ప్రేక్షకుల నుంచి విముఖత ఎదురయ్యే ఆస్కారం ఉండటంతో థియేటర్ల యాజమాన్యాలు పునరాలోచనలో పడ్డారని అంటున్నారు. క్షేత్రస్థాయిలో ఇలాంటి  సవాళ్లను థియేటర్ల వ్యవస్థ ఏ విధంగా అధిగమిస్తుందో వేచి చూడాల్సిందే.

నిర్మాతలు సిద్ధమేనా?

ఒకవేళ థియేటర్‌లు ప్రారంభమైనా చాలా మంది నిర్మాతలు తమ సినిమాల్ని వెంటనే విడుదల చేసేందుకు సిద్ధంగా లేరు. యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్ల నిర్వహణ భారం కాస్త కష్టమే అంటున్నారు. నిర్మాతలు, పంపిణీదారులు కూడా పూర్తిస్థాయి ఆక్యుపెన్సీతో అయితే కొంతమేరకు ప్రేక్షకుల స్పందన తెలుసుకునే అవకాశం వుందని చెబుతున్నారు.  ప్రేక్షకు స్పందనను బట్టి తమ సినిమాల్ని విడుదలచేయాలనే ఆలోచనలో వారున్నారు.    అగ్ర హీరోల సినిమాలు విడుదలైతేనే థియేటర్లు కొంతవరకు నష్టాల్ని అధిగమించగలమని ట్రేడ్‌ వర్గాల్లో వినిపిస్తోంది. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలతో థియేటర్లు నడపడానికి  మేము సిద్ధంగా వున్నాం. దసరా వరకు థియేటర్లు పున: ప్రారంభమవుతాయని ఆశిస్తున్నాం. యాభై శాతం ఆక్యుపెన్సీతో నడపటం కష్టమే అయినా.. థియేటర్లో సినిమా చూడటం కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. సినిమా బాగుంటే.. ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్‌ ఉంటే తప్పకుండా ప్రేక్షకులు డబుల్‌ జోష్‌తో థియేటర్లకు వస్తారని అనుకుంటున్నాం. మల్లీప్లెక్స్‌ల వరకు శానిటైజేషన్‌, ఇతర కోవిడ్‌ నిబంధనలతో సినిమాల ప్రదర్శన సాధ్యమే కానీ సింగిల్‌స్క్రీన్‌ థియేటర్స్‌లో ఆ నిర్వహణ భారం కాస్త కష్టమే. పరిస్థితులు అన్ని బాగుంటే డిసెంబర్‌ 15న మేము శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవిలతో నిర్మించిన ‘లవ్‌స్టోరీ’ని థియేటర్‌లోనే విడుదల చేయడానికి సిద్ధంగా వున్నాం. 

-సునీల్‌ నారంగ్‌, ప్రముఖ నిర్మాత, 

పంపిణీదారుడు

యాభైశాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్‌ నిర్వహణ సాధ్యపడదు. థియేటర్స్‌ నడవాలంటే సినిమాల విడుదల చేయాలి. యాభై శాతం ఆక్యుపెన్సీపై సినిమాల విడుదల చేయాలంటే నిర్మాతలు ధైర్యం చేయరు. కాకపోతే చిన్నసినిమాలు, తక్కువ బడ్జెట్‌తో రూపొందిన చిత్రాలకు ఈ మార్గదర్శకాలతో వర్కవుట్‌ అయ్యే అవకాశం వుంది. థియేటర్లు పూర్తిస్థాయిలో ప్రారంభం అయినప్పుడే అందరికి లాభదాయకంగా వుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. 

-  శిరీష్‌, ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు. 


logo