మంగళవారం 26 మే 2020
Cinema - May 01, 2020 , 07:28:24

రొమాంటిక్‌ రారాజు

రొమాంటిక్‌ రారాజు

భారతీయ వెండితెరపై నవనవోన్మేషిత సమ్మోహనాస్త్రం రిషికపూర్‌. ఫరెవర్‌ రొమాంటిక్‌ హీరోగా ఆయన్ని అభిమానులు అభివర్ణిస్తారు. హిందీ చిత్రసీమలో ఘనవారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆయన ఎన్నో అజరామర పాత్రల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. ముఖ్యంగా 70, 80దశకాల్లో యువతరాన్ని ఉర్రూతలూగించారు. మరో       పార్శంలో నిజాల్ని నిక్కచ్చిన వెల్లడించే తత్వం ఆయనది. తన భావాల్ని ‘ఖుల్లం ఖుల్లా’గా వెలిబుచ్చిన వ్యక్తిత్వం ఆయన సొంతం. కెరీర్‌ తొలినాళ్లలో రొమాంటిసిజానికి చిరునామాగా, రెండో ఇన్సింగ్స్‌లో అరుదైన పాత్రలకు రూపుకట్టిన ప్రతిభాశాలిగా భారతీయ సినీ యవనికపై ఆయన చెరగని ముద్రవేశారు.

‘బాబీ’ చిత్రం ద్వారా పద్దెనిమిదేళ్ల ప్రాయంలో కథానాయకుడిగా అరంగేట్రం చేశారు రిషికపూర్‌. తొలి సినిమాతోనే రొమాంటిక్‌ హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్నారు. బాలీవుడ్‌లో టీనేజ్‌ ప్రేమకథలకు శ్రీకారం చుట్టిన ‘బాబీ’ చిత్రానికి రుషికపూర్‌ తండ్రి రాజ్‌కపూర్‌ దర్శకనిర్మాత.  ఆస్తి అంతరాలు, పెద్దల విముఖత కారణంగా ఓ ప్రేమజంటకు ఎదురైన అవరోధాలతో హృద్యమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో రాజ్‌నాథ్‌గా యువతరానికి ప్రతీకగా నిలిచే పాత్రలో ైస్టెలిష్‌లుక్స్‌, హావభావాలతో కుర్రకారు హృదయాల్ని దోచుకున్నారు రిషికపూర్‌. ఈ సినిమా ట్రెండ్‌సెట్టర్‌గా నిలవడంతో రిషికపూర్‌ సూపర్‌స్టార్‌గా మారిపోయారు. 1973లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ‘బాబీ’ నిలిచింది. హీరోగా తొలి సినిమాతోనే ఫిలింఫేర్‌ పురస్కారాన్ని అందుకున్నారాయన. ఆ తర్వాత రిషికపూర్‌ కు వరుసగా ప్రేమకథా చిత్రాల్లో అవకాశాలు వరించాయి. బాలీవుడ్‌లో మరే హీరోకు సాధ్యం కానీ రీతిలో వందకుపైగా సినిమాల్లో రొమాంటిక్‌ హీరోగా నటించిన ఘనతను సొంతం చేసుకున్నారు.  వినోదం థ్రిల్లర్‌ అంశాలతో 1975లో రూపొందిన  ‘ఖేల్‌ ఖేల్‌ మే’  కాలేజీ విద్యార్థిగా వైవిధ్యమైన అభినయాన్ని కనబరిచారు. ‘రఫూ చక్కర్‌'లో రిషికపూర్‌, నీతూ సింగ్‌ల కెమిస్ట్రీ విజయానికి కీలకభూమిక పోషించింది. కె. విశ్వనాథ్‌ దర్శకత్వంలో రూపొందిన  ‘సర్గమ్‌'లో మూగ యువతికి అండగా నిలిచే యువకుడిగా సహజ నటనను కనబరిచారు. తండ్రి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమ్‌రోగ్‌'లో భర్తను కోల్పోయిన ఆస్తిపరురాలైన మహిళను ప్రేమించే అనాథ యువకుడిగా భావోద్వేగభరిత నటనతో  ఆకట్టుకున్నారు.    లైలామజ్ను, కర్జ్‌, నగీనా,హనీమూన్‌-2, బోలో రాధా బోల్‌ వంటి ఎన్నో ప్రేమకథలకు తనదైన శైలి అభినయంతో రక్తికట్టించారు. సోలో హీరోగా దాదాపు 51 సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించారు రిషికపూర్‌. ప్రతి సినిమాలో జెర్సీ ధరించి ైస్టెలిష్‌గా కనిపించే రిషికపూర్‌ అప్పట్లో జెర్సీమెన్‌ అని ప్రేక్షకులు పిలుచుకునేవారు. అప్పట్లో ఆయన జెర్సీ ైస్టెల్‌ పెద్ద ఫ్యాషన్‌గా మారిపోయింది. 

