శుక్రవారం 29 మే 2020
Cinema - Feb 11, 2020 , 23:12:00

జీవితంలో కొత్తదశలోకి అడుగుపెడుతున్నా!

జీవితంలో కొత్తదశలోకి అడుగుపెడుతున్నా!

‘కెరీర్‌లో వచ్చే ప్రతి సక్సెస్‌ఫెయిల్యూర్‌కు పూర్తి బాధ్యత నాదే. మంచి, చెడు ఏదైనా స్వీయ నిర్ణయాలే తీసుకుంటాను. వాటి ద్వారా ప్రశంసలు, విమర్శలు ఏది వచ్చినా సంతోషంగా స్వీకరిస్తాను. ఇతరులపై ఎప్పుడూ ఆధారపడను’ అని అన్నారు విజయ్‌ దేవరకొండ. విభిన్నమైన వ్యక్తిత్వంతో రీల్‌లైఫ్‌లోనే కాకుండా రియల్‌లైఫ్‌లో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారాయన. సినిమాలు, జీవితానికి సంబంధించిన ప్రతి విషయంలో వైవిధ్యతకు ప్రాధాన్యతనిస్తుంటారు. విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌'. క్రాంతిమాధవ్‌ దర్శకుడు. కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ. వల్లభ నిర్మించారు. ఈ నెల 14న విడుదలకానుంది. ఈసందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విజయ్‌ దేవరకొండ పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి..

ఈ సినిమాతో సిక్సర్‌ కొట్టబోతున్నారా?

బాల్‌ గాలిలో ఉంది. అది స్టేడియం అవతల పడుతుందో, బౌండరీ వద్ద ఎవరైనా క్యాచ్‌ పడతారో తెలియదు (నవ్వుతూ). 


ప్రేమకథలను చేయకూడదనే నిర్ణయం తీసుకోవడానికి కారణమేమిటి?

వ్యక్తిత్వపరంగా మారుతున్నాను. లైఫ్‌లో కొత్తదశలోకి అడుగుపెట్టబోతున్నాను. మార్పు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది.నాలో మాత్రం ఒక్కసారిగా వచ్చింది. అది ఎందుకో తెలియదు. ఈ సినిమా మొదలుపెట్టే సమయంలో లవ్‌స్టోరీస్‌ పట్ల నాలో ఆసక్తి తగ్గిపోయింది. ఇదే నా ఆఖరు ప్రేమకథ చిత్రమని నటిస్తున్నప్పుడే నిర్ణయానికి వచ్చాను. నటుడిగా, వ్యక్తిగతంగా మరో రెండు, మూడు నెలల్లో నాలోని కొత్త కోణాన్ని చూస్తారు. 


ఇదివరకు మీరు చేసిన ప్రేమకథలతో పోలిస్తే ఇందులో ఎలాంటి వైవిధ్యత ఉంటుంది?

ఈ సినిమాలో ప్రేమను పరిపూర్ణంగా చూపించాం. నాకు ఐశ్వర్యారాజేష్‌కు మధ్య ఇల్లందు బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే లవ్‌ స్టోరీ ఆసక్తిని రేకెత్తించింది. ఈ ప్రేమకథ చాలా సార్వజనీనంగా ఉంటుంది. క్రాంతిమాధవ్‌ ఈ లవ్‌స్టోరీ చెప్పగానే అలాంటి మనుషుల్ని నేను ఇప్పటివరకు చూడలేదనిపించింది. జీవితంలో వాళ్లలా నేను బతకలేను, మాట్లాడలేనని ఫీలయ్యాను. కుటుంబ బాధ్యతలతో డబ్బుకు విలువనిచ్చే యువకుడిగా ఇల్లందు ఎపిసోడ్స్‌లో నేను కనిపిస్తాను. అందుకు పూర్తి భిన్నంగా ఎలాంటి బాధ్యతలు లేని ఫ్రాన్స్‌లో స్థిరపడిన యువకుడిగా మరో పాత్ర ఉంటుంది. విదేశీ పైలెట్‌ను ప్రేమిస్తూ డబ్బుకు విలువ ఇవ్వని మనస్తత్వంతో ఈ పాత్ర సాగుతుంది. హైదరాబాద్‌ నేపథ్యంలో తొలిప్రేమజ్ఞాపకాలతో సతమతమయ్యే యువకుడిగా మరో పాత్ర ఉంటుంది. ఈ మూడు ప్రేమకథలు వైవిధ్యంగా సాగుతూ ఆసక్తిని పంచుతాయి. 


మూడు ప్రేమకథలకు  ఎలాంటి సంబంధం ఉంటుంది?

మూడు ప్రేమకథల్లో నేనే కనిపిస్తాను కాబట్టి సంబంధం ఉంటుంది. అది ఎలా అనేది తెరపై  ఆసక్తిని పంచుతుంది. 


