తమిళ కమెడీయన్ వివేక్ గుండెపోటుతో చెన్నైలోని సిమ్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అతని పరిస్థితి విషమంగా ఉందని కొద్ది గంటలు గడిస్తే ఏ విషయం అన్నది చెప్పలేమని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం వివేక్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేక వైద్య బృందం వివేక్‌ను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ అందుకు సంబంధించి వైద్యం అందిస్తున్నారు.
తమిళ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వివేక్ దాదాపు 220 సినిమాలు చేశాడు. ఇతనికి 2009లో పద్మశ్రీ అవార్డ్ కూడా దక్కింది. వివేక్ తమిళ నటుడు అయిన ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులో విడుదల కావడం వలన అతను తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా సుపరిచితం. రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, విశాల్ వంటి స్టార్ హీరోలతో కలిసి పని చేసిన వివేక్ తమిళంలో టాప్ కమెడీయన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
కొన్నాళ్ల క్రితం వివేక్ తల్లి, కొడుకు ప్రసన్న కుమార్ మరణించడంతో ఆయన బాగా కుంగిపోయారు. సినిమాలు చేయడం కూడా తగ్గించేశారు. గురువారం రోజు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వివేక్ ప్రజలకు కరోనా జాగ్రత్తలపై అవగాహన పెంచే ప్రయత్నం కూడా చేశారు. వ్యాక్సిన్ తీసుకున్న కొద్ది గంటలకు ఆయన హార్ట్ ఎటాక్‌తో ఆసుపత్రిలో చేరడం అందరిని కలవరపరుస్తుంది. ప్రస్తుతం వివేక్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తుండగా, ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్దిస్తున్నారు.