ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 03, 2020 , 00:00:54

వారసత్వంతో ఎదిగితే తప్పేముంది?

వారసత్వంతో ఎదిగితే తప్పేముంది?

బాలీవుడ్‌ చిత్రసీమలోని బంధుప్రీతి, వారసుల ఆధిపత్యం వల్ల  సినీ నేపథ్యం లేని కొత్తవారు ఎదగలేకపోతున్నారనే విమర్శలు అర్థంలేనివని చెప్పింది మిల్కీబ్యూటీ తమన్నా. తన కుటుంబానికి పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేకపోయినా స్వీయప్రతిభతో రాణించానని గుర్తుచేసింది. ఆమె మాట్లాడుతూ ‘ముంబయి నుంచి నేను దక్షిణాది ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. నాకు ఇక్కడి భాషాసంస్కృతులపై ఏమాత్రం అవగాహన లేదు. అయినా అవకాశాల్ని అందిపుచ్చుకొని విజయవంతమైన నాయికగా ఎదిగాను. నా కష్టఫలంతో పాటు అదృష్టం కలిసిరావడం కూడా విజయాలకు కారణమైంది’ అని చెప్పింది. పరిశ్రమలోని బంధుప్రీతి గురించి మాట్లాడుతూ ‘ప్రతి రంగంలో బంధుత్వాలను ఉపయోగించుకొని అవకాశాలు పొందిన వారుంటారు. అయితే అదొక్క టే విజయానికి కొలమానం కాదు. నా కుటుంబంలో చాలా మంది డాక్టర్లున్నా రు. ఒకవేళ నేను వైద్యవృత్తిలోకి వెళ్లాలనుకుంటే వారంతా సహాయం చేసేవారు. అలాగే రేప్పొద్దున నా పిల్లలెవరైనా సినీరంగంలోకి వెళ్లాలనుకుంటే నేను ప్రోత్సహిస్తాను. అలా చేయడం తప్పెలా అవుతుంది’ అని ప్రశ్నించింది. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకున్నా షారుఖ్‌ఖాన్‌ వంటి హీరోలు తిరుగులేని పేరుప్రఖ్యాతుల్ని సంపాదించుకున్నారని..అంతిమంగా ప్రతిభ ఆధారంగానే గుర్తింపు లభిస్తుందని తమన్నా పేర్కొంది. ‘బాహుబలి’లో నటించడం తన సినీ కెరీర్‌ను మలుపుతిప్పిందని, ఆ సినిమా అఖండ విజయం ఇచ్చిన స్ఫూర్తితో ఎలాంటి పాత్రకైనా న్యాయం చేయగలననే ధీమా ఏర్పడిందని చెప్పింది.logo