సినిమాపై వచ్చిన అంచనాల్ని  ఎలా తీసుకుంటున్నారు?

ఈ అంచనాల్ని మజాగా ఫీలవుతున్నాను. నా సినిమాల్ని ఎంతో మంది చూస్తున్నారు. అదిచాలు. అంతకుమించి చేయాలంటే ఇండియానుఏలాల్సిందే(నవ్వుతూ). 


ప్రచార చిత్రాలు చూస్తుంటే మీ పాత్ర  గత సినిమాల కంటే విభిన్నంగా కనిపిస్తున్నది?

సినిమాలో నా పాత్ర మూడు భిన్న పార్శాలతో కొత్తగా ఉంటుంది. అంతిమంగా ప్రేమ గొప్పతనాన్ని చాటిచెప్పే సినిమా ఇది. ప్రేమలో రాజీ, త్యాగం, దైవత్వం అన్ని ఉంటాయని ఓ యువకుడు ఎలా గ్రహించాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే సంఘర్షణ హృద్యంగా ఉంటుంది. 


మూడు పాత్రల మధ్య వేరియేషన్‌ చూపించడం ఛాలెంజింగ్‌గా అనిపించిందా?

నా కెరీర్‌లో ఎక్కువ కష్టపడి చేసిన సినిమాల్లో ఇది ఒకటి. శారీరకంగా, మానసికంగా పాత్రల మధ్య వైవిధ్యతను చూపించడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. ఇల్లందు ఎపిసోడ్‌లో మీసాలతో కనిపిస్తాను. హైదరాబాద్‌ ప్రేమకథలతో గడ్డంతో నటించాను. విదేశీ నేపథ్య సన్నివేశాల కోసం బరువు పెరిగాను. పాత్రల మధ్య ఆ వేరియేషన్స్‌ చూపించడానికి చాలా సమయం తీసుకుంటూ నటించాల్సివచ్చింది. ఈ మూడు పాత్రల్లో శీనయ్య పాత్రను నా మనసును ఆకట్టుకున్నది. చాలా ఎంజాయ్‌ చేస్తూ నటించాను. 


‘వరల్డ్‌ఫేమస్‌ లవర్‌' టైటిల్‌ పెట్టడానికి కారణమేమిటి?

ఈ టైటిల్‌ ఎందుకు పెట్టామనేది  సినిమాలోని కొన్ని సన్నివేశాలు, సంభాషణలు చూస్తే అర్థమవుతుంది. తొలుత ఈ సినిమాకు ప్రియమ్‌, ముంబాయి   తీరంతో పాటు చాలా పేర్లు అనుకున్నాం. అవన్నీ పాతకాలంనాటి టైటిల్స్‌ను తలపించాయి. కథానుగుణంగానే‘వరల్డ్‌ఫేమస్‌ లవర్‌' అనే టైటిల్‌ నిర్ణయించాం. పేరు ఏదైనా నా సినిమా టికెట్స్‌ అమ్ముడుపోవడం  ముఖ్యం. 


ప్రేమ విషయంలో ఇటీవల కాలంలో మీ అభిప్రాయాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి?

ఒకప్పుడు ప్రేమంటే నాన్సెన్స్‌ అనుకునేవాణ్ణి.  అప్పటివరకు తమది ట్రూలవ్‌ అంటూ చెప్పుకున్న జంటలు బ్రేకప్‌ కాగానే మరొకరిని ప్రేమించడం.. ఈ వ్యవహారం అంతా అయోమయంగా అనిపించేది. కానీ ఇప్పుడు ప్రేమలో మాధుర్యముందని అదొక అందమైన భావన అని తెలుసుకున్నాను. ప్రతి ఒక్కరి తమ జీవితంలో ఆ మధురానుభూతిని అనుభవించి తీరాల్సిందే. జీవితం మొత్తం చూసుకుంటే అమ్మానాన్నలు, స్నేహితులు, భార్యపిల్లలు మనపై చూపించే ప్రేమ మాత్రమే గుర్తుంటుంది. లవ్‌ అనేది జీవితంలో ముఖ్యమైన శక్తివంతమైన అనుభూతి అన్నది నా భావన.


పెళ్లి  చేసుకునే ఆలోచన ఉందా?

భవిష్యత్తులో తప్పకుండా పెళ్లిచేసుకుంటాను. ప్రస్తుతానికైతే వైవాహిక జీవితాన్ని మొదలుపెట్టడానికి సిద్ధంగా లేను. ఇంకా పెళ్లి వయసు రాలేదని అనుకుంటున్నాను. కొన్ని సార్లు ముప్పైఏ ళ్లు వచ్చాయి పెద్దోడిని అయిపోయాను అనిపిస్తుంది. అయితే పెళ్లి ప్రస్తావన రాగానే మాత్రం పిల్లాడిగానే ఫీలవుతాను. పెళ్లనేది బాధ్యతతో కూడి ఉంటుంది. దానిని స్వీకరించడానికి మానసికంగా రెడీగా లేను. 


మీరు ఏ సినిమా చేసినా ‘అర్జున్‌రెడ్డి’తో పోల్చుతున్నారు. ఆ పోలికల్ని ప్లస్‌ అనుకుంటున్నారా?మైనస్‌గా భావిస్తున్నారా?

యాక్షన్‌ సినిమా, సైన్స్‌ఫిక్షన్‌ ఏ సినిమాలోనైనా నేను గడ్డం పెంచితే ‘అర్జున్‌రెడ్డి’తోనే పోల్చుతారు. ఆ పోలికలు తప్పవు. కొన్ని తరాలకు గుర్తుండిపోయే సూపర్‌హిట్‌ సినిమాలతో పోల్చడం ఆనందమే. ఫ్లాప్‌ సినిమాలో పోల్చితే బాధ ఉంటుంది. ప్రేమకథల్లో వైవిధ్యత చూపించడం సాధ్యమే. ఈ సినిమాలో మూడు భిన్న ప్రేమకథలుంటాయి. ఓ ట్రాక్‌ అర్జున్‌రెడ్డికి దగ్గరగా ఉంటుంది.  ఆ సినిమాతో పోల్చడం సరికాదని నేను చెప్పను. పూర్తి సినిమా చూస్తే విభిన్నమైన అనుభూతి పంచుతుంది. చాలా విచిత్రంగా ఉంటుంది. ఇప్పటివరకు ఇలాంటి కథాంశాలతో నేను సినిమాలు చూడలేదు. 


‘డియర్‌ కామ్రేడ్‌' ఫలితం మిమ్మల్ని  నిరాశపరిచిందా?

ఆ సినిమా చేసినందుకు గర్వపడుతున్నాను. బంగ్లాదేశ్‌, పాకిస్ధాన్‌, నేపాల్‌లలో యూట్యూబ్‌లో విడుదలై నంబర్‌వన్‌గా నిలిచింది. బాబీగా ఈ సినిమాతో అందరికీ నేను చేరువయ్యాను. పూరి జగన్నాథ్‌ సినిమా షూటింగ్‌ కోసం ముంబాయి వెళ్లినప్పుడు చాలా మంది బాబీ అనే నన్ను పిలిచారు. సరైన రివ్యూస్‌ రాకపోయినా మంచి సినిమా చేశాననే సంతృప్తి దక్కింది. 


మీపై వచ్చే విమర్శల్ని  ఎలా తీసుకుంటుంటారు. 

ఐ లవ్‌ క్రిటిసిజం. నా కోసం ఎంతో సమయాన్ని వెచ్చించి విమర్శలు చేస్తున్నారంటే నాపై ప్రేమ, అభిమానం ఉన్నాయని అర్థం. నా గురించి ఏం మాట్లాడుతున్నారు? ఎలాంటి కామెంట్స్‌ చేస్తున్నారనదే దానికంటే వారి చర్చల్లో నేను ఉన్నానా? లేదా? అన్నది ముఖ్యం. నిర్మాణాత్మక విమర్శల్ని ఇష్టపడతాను. రెగ్యులర్‌గా వచ్చే కామెంట్స్‌ను పట్టించుకోను. 


మా నాన్నను స్ఫూర్తిగా తీసుకొని శీనయ్య పాత్రను పోషించాను. ఆయన లుంగీ కట్టే తీరు, మాట్లాడే స్వభావం, హావభావాలు అవన్నీ గుర్తుతెచ్చుకొని నటించాను. ఆ పాత్రను పోషించడానికి చిన్నతనంలో నేను చూసిన సంఘటనలు చాలా వరకు రిఫరెన్స్‌గా ఉపయోగపడ్డాయి. 


నా లైఫ్‌లో ప్రస్తుతం ఏం జరుగుతుందో.. నేను ఏం చేస్తున్నానో అర్థం కావడం లేదు. ఇంకో ముప్పై ఏళ్ల తర్వాత వెనక్కి  తిరిగి చూసుకుంటే  ఏం జరిగిందో నా లైఫ్‌  ఎలా గడిచిందో  విశ్లేషించుకునే అవకాశం దొరుకుతుందని భావిస్తున్నా. పాన్‌ ఇండియన్‌ కథాంశంతో పూరి జగన్నాథ్‌ సినిమా తెరకెక్కుతున్నది. ఈ సినిమాతోనే హిందీలో  అరంగేట్రం చేస్తున్నాను.  చాలా రోజుల తర్వాత ఉత్సుకతతో నేను చేస్తున్న సినిమా ఇది. 


logo