శనివారం 16 జనవరి 2021
Cinema - Dec 01, 2020 , 18:22:50

కోట, బాబూమోహ‌న్ రైలులో టాయ్‌లెట్ దగ్గర పడుకునే వాళ్లట‌..!

కోట, బాబూమోహ‌న్ రైలులో టాయ్‌లెట్ దగ్గర పడుకునే వాళ్లట‌..!

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ నటుల్లో కోట శ్రీనివాసరావు పేరు ప్రముఖంగా చెప్పాలి. ఎక్కడో బ్యాంక్ ఉద్యోగిగా ఉన్న ఈయన.. ఎలాంటి ఆడిషన్స్ ఇవ్వకుండానే నటుడు అయ్యాడు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాలో చిన్న వేషంలో కనిపించినా కూడా 1985లో టి కృష్ణ తెరకెక్కించిన వందేమాతరం సినిమాతో పాపులర్ అయ్యాడు. అక్కడ్నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు కోట శ్రీనివాసరావు. ఇప్పటి వరకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీలో కలిపి 750 సినిమాలు చేసాడు కోట. ఇదిలా ఉంటే తాజాగా అలీతో సరదాగా షోకు బాబు మోహన్‌తో కలిసి వచ్చిన కోట.. తన కెరీర్ లో జరిగిన కొన్ని కీలకమైన సంఘటనల గురించి చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా తనకు బాబు మోహన్ తో ఉన్న అనుబంధం గురించి చెప్తూనే తనను ఆట పట్టించాడు ఈ సీనియర్ నటుడు. 


ఇప్పుడు అంటే అవకాశాలు తగ్గిపోయాయి కానీ ఒకప్పుడు మాత్రం ఈయనకు చేతినిండా పనే. ఒక్క రోజు కూడా షూటింగ్ లేకుండా ఉండేవాళ్లు కాదు. కుటుంబాన్ని చూడ్డానికి కూడా సమయం దొరికేది కాదని.. తన పిల్లలు ఎలా పెరిగి పెద్దవాళ్లయ్యారో కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చాడు కోట శ్రీనివాసరావు. ఈ క్రమంలోనే తనకు జరిగిన గమ్మత్తైన అనుభవం గురించి గుర్తు చేసుకున్నాడు కోట. అందులో బాబు మోహన్ కూడా ఉన్నాడు. 90ల్లో ఈ జోడీకి అదిరిపోయే క్రేజ్ ఉండేది. ఇద్దరూ కలిసి దాదాపు 80 సినిమాల్లో కూడా నటించారు. బాబు మోహన్, కోట కామెడీకి పిచ్చెక్కిపోయే వాళ్లు ఆడియన్స్. అలాంటి సమయంలో ఓ సినిమా షూటింగ్ కోసం ఓ ఊరు వెళ్లాల్సి వచ్చిందని.. అప్పుడు ఫ్లైట్స్ తక్కువే ఉండేవని.. దాంతో ట్రెయిన్ లోనే వెళ్లే వాళ్లమని చెప్పాడు కోట. 


ఒక్కరోజు కూడా సెలవు లేకుండా దాదాపు పదేళ్లు పని చేసామని చెప్పాడు కోట శ్రీనివాసరావు. అంతేకాదు ఒక్కోసారి షూటింగ్ కు టైమ్ అయిపోతుంటే.. టికెట్ కోసం లైన్ లో వేచి చూడటం దండగ అని ట్రెయిన్ లోనే టాయ్‌లెట్ దగ్గర చెక్క ముక్క ఒకటి వేసుకుని పడుకునే వాళ్లమని చెప్పాడు. అలా ఒకటి రెండు సార్లు కాదు ఎన్నో వందల సార్లు చేసామని చెప్పాడు ఈయన. చెక్కపై తాను పడుకుంటే.. కాళ్ల దగ్గర బాబు మోహన్ పడుకునే వాడని చెప్పాడు కోట శ్రీనివాసరావు. అలాంటి ఎన్నో గుర్తులు తన జీవితంలో ఉన్నాయని.. నటుడికి టైమ్ వచ్చినపుడు కుటుంబంతో గడిపే టైమ్ దొరకదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పాడు ఈయన. ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉన్నాడు కోట. తనకు అవకాశాలు ఇవ్వడం లేదని మీడియా ముఖంగానే చెప్పుకొచ్చాడు ఈ సీనియర్ నటుడు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.