మల్టీస్టారర్‌లో సత్తా చాటారు

సుదీర్ఘ కెరీర్‌లో దాదాపు నలభై ఒక్క మల్టీస్టారర్‌ సినిమాల్లో నటించారు రిషికపూర్‌. కభీ కభీ, హమ్‌ కిసీ సే కమ్‌ నహీ, బద్లేరిష్తే, ఆప్‌ కే దీవానే, సాగర్‌, అమర్‌ అక్బర్‌ అంథోనీ లాంటి ఎన్నో విజయవంతమైన మల్టీస్టారర్‌ సినిమాల్లో  అమితాబ్‌బచ్చన్‌, జితేంద్ర లాంటి  సూపర్‌స్టార్స్‌కు ధీటైన అభినయాన్ని కనబరిచారు. నగీనా, ప్రేమ్‌రోగ్‌ లాంటి మహిళా ప్రధాన చిత్రాల్లో రిషికపూర్‌ నటించి మెప్పించారు. అమితాబ్‌బచ్చన్‌, వినోద్‌ఖన్నా, జితేంద్ర లాంటి అలనాటి స్టార్స్‌ మొదలుకొని షారుఖ్‌ఖాన్‌, వరుణ్‌ధావన్‌ వంటి నేటితరం కథానాయకులందరితో సినిమాలు చేసిన ఘనత రిషికపూర్‌కే దక్కింది.

ఆటోబయోగ్రఫీ ‘ఖుల్లం ఖుల్లా’

వెండితెరపై రొమాంటిక్‌ హీరోగా వెలుగు వెలిగిన రిషికపూర్‌ నిజజీవితంలో ఎన్నో వివాదాల్ని ఎదుర్కొన్నారు. తన మనసులోని భావాల్ని నిర్మొహమాటంగా వ్యక్తీకరిస్తుంటారాయన.  అందుకు తగ్గట్లుగానే ‘ఖుల్లం ఖుల్లా రిషి కపూర్‌ అన్‌సెన్సార్డ్‌' పేరుతో ఆత్మకథను వెలువరించారు. ఇందులో తన తండ్రి రాజ్‌కపూర్‌కు బాలీవుడ్‌ నాయికలతో ఉన్న వివాహేతర సంబంధాల గురించి ప్రస్తావించారు. క్రెడిట్‌ అంతా తానే తీసుకుంటూ ఇతర నటులకు పేరుదక్కకుండా చేసేవారంటూ అమితాబ్‌బచ్చన్‌పై విమర్శలు గుప్పించారు. అమితాబ్‌బచ్చన్‌కు దక్కాల్సిన ఫిలింఫేర్‌ పురస్కారాన్ని మూడువేల రూపాయల లంచమిచ్చి తాను  కొనుకున్నట్లు అందులో పేర్కొనడం వివాదాస్పదంగా మారింది.  ట్విట్టర్‌లో సామాజిక, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాల్ని వెల్లడించి పలు విమర్శల్ని ఎదుర్కొన్నారు రిషికపూర్‌. దర్శకుడిగా..

తండ్రి రాజ్‌కపూర్‌ స్ఫూర్తితో 1999లో రుషికపూర్‌ మెగాఫోన్‌పట్టారు. అక్షయ్‌ఖన్నా, ఐశ్వర్యరాయ్‌లతో ‘ఆబ్‌ లౌట్‌ ఛలే’ అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమా నిరాశను మిగల్చడంతో మళ్లీ దర్శకత్వం జోలికి వెళ్లలేదు. సుదీర్ఘ కెరీర్‌లో ఎక్కువగా బాలీవుడ్‌ సినిమాల్లో నటించిన రుషికపూర్‌ ఒకే ఒక హాలీవుడ్‌ సినిమా చేశారు. ‘డోంట్‌స్టాప్‌ డ్రీమింగ్‌' అనే ఇంగ్లీష్‌ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించారు. 

