నాయికా పురాణం

భారతీయ సినిమా స్వర్ణయుగకాలంలో పౌరాణిక ఇతివృత్తాల ప్రాభవం ఎక్కువగా ఉండేది. పురాణగాథల్లో ప్రశస్తి పొందిన స్త్రీ పాత్రల్లో నాటి అగ్రనాయికలు మెప్పించారు. ఈ ట్రెండ్ తిరిగి పునరావృతమవుతోంది. మహాభారతం, రామాయణం ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కిస్తున్న పలు చిత్రాల్లో అగ్ర కథానాయికలు భాగమవుతున్నారు. తమ కెరీర్లో ఈ పాత్రలు లభించడం అదృష్టంగా భావిస్తున్నారు.
కెరీర్ ఆరంభం నుంచి కథాంశాల ఎంపికలో కొత్తదనానికి పెద్దపీట వేస్తోంది బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికాపడుకోన్. కమర్షియల్ పంథాలోనే వైవిధ్యమైన ఇతివృత్తాల్ని ఎంచుకుంటోంది. ‘రామ్‌లీల’ ‘బాజీరావు మస్తానీ’ ‘పద్మావత్' వంటి చారిత్రక చిత్రాల ద్వారా ప్రేక్షకుల్లో తిరుగులేని అభిమానాన్ని సంపాదించుకున్న ఈ మంగళూరు సోయగం తొలిసారి పౌరాణిక ద్రౌపది పాత్రలో నటించబోతున్నది. ‘మహాభారత్' పేరుతో అగ్ర నిర్మాత మధు మంతెన భారీ చిత్రాన్ని రూపొందించబోతున్న విషయం తెలిసిందే. ద్రౌపది దృష్టికోణం నుంచి నడిచే ఈ కథలో ద్రౌపది పాత్రను దీపికాపడుకోన్ పోషించబోతున్నది. మరోవైపు ఈ చిత్ర నిర్మాణంలో దీపికాపడుకోన్ కూడా ఓ భాగస్వామిగా ఉండటం విశేషం. ‘జీవితకాలంలో దొరికే అరుదైన పాత్ర ఇది. నా కల సాఫల్యమైనట్లుగా భావిస్తున్నా. మహాభారతం భారతీయ సంస్కృతిలో ఓ భాగంగా విరాజిల్లుతోంది. ఎన్నో జీవిత సత్యాల్ని ఈ అపురూపగాథ నుంచి ఉదహరిస్తుంటారు. ఇప్పటివరకు వచ్చిన మహాభారత నేపథ్య కథలు పురుషుడి దృష్టికోణం నుంచే సాగాయి. తొలిసారిగా ఓ మహిళ దృక్కోణం నుంచి మహాభారతాన్ని ఆవిష్కరించబోతున్నాం’ అని దీపికాపదుకోన్ ఆనందం వ్యక్తం చేసింది. మూడు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ అగ్ర కథానాయకులు హృతిక్‌రోషన్ కర్ణుడిగా, అమీర్‌ఖాన్ కృష్ణుడి పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సీత పాత్రలో కృతిసనన్
రామాయణ ఇతిహాసం ఆధారంగా ప్రభాస్ కథానాయకుడిగా ఓంరౌత్ (‘తానాజీ’ ఫేమ్) దర్శకత్వంలో ‘ఆది పురుష్' పేరుతో చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. పౌరాణిక అంశాలకు కాల్పనికత జోడించి ఈ సినిమాకు రూపకల్పన చేస్తున్నారు. త్రీడీ, విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా రూపొందించబోతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రను పోషించబోతున్నారు. సీత పాత్రలో కృతిసనన్‌ను ఎంపిక చేశారు. తెలుగులో ‘నేనొక్కడినే’ ‘దోచెయ్' సినిమాల్లో యువతను ఆకట్టుకునే ఈ సుందరి తొలిసారి పౌరాణిక పాత్రలో నటించబోతున్నది. తెలుగు, హిందీ భాషల్లో భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఫిబ్రవరి మొదటివారంలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్ అగ్ర నటుడు సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో ప్రతినాయకుడు లంకేష్ పాత్రలో కనిపించనున్నారు.
సమంత శాకుంతలం
మహాభారతంలోని ఆదిపర్వంలో శకుంతల-దుష్యంతుడి ప్రణయగాథకు విశిష్ట ప్రాధాన్యముంది. విశ్వామిత్రుడు, మేనకల కుమార్తె అయినటువంటి శకుంతలను అపురూప సౌందర్యవతిగా అభివర్ణిస్తారు. దుష్యంతుడితో ఆమె ప్రేమకథ ఆసక్తికరమైన ఘటనల సమాహారంగా సాగుతుంది. ఈ పౌరాణిక ప్రణయేతిహాసాన్ని ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ వెండితెర దృశ్యమానం చేయబోతున్నారు. ఇందులో సమంతను కథానాయికగా ఖరారు చేశారు. గుణాటీమ్ వర్క్స్ పతాకంపై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. కెరీర్లో ఎన్నో ప్రేమకథా చిత్రాల్లో మెప్పించిన సమంత తొలిసారి ఓ పౌరాణిక సౌందర్యవతి కథలో నటించబోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ చిత్రం త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది.
చోళ యువరాణిగా త్రిష
ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న చారిత్రక చిత్రం ‘పొన్నియన్ సెల్వం’. చోళులకాలం నాటి ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, అమితాబ్‌బచ్చన్ వంటి అగ్ర తారలు నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలో త్రిష కుందవై అనే చోళ వంశపు యువరాణి పాత్రలో నటిస్తుందని తెలిసింది. రాజ్య పరిరక్షణ కోసం తండ్రి, సోదరుడితో కలిసి కదనరంగంలో దూకే వీరనారిగా ఆమె పాత్ర సాహసోపేతంగా సాగుతుందని చెబుతున్నారు. ఈ సినిమా కోసం త్రిష గుర్రపుస్వారీతో పాటు కత్తిసాము వంటి ప్రాచీన యుద్ధవిద్యల్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది.
తాజావార్తలు
- ఐదు రాష్ట్రాల్లో నేడు మోగనున్న ఎన్నికల నగారా..!
- గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ పోలీస్
- బెంగాల్లో స్మృతి ఇరానీ రోడ్ షో..!
- చైనా విదేశాంగ మంత్రితో జైశంకర్ 75 నిమిషాల సంభాషణ
- గజకేసరిగా యష్ ..సాయంత్రం చిత్ర టీజర్ విడుదల
- రెండు తలల దూడకు జన్మనిచ్చిన బర్రె.. ఎక్కడో తెలుసా?
- బీజేపీని సవాల్ చేస్తున్నది ఆమ్ ఆద్మీ పార్టీయే : కేజ్రీవాల్
- శ్రీవారికి పోస్కో భారీ విరాళం
- బ్రెజిల్‌కు రెండు కోట్ల కోవాగ్జిన్ టీకా డోసులు
- బీజేపీలో చేరిన మెట్రో మ్యాన్ శ్రీధరన్