శనివారం 16 జనవరి 2021
Cinema - Dec 02, 2020 , 00:04:18

మహానగరి సౌభాగ్యానికే ఓటు

మహానగరి సౌభాగ్యానికే ఓటు

ప్రజాస్వామ్యంలో ఓటు బ్రహ్మాస్త్రం. ప్రజల తలరాతను తిరగరాసే తిరుగులేని  ఆయుధం. మెరుగైన సమాజానికి దిశానిర్ధేశనం చేసే దిక్సూచి. ఆ స్ఫూర్తిని చాటుతూ గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో సినీతారలు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  సామాజిక బాధ్యతగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించి సామాన్య ప్రజల్లో చైతన్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. అగ్ర కథానాయకులు చిరంజీవి, నాగార్జున మొదలుకొని యువతరం హీరోలు విజయ్‌ దేవరకొండ, రామ్‌, నిఖిల్‌తో పాటు తారాలోకం ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహానగరం హైదరాబాద్‌ అభివృద్ధి, శాంతిసౌభాగ్యాలు కాంక్షిస్తూ ఈ ఎన్నికల్లో ఓటు ద్వారా తమ వంతు బాధ్యతను నిర్వర్తించామని ఆనందం వ్యక్తం చేశారు. ఓటేసిన అనంతరం తీసుకున్న ఫొటోల్ని సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ దఫా ఎన్నికల్లో పోలింగ్‌శాతం ఆశించిన మేరకు లేకున్నా సినీ సెలబ్రిటీలు మాత్రం పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనడం విశేషం. పోలింగ్‌ మొదలైన తొలిగంటల్లోనే చాలా మంది తారలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలందరూ విధిగా ఓటింగ్‌లో పాల్గొనాలని సినీతారలు పిలుపునిచ్చారు