సెకండ్‌ ఇన్నింగ్స్‌

2000 సంవత్సరం తర్వాత రొమాంటిక్‌ హీరోగా నటించడానికి వయసు ప్రతిబంధకంగా మారడటంతో  రిషికపూర్‌ సహాయ నటుడి పాత్రల్లో కనిపించడం ప్రారంభించారు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా యాభైకిపైగా సినిమాలు చేశారు. ‘హమ్‌తుమ్‌'లో సైఫ్‌అలీఖాన్‌ తండ్రిగా చక్కటి నటనను కనబరిచారు. ఫనా, నమస్తే లండన్‌, లక్‌ బై ఛాన్స్‌, అగ్నిపథ్‌, డీ డే, ఆల్‌ ఈజ్‌ వెల్‌, ముల్క్‌తో పాటు  పలు సినిమాల్లో  విలక్షణ పాత్రల్ని పోషించారు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, ప్రతినాయకుడు, తండ్రి..ఏ పాత్రలోనైనా అలవోకగా ఒదిగిపోయారు. పాత్ర నిడివి తక్కువైనా సినిమాపై బలమైన ముద్రను వేశారు. రిషికపూర్‌ నటించిన చివరి చిత్రం ‘ది బాడీ’ గత ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. 

కశ్మీర్‌లో చిగురించిన ప్రేమకథ

చిరకాల ప్రేయసి నీతూసింగ్‌ను 1980 జనవరి 22న పెళ్లాడారు రిషికపూర్‌. వీరి ప్రేమకథలో అనేక సినిమాటిక్‌ మలుపులున్నాయి. వివాహానికి ముందు ఈ జోడీ 12 సినిమాల్లో నటించారు. కన్నడ చిత్రం ‘నాగరహావు’ ఆధారంగా రూపొందించిన ‘జహర్‌లీలా ఇన్సాన్‌' అనే చిత్రంలో తొలిసారి జోడీకట్టారు. ఆ తర్వాత ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’ ‘దూస్రాఆద్మీ’ ‘అంజానేమే’ ‘ధన్‌దౌలత్‌' ‘రఫూ చక్కర్‌' ‘ఖేల్‌ ఖేల్‌ మే’ ‘కభీ కభీ’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ‘బాబీ’ సినిమా కోసం కథానాయికగా తొలుత నీతూసింగ్‌ను అనుకున్నారు. ఆమెస్థానంలో డింపుల్‌ కపాడియా నటించింది. ఆ సినిమా షూటింగ్‌ సందర్భంలో నీతూసింగ్‌ తరచు సెట్‌కు వచ్చేది. అప్పుడే వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. “కశ్మీర్‌లో ‘కభీ కభీ’ (1975) సినిమా చిత్రీకరణ సమయంలో మా ప్రేమబంధం బలపడింది. ఆ తర్వాత షూటింగ్‌ కోసం పారిస్‌ వెళ్లినప్పుడు ‘సిఖ్నీ బహుత్‌ యాద్‌ ఆతీహై’ అంటూ నీతూసింగ్‌కు టెలిగ్రామ్‌ చేశాను. ఈ విషయాన్ని నీతూ సెట్‌లో ఉన్న అందరికి చూపించి సంబరపడిపోయింది. ప్రేమలో ఉన్నప్పుడు ఒకరినొకరం ‘బాబా’ అని పిలుచుకునేవాళ్లం. ఆ తర్వాత అది ‘బాబ్‌' అంటూ సంక్షిప్తంగా మారింది. నీతూ నన్ను ఎప్పుడూ పేరు పెట్టి పిలవదు. ‘బాబ్‌' అనే పిలుస్తుంది’ అని రిషికపూర్‌ తన ఆత్మకథ ‘ఖుల్లం ఖుల్లా’లో పేర్కొన్నారు. అయితే వివాహానంతరం సినిమాలు వరుసగా పరాజయం చెందడంతో రిషికపూర్‌ తీవ్ర ఆవేదనను లోనయ్యారట. పెళ్లయిన తర్వాత రొమాంటిక్‌ హీరో  ఇమేజ్‌ను కోల్పోయానని, అందుకే ఫెయిల్యూర్స్‌ వస్తున్నాయని బాధపడేవాడట. ‘ఆ టైంలో నేను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. నీతూ ప్రేమాభిమానాలు, కుటుంబ సభ్యుల ఓదార్పుతో తిరిగి మామూలు మనిషినయ్యాను. వైవాహిక బంధం తొలిరోజుల్లో కొన్ని అభిప్రాయభేదాలొచ్చినప్పటికీ తర్వాత అన్నీ సర్దుకున్నాయి. నా ప్రతి మలుపులో నీతూ కొండంత అండగా నిలిచి మనోైస్థెర్యాన్నిచ్చింది’ అని రిషికపూర్‌ తన ఆటోబయోగ్రఫీలో చెప్పారు. రిషికపూర్‌, నీతూకపూర్‌ దంపతులకు రణభీర్‌కపూర్‌, రిద్దిమాకపూర్‌ సంతానం ఉన్నారు. రణభీర్‌కపూర్‌ బాలీవుడ్‌ అగ్ర కథానాయకుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. కూతురు డిజైనర్‌గా స్థిరపడింది.రిషికపూర్‌ కన్నుమూత

