విశాల్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న తాజా చిత్రానికి ‘సామాన్యుడు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ ఉపశీర్షిక. తు.పా. శరవణన్ దర్శకుడు. డింపుల్ హయతి కథానాయిక. విశాల్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదలచేశారు. ఇందులో బేస్‌బాల్ బ్యాట్‌తో రౌడీలను ఎదురిస్తూ విశాల్ శక్తివంతమైన లుక్‌లో కనిపిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సామాన్యుడి జీవనగమనానికి దృశ్యరూపంగా తెరకెక్కుతున్న చిత్రమిది. సంఘవిద్రోహశక్తులపై అతడు ఎలాంటి పోరాటం సాగించాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిణామాలేమిటన్నది ఉత్కంఠభరితంగా ఉంటుంది. విశాల్‌పై తెరకెక్కించిన పోరాట ఘట్టాలు రొమాంచితంగా ఉంటాయి. కథలోని మలుపులు థ్రిల్‌ను పంచుతాయి. త్వరలో సినిమాను థియేటర్లలో విడుదలచేస్తాం’ అని తెలిపారు. యోగిబాబు, బాబురాజ్ జాకబ్, తులసి ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్‌రాజా, ఛాయాగ్రహణం: కవిన్రాజ్.