ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 08, 2020 , 11:23:56

జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి మృతికి బాల‌కృష్ణ‌, వెంకీ, మోహ‌న్ బాబు సంతాపం

జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి మృతికి బాల‌కృష్ణ‌, వెంకీ, మోహ‌న్ బాబు సంతాపం

ప్రముఖ సీనియర్‌ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి(74) మంగళవారం ఉదయం గుండెపోటుతో గుంటూరులో కన్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆయన మృతిపై పలు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హీరోలు బాలకృష్ణ‌, వెంక‌టేష్‌, మోహ‌న్ బాబు ..జ‌య‌ప్ర‌కాశ్ మృతి త‌మ‌ని ఎంతో క‌ల‌చివేసింద‌ని ట్వీట్ చేశారు.

ఎన్నో మంచి పాత్రలతో మెప్పించిన విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి గారి మృతి విచారకరం, పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను - నందమూరి బాలకృష్ణ

జయప్రకాష్ రెడ్డి మరణవార్త నన్ను ఎంతగానో బాధించింది. మా లక్ష్మీ పిక్చర్స్ బ్యానర్ లో ఎన్నో మంచి పాత్రలు చేశారు. నటుడిగా జయప్రకాష్ రెడ్డి బిజీగా ఉన్నప్పటికీ తనకు ఎంతో ఇష్టమైన నాటక రంగాన్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ నాటకాల్లో పాత్రలు పోషిస్తూ ఉండేవారు. పదిమందికి సహాయం చెయ్యాలనే వ్యక్తి తను.  జయప్రకాష్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని శిరిడి సాయినాధున్ని కోరుకుంటున్నాను వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను - - డా. మంచు మోహన్ బాబు

నా ప్రియ‌మైన స్నేహితుడు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి గారి ఆక‌స్మిక మ‌ర‌ణం గురించి విన్న‌ప్పుడు చాలా బాధ ప‌డ్డాను. మాది తెర‌పై అద్భుత‌మైన కాంబినేష‌న్. ఖ‌చ్చితంగా అత‌నిని మిస్ అవుతాం. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని దేవుడిని ప్రార్ధిస్తున్నాను. కుటుంబంకి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను అంటూ వెంకీ ట్వీట్ చేశారు.

జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డితో క‌లిసి పనిచేసిన ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, న‌టులు ఆయ‌న మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. మంచు విష్ణు, రామ్ త‌దిత‌రులు జ‌య‌ప్ర‌కాశ్ మృతికి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు.


logo