రొమాంటిక్‌ కథానాయకుడిగా 70, 80దశకాల్లో యువతరాన్ని ఉర్రూతలూగించారు రిషికపూర్‌. నాటి అమ్మాయిల కలల రాకుమారుడిగా భాసిల్లారు. రిషికపూర్‌ నటించిన సినిమాల్లోని అనేక గీతాలు విశేష ప్రజాదరణ సొంతం చేసుకున్నాయి. ‘బాబీ’ (1973) సినిమాలోని ‘హమ్‌తుమ్‌ ఏక్‌ కమ్‌రే మే బంద్‌హో’ గీతాన్ని నేటికి అత్యంత పాపులర్‌ గీతంగా చెబుతారు. రిషికపూర్‌, డింపుల్‌కపాడియా  సరసశృంగార అభినయానికి దర్పణంలా నిలిచింది. ‘జహ్‌రీలా ఇన్సాన్‌' (1974) చిత్రంలోని ‘ఓ హన్సిని..మేరే హన్సిని’ అనే గీతం పాపులర్‌ అయింది.  ‘ఖేల్‌ ఖేల్‌ మే’ (1975) చిత్రంలోని ‘ఏక్‌ మే ఔర్‌ ఏక్‌ తూ’ ‘ఖుల్లం ఖుల్లం ప్యార్‌కరేంగే’ గీతాలు శ్రోతల్ని అలరించారు. ‘సాగర్‌' (1985) చిత్రంలో ‘చహ్‌రా హై యా చాంద్‌ ఖిలా హై’ శ్రావ్యమైన గీతంగా అలరించింది. ‘కర్జ్‌' (1980) చిత్రంలోని ‘మేరి ఉమర్‌ కే నవ్‌జవానో’ బహుళప్రజాదరణ సొంతం చేసుకుంది. రిషికపూర్‌, శ్రీదేవి జంటగా నటించిన ‘చాందిని’ (1989) సినిమాలో పాటలన్నీ సంగీతప్రియుల మనసుల్ని దోచుకున్నాయి. ముఖ్యంగా ‘తేరే మేరే హాథో పే’ ‘చాందిని ఓ మేరి చాందిని’ గీతాలు పాపులర్‌గా నిలిచాయి. రిషికపూర్‌, దివ్యభారతీ జంటగా నటించిన ‘దీవానా’ (1992) చిత్రంలోని ‘సోచేంగే తుమ్హే ప్యార్‌' ‘తేరి ఉమ్మీద్‌ తేరి’ ‘పాయల్‌యా’ పాటలు ఇప్పటికీ మార్మోగిపోతున్నాయి. 

మంచి స్నేహితుడు, గొప్ప నటుడైన రిషికపూర్‌ మరణవార్త నన్ను ఎంతగానో కలచివేసింది.  ఎంతో మందిలో స్ఫూర్తి నింపారాయన. గొప్ప వారసత్వాన్ని కొనసాగించారు.  ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.                       

-చిరంజీవి

రిషికపూర్‌ మరణం సినీ పరిశ్రమకు తీరనిలోటు. గొప్ప ప్రతిభావంతుడైన నటుడు. నిజమైన లెజెండ్‌. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.

- మహేష్‌బాబు 

రిషికపూర్‌, ఇర్ఫాన్‌ఖాన్‌ లాంటి ఇద్దరు నట దిగ్గజాలు హఠాత్తుగా మనకు దూరమవ్వటం చాలా బాధాకరం. వారి విశేషప్రతిభ, చిత్రాల ద్వారా ఎప్పటికీ గుర్తుంటారు.

-బాలకృష్ణ

 చింటూ జీ మరణవార్తను నమ్మలేకపోతున్నాను. ఎప్పుడూ చిరునవ్వుతో పలకరించే మంచి మనసున్న వ్యక్తి. ఇద్దరి మధ్య చక్కటి ప్రేమ, గౌరవభావముంది. మంచి స్నేహితుణ్ణి కోల్పోయాను

-కమల్‌హాసన్‌

అద్భుత నటుడు. మంచి మనసున్న మనిషి. మా జీవితాల్లో ఎంతో సంతోషాన్ని నింపిన మిమ్మల్ని కోల్పోవడం విచారకరం

-అమీర్‌ఖాన్‌ 

ఓ గొప్ప శకం ముగిసింది. మీకున్న దయార్థహృదయం, ప్రతిభ మరొకరికి సాధ్యం కాదు. మీ గురించి  కొంతైనా తెలుసుకున్నందుకు గర్వంగా ఉంది.

-ప్రియాంకచోప్రా


logo