శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 19, 2020 , 00:17:30

కుంభకోణం చేసిందెవరు?

కుంభకోణం చేసిందెవరు?

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్‌ దర్శకుడు. కాజల్‌ అగర్వాల్‌, సునీల్‌శెట్టి కీలక పాత్రధారులు. ‘ది రైజ్‌ ఆఫ్‌ మోసగాళ్లు’ పేరుతో ఈ సినిమా టైటిల్‌ థీమ్‌ మ్యూజిక్‌ను శుక్రవారం హీరో వెంకటేష్‌ విడుదలచేశారు.  ఈ థీమ్‌ మ్యూజిక్‌ వీడియోలో అమెరికన్‌ డాలర్‌ నోటు,  పాతకాలం నాటి వాచ్‌, తాళంచెవి కనిపించడం ఆసక్తిని పంచుతోంది. ఈ సినిమాలో మంచు విష్ణుకు సోదరిగా కాజల్‌ అగర్వాల్‌ కనిపించబోతున్నది.  ‘భారత్‌లో మొదలై అమెరికాను వణికించిన అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్నది. ఆద్యంతం థ్రిల్‌ను పంచుతుంది. మంచు విష్ణు, కాజల్‌ అగర్వాల్‌ పాత్రలు విభిన్నంగా ఉంటాయి. ఈ సినిమాతో బాలీవుడ్‌ నటుడు సునీల్‌శెట్టి తెలుగు చిత్రసీమకు పరిచయంకానున్నారు’ అని చిత్రబృందం తెలిపింది. నవదీప్‌, నవీన్‌చంద్ర, రుహానీ సింగ్‌ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: షెల్డన్‌ చౌ.