శనివారం 06 జూన్ 2020
Cinema - Apr 27, 2020 , 00:10:43

లక్ష ఉద్యోగాలే లక్ష్యంగా ‘టీడీఎఫ్‌'

లక్ష ఉద్యోగాలే లక్ష్యంగా ‘టీడీఎఫ్‌'

  • కోటి రూపాయల ఫండ్‌తో నిరుద్యోగులకు భరోసా
  • మధ్యతరగతి ప్రజల కోసం 25లక్షల విరాళం

తన జీవితకాలంలో లక్ష మందికి ఉద్యోగాలు కల్పించే మహత్తర లక్ష్యంతో ‘టీడీఎఫ్‌' (ది దేవరకొండ ఫౌండేషన్‌) పేరుతో గత ఏడాది జూలైలో తానొక సీక్రెట్‌ ప్రాజెక్ట్‌ను ఆరంభించానని చెప్పారు అగ్ర హీరో విజయ్‌ దేవరకొండ. ఔత్సాహిక యువత ఉద్యోగాలు పొందేలా తీర్చిదిద్దడమే తన ఫౌండేషన్‌ లక్ష్యమని చెప్పారు. కరోనా ప్రభావంతో ఇబ్బందిపడుతున్న మధ్యతరగతి ప్రజలకు అండగా ఉండేందుకు  25లక్షల రూపాయలతో ‘మిడిల్‌క్లాస్‌ ఫండ్‌' ను మొదలుపెడుతున్నానని విజయ్‌ దేవరకొండ ప్రకటించారు. ఈ మేరకు  ఆయన ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో తాను అందించబోతున్న సేవా కార్యక్రమాల అందులో వివరించారు.

‘టీడీఎఫ్‌కు’ కోసం కోటి రూపాయలు..

ఈ లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత నిరుద్యోగం రూపంలో అతిపెద్ద సమస్య ఎదురుకాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన సంక్షోభం వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితిని మనందరం అధిగమించాల్సిన అవసరం ఉంది. గత ఏడాది జూలైలో ‘ది దేవరకొండ ఫౌండేషన్‌'ను మొదలుపెట్టా.  తొలిలక్ష్యంగా 50 మంది ఔత్సాహిక యువతీయువకులకు ఉద్యోగాల్ని కల్పించాలని నిర్ణయించుకున్నా. అందుకోసం గత ఏడాది సెప్టెంబర్‌లో 650 మంది నుంచి ప్రొఫైల్స్‌ స్వీకరించి వారిలో 120 మెంబర్స్‌ను షార్ట్‌లిస్ట్‌ చేశాం. అందులో 50మందిని ఎంపిక చేసుకున్నాం. వారిలో ఇద్దరికి ఉద్యోగం వచ్చింది. మిగతా 48 మంది ఈ కరోనా క్రైసిస్‌ ముగిసిన తర్వాత ఉద్యోగాలు సంపాదించుకుంటారని భావిస్తున్నా. ఉద్యోగార్హులకు వారికి అభిరుచి ఉన్న రంగాల్లో శిక్షణ అందించడమే మా ఫౌండేషన్‌ లక్ష్యం. దానికి అద్భుతమైన ప్రణాళికల్ని రచించాం. కరోనా నుంచి బయటపడిన తర్వాత మా ఫౌండేషన్‌ కార్యకలాపాల్ని మరింత విస్తృతం చేయబోతున్నాం. యువతకు ఉద్యోగకల్పన  కోసం ‘టీడీఎఫ్‌'కు కోటి రూపాయల్ని కేటాయిస్తున్నా.

5 ఏళ్ల క్రితం ఈ పరిస్థితి  ఉంటే..

నేటి కరోనా పరిస్థితులు ఐదేళ్ల క్రితం వచ్చి ఉంటే ఎలా ఉండేదో అనిపిస్తోంది. ఆ టైమ్‌లో కుటుంబమంతా  అమ్మనాన్నల సంపాదన మీదే ఆధారపడి ఉండేది. కిరాయి కట్టడానికి కష్టంగా ఉండేది. ఒకటో తారీఖు కాకుండా పదో తారీఖు కట్టేవాళ్లం. గ్యాస్‌సిలిండర్‌ ఎప్పుడయిపోతుందో, నెల సరుకులు సరిపోతాయే లేదో అని భయం ఉండేది. కానీ అమ్మనాన్న ఫైటర్స్‌. మాకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకున్నారు. కానీ నేటి పరిస్థితులు అప్పుడు ఉంటే కుటుంబ పోషణ కాలా కష్టంగా ఉండేదనిపిస్తోంది.

25లక్షలతో మిడిల్‌ క్లాస్‌ ఫండ్‌..

కరోనా ప్రభావంతో ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి కుటుంబాల్ని ఆదుకోవడానికి 25లక్షల ఫండ్‌ను ఇస్తున్నా. జీతాలు సరిగ్గా రాకుండా నిత్యవసరాలకు కష్టంగా ఉన్న మిడిల్‌క్లాస్‌ వాళ్లు thedevarakondafoundation.org  వెబ్‌సైట్‌కు వివరాల్ని పంపించండి. వాటిని మా టీమ్‌ పరిశీలిస్తుంది. మీ ఇంటికి వచ్చి అక్కడి దగ్గరలోని కిరాణషాప్‌, సూపర్‌మార్కెట్‌లో సరుకుల్ని ఇప్పిస్తారు. దీనిని నేను ఛారిటీలా భావించడం లేదు. ఈ కార్యక్రమాలు చేయడానికి నాకు డబ్బుని ఆర్జించే మార్గం సినిమాలే. కరోనా ప్రభావంతో సినిమాలన్ని ఆగిపోయాయి. అవి ఎప్పుడు ఆరంభమవుతాయో తెలియదు. కానీ నాకు అవసరం ఉందని తెలిసి మిత్రులు కొందరు డబ్బు లోన్‌గా ఇచ్చారు. షూటింగ్‌ స్టార్ట్‌ కాగానే వాళ్లకు డబ్బులు తిరిగి ఇచ్చేస్తా. 2000 కుటుంబాలకు సహాయం అందివ్వాలని నిర్ణయించాం. 

తెలంగాణ ప్రభుత్వం మనల్ని కాపాడుతోంది

కరోనా క్రైసిస్‌లో మన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని చూస్తున్నా. ఇలాంటి ప్రభుత్వం ఉండటం వల్ల మనమంతా సేఫ్‌ అనిపిస్తోంది. కేసీఆర్‌గారి ప్రభుత్వం కరోనా సంక్షోభంలో అద్భుతమైన పనితీరు కనబరుస్తోంది. తెల్లరేషన్‌ కార్డుదారులకు అకౌంట్‌లో డబ్బులు వేయడం, ఇంటిఓనర్లు కిరాయిలు అడగొద్దని ఆర్డర్స్‌ పాస్‌ చేయడం వంటి చర్యలు ప్రజలకు చాలా ఉపయోగపడుతున్నాయి. అలాగే ఎన్నో  ఎన్జీఓ సంస్థలు వలస కార్మికులకు సేవలందిస్తున్నాయి. చిరంజీవిగారి నాయకత్వంలో సినీరంగంలో కూడా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి.logo