బుధవారం 03 జూన్ 2020
Cinema - May 01, 2020 , 23:55:36

నవ్వించే అమ్మాయిలు ఇష్టం

నవ్వించే అమ్మాయిలు ఇష్టం

ఆలోచనల్లోనే కాదు ఆచరణలో కూడా తనదైన ప్రత్యేకతను కనబరుస్తారు యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ. కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులు, మధ్యతరగతి ప్రజల్ని ఆదుకోవడానికి  ‘మిడిల్‌ క్లాస్‌ ఫండ్‌'ను ఆరంభించి  అందరి దృష్టిని ఆకట్టుకున్నారాయన. విజయ్‌ దేవరకొండ వితరణశీలతకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభింస్తున్నాయి. లాక్‌డౌన్‌ కాలాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదిస్తున్న ఆయన ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు  ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.

పరిణితి వచ్చిన తర్వాతే పెళ్లి..

ఇదివరకు నా పెళ్లి గురించి కుటుంబ సభ్యులెవరూ అడిగేవారు కాదు. కానీ ఈ మధ్య పెళ్లి ప్రస్తావన తీసుకొస్తున్నారు. నాకు ఫ్యా మిలీ లైఫ్‌ చాలా ఇష్టం. పెళ్లి, పిల్లలు... ఈ బంధాలన్నీ జీవితానికి ఓ సార్థకతగా భావిస్తాను. తప్పకుండా నేను పెళ్లి చేసుకునే రోజు వస్తుంది. అందుకు మరికాస్త సమయం తీసుకోవాలనుకుంటున్నా. వ్యక్తిగా మరింత పరిణితి సాధించిన తర్వాత పెళ్లి గురించి సీరియస్‌గా ఆలోచిస్తా. వైవాహిక జీవితంలో గొప్ప బాధ్య త ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకుం టూ బంధాన్ని వృద్ధి చేసుకోవాల్సిన అవశ్యకత అవసరమవుతుంది.

వంట గురించి తెలియదు..

గత కొన్నేళ్లుగా సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఇంటి దగ్గర ఉండేందుకు సమయం దొరకలేదు. ఇప్పుడు లాక్‌డౌన్‌ టైమ్‌ను కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తున్నా.  చిన్నప్పటి నుంచి హాస్టల్‌లో ఉండటం వల్ల నాకు వంటలు చేయడం మాత్రం రాదు. కిచెన్‌లోకి వెళ్లితే ఉప్పు డబ్బా ఎక్కడుందో కూడా అమ్మనే అడగాలి. నా బెడ్‌ సర్దుకోవడం, కబోర్డ్స్‌ను క్లీన్‌ చేసుకోవడం వంటి పనుల్ని మాత్రం స్వయంగా చేసుకుంటా. బెడ్‌రూమ్‌లో నా వస్తువుల్ని మరొకరు ముట్టుకోవడం నాకు అస     ్సలు ఇష్టం ఉండదు.

అలాంటి అమ్మాయిలు ఇష్టం..

అమ్మాయిల్లో సెన్సాఫ్‌ హ్యూమర్‌తో పాటు దయార్ధ్ర స్వభావాన్ని నేను ఎక్కువగా ఇష్టపడతాను. నన్ను ఎప్పుడూ నవ్వించగలిగే అమ్మాయి ని కోరుకుంటా. లాక్‌డౌన్‌ టైమ్‌లో వారితో కలిసి ఉన్నా బోర్‌ ఫీలింగ్‌ రావొద్దు. ఆమె సమక్షంలో ప్రతిరోజు ఓ హాలీడేలా గడచిపోవాలి. 

భారతీయత గొప్పదనమదే..

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బలంగా ఉంది కాబట్టే కరోనా వంటి సంక్షోభ సమయంలో భారతీయ సమాజం పరస్పర సహకారంతో ఈ మహమ్మారిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తోంది. లాక్‌డౌన్‌ను కూడా సమర్థవంతంగా అమలు చేస్తున్నారు.  జీవితంలో నేనీ స్థాయికి రావడానికి ఎంతో మంది సహాయం అందించారు. కుటుం బ సభ్యులు, ఫ్రెండ్స్‌తో పాటు తెలియని వ్యక్తుల నుంచి కూడా నేను సహాయాన్ని పొందాను. వారందరు చూపించిన  ప్రేమాభిమానాల  వల్లే  జీవితంలో ఎదిగాను. నేను పొందిన సహాయాన్ని తిరిగి సమాజానికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా.

వారే నాకు స్ఫూర్తి...

నాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తుల్లో అమ్మనాన్న ముం దుంటారు. నాన్న తాను చేసిన తప్పుల గురించి నాకు చెబుతూ..జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో సలహాలు ఇస్తుంటారు. అమ్మనాన్నతో పాటు నేను చదివిన పుస్తకాలు, చూసిన సినిమాలు నా జీవితం మీద గొప్ప ప్రభావాన్ని చూపించాయి.

ఇండస్ట్రీలో ఎక్కువగా ఫ్రెండ్స్‌ లేరు..

సినీరంగంలో నాకు పెద్దగా మిత్రులు లేరు.  స్కూల్‌ ఫ్రెండ్స్‌తోనే ఎక్కువ సమయాన్ని గడుపుతాను. పరిశ్రమలో మంచి మనసున్న వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. అయితే  సినిమాలు చూడటమే తప్ప వాళ్ల గురించి వ్యక్తిగతంగా తెలుసునే ఆసక్తి ఉండదు. అందుకే నాకు ఇండస్ట్రీలో స్నేహితులు చాలా తక్కువ. రానాతో మాత్రం చక్కటి అనుబంధం ఉంది.

ఇప్పుడే ఏం చూస్తున్నానంటే..

ప్రస్తుతం  టీవీ డాక్యుమెంటరీలు ఎక్కువగా చూస్తున్నా. ‘ఛీర్‌' అనే డాక్యుమెంటరీ చూశాను. చాలా బాగా నచ్చింది.  బాస్కెట్‌బాల్‌ నేపథ్యంలో సాగే ‘ది లాస్ట్‌ డ్యాన్స్‌' అనే డాక్యూసిరీస్‌ చూశాను. జీవితం పట్ల గొప్ప కలలు వున్న వ్యక్తుల్ని నేను చాలా ఇష్టపడతాను. అలాంటి వ్యక్తుల కథ అది. ఒకవేళ నేను నటుణ్ణి కాకపోతే ఆర్కిటెక్ట్‌ను అయ్యేవాడిని. 

  ఫ్యాన్స్‌ అనే పదం నచ్చదు... 

నా అభిమానుల్ని నేను ‘రౌడీ’ అని పిలుచుకుంటా. ఫ్యాన్స్‌ అనే పదం ఎందుకో నాకు నచ్చదు.  అందుకే నేను అభిమానుల్ని ప్రేమగా ‘మై రౌడీ బాయ్స్‌.. గర్ల్స్‌' అని పిలుస్తా. ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ ఏదో రకంగా మనల్ని నియంత్రించాలని చూస్తుంటారు. ఇతరుల్ని నొప్పించకుండా సామరస్యపూర్వకంగా మన లక్ష్యాల్ని సాధించుకోవాలనే సిద్ధాంతాన్ని నేను బలంగా విశ్వసిస్తా. ఏదైనా కావాల్సివస్తే తప్పకుండా పొందడానికి ప్రయత్నం చేయాలి. ఆ భావం స్ఫురించేలా నా అభిమానుల్ని ‘రౌడీ’ అని పిలుస్తా. 


logo