ఆదివారం 31 మే 2020
Cinema - May 05, 2020 , 22:42:01

అసత్య వార్తలపై పోరు

అసత్య వార్తలపై పోరు

రోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి ప్రజల్ని ఆదుకోవడానికి ‘మిడిల్‌క్లాస్‌ ఫండ్‌'ను ఏర్పాటు చేశారు  అగ్ర కథానాయకుడు విజయ్‌ దేవరకొండ. ఈ ఫండ్‌ ద్వారా తెలుగు రాష్ర్టాల్లోని అవసరార్థులకు నిత్యవసరాల్ని అందిస్తున్నారు. అయితే ఈ సేవా కార్యక్రమాల గురించి తప్పుడు కథనాల్ని ప్రచురిస్తూ తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని కొన్ని వెబ్‌సైట్లపై విజయ్‌ దేవరకొండ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ‘కిల్‌ ఫేక్‌ న్యూస్‌' పేరుతో సోమవారం ఆయన విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది. విజయ్‌ దేవరకొండకు మద్దతు తెలుపుతూ పలువురు సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా గళమెత్తారు.

‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సామాన్యుల కోసం విరాళాల్ని సేకరించాం. తొలుత 25లక్షల మూలధనంతో రెండు వేల కుటుంబాలకు నిత్యవసరాల్ని అందించాలని సంకల్పించాం. స్వచ్ఛందంగా అందించిన విరాళాలతో మా ఫండ్‌ 75లక్షలకు చేరుకుంది. మా సేవా కార్యక్రమాల వివరాల్ని ప్రతిరోజు మా అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నాం. అనుకున్నదాని కంటే ఎక్కువమంది కుటుంబాలకు సహాయం చేయాలని ప్రయత్నాలు చేస్తుంటే..మా విరాళాల సేకరణలో అంతా అయోమయం ఉందని, సినిమా ఇండస్ట్రీ నుంచి వేరై నేను ఈ కార్యక్రమం చేస్తున్నట్లు నిరాధార వార్తలు రాశారు. ఓ నాలుగు వెబ్‌సైట్లు నాకు చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. వారి వార్తల్ని నేను రోజూ గమనిస్తున్నా. ‘అసలు మీరెవరకు నన్ను విరాళాల గురించి అడగడానికి? సినీ పరిశ్రమపై బ్రతుకుతూ ప్రకటనలు, ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే మాపై తప్పుడు కథనాల్ని రాస్తున్నారు. నాకు నచ్చినప్పుడు, నాకు కుదిరినప్పుడు, నాకు ఎవరికి ఇవ్వాలనిపిస్తే వారికే ఇంటర్వ్యూలు ఇస్తా’ అంటూ విజయ్‌ దేవరకొండ వెబ్‌సైట్లపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా విజయ్‌ దేవరకొండకు మద్దతుగా నిలిచారు. ‘డియర్‌ విజయ్‌..మీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను. బాధ్యతలేని రాతల వల్ల, మీలా నేను నా కుటుంబం బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మేమంతా నీకు మద్దతుగా ఉంటాం. మంచి చేయాలన్న నీ సంకల్పాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు’ అని చిరంజీవి పేర్కొన్నారు. ఆయన ట్వీట్‌కు నాగార్జున మద్దతు తెలిపారు. తామంతా గతంలో ఇదే రకమైన సమస్యల్ని ఎదుర్కొన్నామని..ఓ యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించి ఫేక్‌న్యూస్‌పై పోరాటం చేయాలని నాగార్జున సూచించారు. అగ్రహీరో మహేష్‌బాబు సైతం విజయ్‌ దేవరకొండకు మద్దతుగా నిలిచారు. ట్విట్టర్‌లో ఆయన స్పందిస్తూ ‘ఒకస్థాయికి చేరుకోవాలంటే ఎన్నో సంవత్సరాల కృషి, త్యాగాలు అవసరమవుతాయి. ఎంతో శ్రమిస్తేనే గానీ ప్రజాభిమానాన్ని పొందలేం. ఎవరో పేరు కూడా తెలియని వ్యక్తి డబ్బు కోసం అగౌరవపరిచేలా, నిరాధార వార్తలు రాసి వాటిని ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకోవడం సమంజనం కాదు. ఇండస్ట్రీని, అభిమానుల్ని, నా పిల్లలను ఈ అబద్దపు వార్తల నుంచి రక్షించుకోవాలనుకుంటున్నా. ఈ ఫేక్‌ వెబ్‌సైట్లపై చర్యలు తీసుకోవడానికి అందరూ ముందుకురావాలి’ అని మహేష్‌బాబు పిలుపునిచ్చారు. నిర్మాత సురేష్‌బాబు, దర్శకులు పూరి జగన్నాథ్‌, సుకుమార్‌, వంశీపైడిపల్లి, హరీష్‌శంకర్‌, యువహీరో కార్తికేయ, రానా, వైజయంతీ మూవీస్‌, యూవీ క్రియేషన్‌ సంస్థలతో పాటు పలువురు సినీప్రముఖలు విజయ్‌ దేవరకొండకు మద్దతు పలికారు.

కొన్ని వెబ్‌సైట్స్‌

 సినీ ప్రముఖులపై  అసత్యపు వార్తల్ని  రాస్తున్నాయి.  యూట్యూబ్‌లలో వారిని అగౌరవ పరిచేలా కథనాల్ని ప్రసారం చేస్తున్నారు. హీరోలతో పాటు సినీ ప్రముఖుల వ్యక్తిత్వాల్ని కించపరిచేలా వార్తల్ని రాస్తున్న వెబ్‌సైట్స్‌, యూట్యూబ్‌ ఛానెల్స్‌పై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం’ అని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఓ ప్రకటన విడుదలచేసింది. ‘ఒక మనిషి తన స్థోమతకు తగినట్లుగా సహాయం చేస్తాడు. వాటిపై వ్యాఖ్యలు  చేయడం  సరికాదు. లాక్‌డౌన్‌ తర్వాత అందరితో మాట్లాడి అసత్యాల్ని ప్రచారం చేస్తున్న వెబ్‌సెట్స్‌పై తీసుకోవాల్సిన చర్యలపై  నిర్ణయం తీసుకుంటాం’ అని నిర్మాతల మండలి ప్రతినిధులు తెలిపారు. logo