గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ‘మా ’ అధ్యక్ష (Maa Elections) (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఎన్నికల విషయం తెరపైకి వచ్చినప్పటి నుంచి ప్రస్తుతమున్న పాలక వర్గ సభ్యులు, కొత్తగా ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే లోకల్, నాన్ లోకల్ అంటూ ఇప్పటికే పలువురు వ్యక్తులు చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారింది. మా కు సొంత భవనం ఉండాలని గతంలో చెప్పిన మంచు విష్ణు..తాజాగా ఈ విషయాన్ని మరోసారి లేవనెత్తడంతో ఇపుడీ విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది.
తాజాగా ఆదివారం మా సర్వసభ్య సమావేశం వర్చువల్ గా (Maa Virtual Meeting) జరిగింది. సినీ రంగ ప్రముఖులు, సాంకేతిక నిపుణులు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. ‘మా ’ ఎన్నికలపై సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొంత మంది ఎన్నికలను సెప్టెంబర్ లో నిర్వహించాలంటే, మరికొందరేమో అక్టోబర్ లో పెట్టాలని సూచనలు చేశారు. వారం రోజుల్లో ఎన్నికల తేదీలు ప్రకటిస్తామని సీనియర్ యాక్టర్లు కృష్ణంరాజు, మురళీ మోహన్ (Murali Mohan) తెలుపగా..మరోవైపు డీఆర్సీ కమిటీ ఎలా సూచిస్తే అలా చేస్తామని ప్రస్తుత మా అధ్యక్షుడు నరేశ్ అన్నారు.
వారం రోజుల్లో ఎన్నికల తేదీలు : మురళీమోహన్
జనరల్ బాడీ సమావేశం కావడం సంతోషకరమైన విషయమని సీనియర్ నటుడు మురళీమోహన్ అన్నారు. వారం రోజుల్లో ఎన్నికల తేదీలను ప్రకటిస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో 21 రోజుల్లో ఎన్నికలను నిర్వహించడం సాధ్యం కాని పని. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని..సామాజిక దూరం పాటిస్తూ ఎన్నికలు నిర్వహించాలి. సెప్టెంబర్ రెండో వారం నుంచి అక్టోబర్ రెండో వారం మధ్యలో అనుకూలమైన సమయం చూసి..ఆ తేదీన ఎన్నికలు నిర్వహిస్తాం. అప్పటివరకు అందరూ సంయమనంతో ఉండాలని మురళీమోహన్ కోరారు.
ఇప్పటి వరకున్న మా టీం సభ్యులు అంతా చక్కగా పనిచేశారని ప్రకాశ్ రాజ్ (Prakash Raj) అన్నారు. ఎన్నికలు జరగాలి. 21 రోజుల నిబంధనల ప్రకారమైతే సెప్టెంబర్ 12న డేట్ ఫిక్సవుతుంది. అవసరమైతే మరో వారం టైం తీసుకుని ఎన్నికలు పూర్తి చేయాలని, మరింత టైం పొడిగించాల్సిన అవసరం లేదని ప్రకాశ్ రాజ్ సూచించారు.
భవనం కొని అమ్మేశా రు : మోహన్ బాబు
మరోవైపు ‘మా’ కోసం భవనం కొని అమ్మేశారని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. రూపాయికి కొన్న భవనాన్ని అర్థ రూపాయికి అమ్మేశారని, భవనం అమ్మకంపై ఎవరైనా మాట్లాడారా..? అని మోహన్ బాబు ప్రశ్నించారు. మా గొప్ప సంస్థ అని, ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారని, అందరూ కలిసి సమిష్టి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
ఇవికూడా చదవండి..
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ
Raashi Khanna | రాశీఖన్నాకు మారుతి ఆశీర్వచనాలు..ట్రెండింగ్ లో స్టిల్
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!