కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ వినూత్నమైన కథాంశాలతో సినిమాలు చేయాలన్నదే తన అభిమతమని అన్నారు కె.నిరంజన్‌రెడ్డి. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన ఆయన ప్రస్తుతం ‘బాయ్‌ఫ్రెండ్ హైర్’, ‘హౌస్ అరెస్ట్’ ‘హను-మాన్’ చిత్రాల్ని నిర్మిస్తున్నారు. నేడు ఆయన జన్మదినం. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ‘చిన్నతనంలోనే సినిమా పట్ల నాలో ఆసక్తి మొదలైంది. ఆ ఇష్టమే నిర్మాతగా మారడానికి ప్రేరణనిచ్చింది. వినూత్న కథాంశాలకే నా తొలి ప్రాధాన్యత. రొమాంటిక్ ఎంటర్టైనర్గా ‘బాయ్ఫ్రెండ్హైర్’ సినిమాను తెరకెక్కిస్తున్నాం. టైటిల్ మాదిరిగానే విభిన్నంగా సినిమా ఉంటుంది. బాలల కథాంశాలతో తెలుగులో సినిమా వచ్చి చాలా రోజులైంది. ఆ లోటును భర్తీ చేస్తూ పూర్తి వినోదాత్మక ఇతివృత్తంతో ‘హౌస్ అరెస్ట్’ను రూపొందించాం. ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఓటీటీ ఆఫర్స్ వచ్చాయి. కానీ థియేటర్లో విడుదల చేయాలనే ఆలోచనతో మంచి రోజుల కోసం ఎదురుచూస్తున్నాం. ఇక ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘హను-మాన్’ తొలి షెడ్యూల్ పూర్తయింది. సూపర్‌హీరో కథాంశంతో ఐదేళ్ల నుంచి అరవై ఏళ్ల వరకు ప్రతి ఒక్కరినీ ఈ సినిమా అలరిస్తుంది. స్పైడర్మాన్, బ్యాట్‌మాన్ తరహా సినిమాలు మనము చేయవచ్చని నిరూపిస్తుంది. సీనియర్, జూనియర్ అనే భేదాలు లేకుండా అందరూ దర్శకులతో పనిచేయాలనుంది. దర్శకులకు స్వేచ్ఛనిస్తూ వారి ప్రతిభను పూర్తిస్థాయిలో వెలికితీయాలన్నదే మా సంస్థ ముఖ్యోద్దేశం. భవిష్యత్తులో మా బ్యానర్ ద్వారా టైమ్ ట్రావెల్, సైన్స్‌ఫిక్షన్‌తో పాటు విభిన్న జోనర్లలో సినిమాలు చేస్తాను. మరో మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి’ అని తెలిపారు.