బుధవారం 20 జనవరి 2021
Cinema - Nov 29, 2020 , 19:20:16

సొంత ఇల్లు అమ్ముకున్న రాజశేఖర్..కారణాలు తెలుసా..?

సొంత ఇల్లు అమ్ముకున్న రాజశేఖర్..కారణాలు తెలుసా..?

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో రాజశేఖర్ కూడా కచ్చితంగా ఉంటాడు. 90ల్లో ఈయన సంచలన విజయాలు సాధించాడు. రాజశేఖర్ సినిమాలు ఆల్ టైమ్ క్లాసిక్స్ కూడా అయ్యాయి. చిరంజీవి లాంటి అగ్ర హీరోలతో పోటీ పడ్డాడు ఈయన. 90ల్లో ఈయనకంటూ సపరేట్ ఫ్యాన్ పాలోయింగ్ ఉండేది. తమిళనాడు నుంచి వచ్చి తెలుగులో జెండా పాతాడు ఈయన. అలాంటి హీరో ఒకానొక సమయంలో చాలా ఇబ్బందుల్లో పడిపోయాడు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇల్లు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయం గురించి రాజశేఖర్ కూడా ఎప్పుడూ పెద్దగా స్పందించింది లేదు. కానీ ఈ మధ్యే సన్నిహితులతో తన మనసులో బాధ చెప్పుకున్నట్లు తెలుస్తుంది. కరోనా సమయంలో బతికి బయటికి వచ్చిన ఈ సీనియర్ హీరో.. తన కష్టాల గురించి ఇండస్ట్రీ స్నేహితులతో చెప్పుకున్నాడని ప్రచారం జరుగుతుంది. 

ఒకప్పుడు రాజశేఖర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉండేది..మార్కెట్ కూడా ఉండేది. కానీ 2000 తర్వాత ఈయన మెల్లగా కనుమరుగు అవుతూ వచ్చాడు. అప్పుడప్పుడూ ఒకట్రెండు సినిమాలతో మెరవడమే కానీ విజయం సాధించింది మాత్రం తక్కువే. అప్పుడెప్పుడో తలంబ్రాలు, వందేమాతరం లాంటి సినిమాలతో కెరీర్ మొదలు పెట్టి..అంకుశం, ఆహుతి, మగాడు లాంటి సినిమాలతో యాంగ్రీ యంగ్ మ్యాన్ అనిపించుకున్నాడు రాజశేఖర్. ఆ తర్వాత 'అన్న', అల్లరి ప్రియుడు' 'శివయ్య', 'మనసున్న మారాజు', 'మా అన్నయ్య', సింహరాశి, 'ఎవడైతే నాకేంటి', 'గోరింటాకు' లాంటి విజయాలతో తన రేంజ్ పెంచుకున్నాడు. మూడేళ్ల కింద PSV గరుడ వేగ సినిమాతో ఉనికి చాటుకున్నాడు రాజశేఖర్. కల్కి పర్లేదు అనిపించింది. 

అయితే ఒకానొక సమయంలో రాజశేఖర్ సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అయ్యాయి. కనీసం ఈయన సినిమా వచ్చిందంటే పట్టించుకున్న వాళ్లు కూడా లేరు. గడ్డం గ్యాంగ్ లాంటి సినిమాలు ఎప్పుడొచ్చాయో కూడా తెలియదు. వాటిని సొంతంగా నిర్మించి చేతులు కాల్చుకున్నాడు రాజశేఖర్. అలాంటి సమయంలో అప్పుల బాధ తట్టుకోలేక చెన్నైలో ఉన్న తన రెండు ఇండ్ల‌ను అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ  తన వాళ్లతో రాజశేఖర్ చెప్పుకున్నట్లు తెలుస్తుంది. ఎవడైతే నాకేంటి సినిమాతో హిట్ కొట్టి గోరింటాకుతో సూపర్ హిట్ అందుకున్నాడు రాజశేఖర్. ఈ రెండు సినిమాలు ఆయన్ని నిలబెట్టాయి. ఆ తర్వాత పదేళ్లకు పీఎస్‌వీ గరుడ వేగతో గుర్తు చేసాడు రాజశేఖర్. ఏదేమైనా కూడా ఒకప్పటి స్టార్ హీరోకు ఇన్ని కష్టాలు రావడం అభిమానులు కూడా తట్టుకోలేకపోతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo