మంగళవారం 02 జూన్ 2020
Cinema - Mar 23, 2020 , 10:25:30

తమిళ దర్శకుడు విసు కన్నుమూత

తమిళ దర్శకుడు విసు కన్నుమూత

ప్రముఖ తమిళ దర్శకుడు విసు(74) ఆదివారం చెన్నైలో కన్నుమూశారు. గుండెపోటుతో స్వగృహంలో సాయంత్రం తుదిశ్వాసవిడిచారు. దర్శకుడు, నటుడు, రచయిత, రంగస్థలకళాకారుడిగా బహుముఖప్రజ్ఞాశాలిగా విసు గుర్తింపును తెచ్చుకున్నారు.  కె. బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘పట్టిన ప్రవేశం’ అనే తమిళ చిత్రంతో రచయితగా విసు సినీ జీవితం ఆరంభమైంది.  కుటుంబ విలువల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించడంలో తమిళ చిత్రసీమలో విసు పేరుమారుమ్రోగింది. రజనీకాంత్‌ నటించిన థిల్లు ముల్లు, నెట్రికన్‌ చిత్రాలకు విసు కథల్ని అందించారు.  

రచయితగా పనిచేస్తూనే బాలచందర్‌ వద్ద దర్శకత్వశాఖలో పనిచేసిన విసు ‘కణ్మని పూంగ’ చిత్రంతో డైరెక్టర్‌గా మారారు.  సంసారం అధు మినసారం, నీంగ నల్ల ఇరుక్కానుమ్‌ చిత్రాలతో దర్శకుడిగా జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ఉమ్మడి కుటుంబ విలువలకు సందేశాల్ని జోడిస్తూ  సినిమాల్ని తెరకెక్కించేందుకు విసు ప్రాధాన్యతనిచ్చేవారు. ‘సంసారం అధు మినసారం’ చిత్రం తెలుగులో ‘సంసారం ఒక చదరంగం’ పేరుతో పునర్నిర్మితమై పెద్ద విజయాన్ని అందుకున్నది. 2001 తర్వాత పూర్తిగా నటనపైనే దృష్టిసారించారు. గంభీరమైన వాచకంతో వ్యంగ్యధోరణిలో విసు సంభాషణలు చెప్పే తీరు ప్రాచుర్యాన్ని పొందింది.  తెలుగులో విసు  ‘ఆడదే ఆధారం’ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు నటించారు. అలాగే ‘గాడ్‌ఫాదర్‌'లో కీలక పాత్రను పోషించారు. ఆయన మరణం పట్ల దక్షిణాది సినీ వర్గాలు సంతాపాన్ని వ్యక్తంచేశాయి. 


logo