శనివారం 29 ఫిబ్రవరి 2020
లక్ష్‌లో ఆ తపన కనిపించింది

లక్ష్‌లో ఆ తపన కనిపించింది

Feb 09, 2020 , 23:33:34
PRINT
లక్ష్‌లో ఆ తపన కనిపించింది

‘అనుబంధాలు, స్నేహం కంటే తపనను నేను ఎక్కువగా నమ్ముతాను. పాషన్‌ ఉంటేనే ఇండస్ట్రీలో రాణించగలుగుతాం.  ఆ తపన లక్ష్‌లో నాకు కనిపించింది. ట్రైలర్‌ బాగుంది’ అన్నారు హీరో అడివిశేష్‌. చదలవాడ శ్రీనివాసరావు తనయుడు లక్ష్‌ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘వలయం’. రమేష్‌ కడుముల దర్శకుడు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్‌ పతాకంపై చదలవాడ పద్మావతి నిర్మిస్తున్నారు. దిగంగన సూర్యవన్షి కథానాయిక. ఈ నెల 21న విడుదలకానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను ఆదివారం హైదరాబాద్‌లో అడివి శేష్‌ విడుదలచేశారు. ఈ సందర్భంగా దర్శకుడు కె.ఎస్‌.నాగేశ్వరరావు మాట్లాడుతూ ‘ఇదే సంస్థ ద్వారా ‘రిక్షా రుద్రయ్య’ సినిమాతో దర్శకుడిగా నేను పరిచయమయ్యాను. ఆ సినిమాలో బాలనటుడిగా లక్ష్‌ కనిపించారు. 


అతడు హీరోగా అరంగేట్రం చేస్తున్న ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి’ అని తెలిపారు. ‘కంటెంట్‌, క్రియేటివిటీ ఉంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని ‘బిచ్చగాడు’ సినిమా నిరూపించింది. ఆ సినిమా తరహాలోనే ‘వలయం’ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అని చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. లక్ష్‌ మాట్లాడుతూ ‘సమిష్టి కృషికి ఈ సినిమా నిదర్శనం. స్క్రీన్‌ప్లే ప్రధాన చిత్రాలతో నూతన ఒరవడికి అడివిశేష్‌ శ్రీకారం చుట్టారు. హీరోగా అతడి దారినే నేను అనుసరించాలనుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. అనూహ్యంగా అదృశ్యమైన భార్య ఆచూకీ కోసం అన్వేషించే ఓ భర్త కథ ఇదని, ఆద్యంతం ఉత్కంఠభరితమైన మలుపులతో సాగుతుందని దర్శకుడు తెలిపారు. కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్‌ సినిమాకు సంగీతాన్ని అందించాలనే తన కల ఈ సినిమాతో తీరిందని సంగీత దర్శకుడు శేఖర్‌చంద్ర చెప్పారు. ఈ కార్యక్రమంలో శోభారాణి, రవిప్రకాష్‌, నోయల్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo