లండన్ : ఇల్లు లేదు, ఉద్యోగం లేదు..దిక్కుతోచని స్థితిలో 60 ఏండ్ల వృద్ధుడు షార్కీ పెంపుడు కుక్కతో కలిసి తన కారులోనే కాలం వెళ్లదీస్తున్న ఘటన బ్రిటన్‌లో వెలుగుచూసింది. స్పెయిన్‌లో స్ధానిక కౌన్సిల్ ప్రాధాన్యతా జాబితాలో షార్కీ పేరులేకపోవడంతో ఆయన నిరాశ్రయుడయ్యాడు. దిక్కుతోచని ఆయన ఏడు నెలల నుంచి బ్రిటన్‌కు మకాం మార్చి తన టయోటా హల్క్ వాహనంలోనే కాలక్షేం చేస్తున్నాడు. షార్కీకి ఒక స్ధిరమైన చిరునామా లేకపోవడంతో ఉద్యోగమూ లభించలేదు. షార్కీ ఇంకా కావెంట్రీ సిటీ కౌన్సిల్ వెయిటింగ్ జాబితాలోనే ఉన్నాడు.
ఏడు నెలలుగా కారులోనే నివాసం ఉండటంతో ఆయనకు నడుము, వెన్ను నొప్పి మొదలైంది. గతంలో తాను ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేవాడినని ఇప్పుడు తాను దయనీయ స్ధితిలో ఉన్నానని షార్కీ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను కుక్కతో కలిసి హోటల్లో ఉండేందుకు అధికారులు చెల్లింపులకు నిరాకరించారని చెప్పాడు. గతంలో తాను గోల్ఫ్ ఆడేవాడినని, కుక్కను తనతో పాటు వాకింగ్‌కు తీసుకువెళ్లేవాడనని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పుకొచ్చాడు. నిరాశ్రయుడిగా మారిన తాను ఇప్పుడు కుంగుబాటుకు లోనై మందులు వాడుతున్నానని తెలిపాడు.
కౌన్సిల్లో పనిచేసే షార్కీ స్నేహితుడు ఆయనకు సాయం అందించేందుకు అందరికీ ఈ మెయిల్స్ చేస్తున్నానని చెప్పాడు. కుక్కను విడిచిపెడితే ఆయనకు వసతి కల్పించే వెసులుబాటు ఉన్నా అందుకు షార్కీ నిరాకరిస్తున్నాడని స్నేహితుడు వెల్లడించాడు. మరోవైపు షార్కీ నిరాశ్రయ దరఖాస్తు అర్హతలకు అనుగుణంగా లేనందున ప్రాధాన్యతా జాబితాలో చోటు దక్కలేదని కౌన్సిల్ ప్రతినిధి వివరించారు. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని షార్కీ, ఆయన తరపు న్యాయవాది కోరిన అంశం మరో రెండు వారాల్లో విచారణకు వస్తుందని చెప్పారు. ఈలోగా ఆయనకు సాయం చేసేందుకు తమ బృందం షార్కీని సంప్రదిస్తుందని చెప్పారు.