‘సర్కస్లో సింహంతో ఎవడైనా ఆడుకుంటాడు..నేను అడవికి వెళ్లి మరీ సింహంతో ఆడుకునే టైపు. కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా మూతపడ్డ అన్ని థియేటర్లని తెరిపిస్తా..! అమ్మతోడు.. నా పేరు విశ్వక్ సేన్.. సినిమా మామూలుగా ఉండదు..నా లెక్క తప్పు అయితే పేరు మార్చుకుంటా..’ మరీ ఈ స్థాయిలో డైలాగులు చెప్పడం సినిమాల్లోనే బాగుంటుంది కానీ నిజంగా మాత్రం చాలా అంటే చాలా బాగోదు.
ఎందుకంటే అక్కడ చెప్పింది జరక్కపోతే తర్వాత అడ్డంగా బుక్ అయిపోతుంటారు. ఇప్పుడు విశ్వక్ సేన్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. తన సినిమాపై నమ్మకం ఉండటం మంచిదే.. కానీ అది మరీ ఎక్కువైతేనే ఒక్కోసారి సమస్యలు వస్తుంటాయి.
విశ్వక్ తన పాగల్ సినిమా విషయంలో ఇలాంటి తప్పే చేసాడు. ఈ సినిమాపై అతి విశ్వాసంతో మనోడు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు బలయ్యేలా చేసాయి.
నా సినిమాతో మూసుకున్న థియేటర్స్ మళ్లీ తెరిపిస్తా.. సినిమా ఫ్లాప్ అయితే పేరు మార్చుకుంటా అంటూ విశ్వక్ చేసిన కామెంట్స్ పై నెటిజన్లు భలే ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు. ఆగస్ట్ 14న విడుదలైన పాగల్ సినిమాకు కలెక్షన్స్ లేవు. చాలా ఏరియాల్లో దారుణంగా నష్టపరిచేలా ఉంది ఈ చిత్రం. దిల్ రాజు బ్రాండ్.. విశ్వక్ సేన్ ఇమేజ్ కూడా సినిమాను కాపాడలేకపోతున్నాయి.
SR కళ్యాణమండపం సినిమా మంచి విజయం సాధించింది కదా.. తనది అంతకంటే పెద్ద సినిమా కాబట్టి కలెక్షన్స్ అదిరిపోతాయనే నమ్మకంతో విశ్వక్ కాస్త ఎక్కువగానే రియాక్ట్ అయ్యాడు.
దానికి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాడు. వీకెండ్ కలెక్షన్స్ నీరసంగా ఉండటంతో ఫలితం ఏంటో తేలిపోయింది. ఇదంతా కేవలం విశ్వక్ సేన్ ఆటిట్యూడ్ కారణంగానే జరుగుతుందంటూ సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరుగుతుంది.
దిల్ రాజు లాంటి నిర్మాత సైతం పాగల్ సినిమాను ఆర్యతో పోల్చడం కూడా చాలా మందికి వింతగా అనిపించింది. ఏదేమైనా విశ్వక్ సేన్ కొత్త పేరంటో తెలుసుకోడానికి నెటిజన్లు బాగా వేచి చూస్తున్నారు.