శంకర్ అంటే కేవలం సౌత్ డైరెక్టర్ మాత్రమే కాదు పాన్ ఇండియన్ దర్శకుడు.. అలాగే రామ్ చరణ్ కూడా ట్రిపుల్ ఆర్ తర్వాత పాన్ ఇండియన్ హీరో అయిపోవడం ఖాయం. అలాంటి ఈ ఇద్దరు స్టార్స్‌తో సినిమా చేయాలని నిర్మాత అనుకున్నపుడు బడ్జెట్ కూడా కోటలు దాటుతుంది. పైగా కేవలం సౌత్ మాత్రమే కాదు.. పాన్ ఇండియన్ రేంజ్లో ఇప్పుడు శంకర్, రామ్ చరణ్ సినిమా గురించి చర్చ జరుగుతుంది. రెండు భిన్న ధృవాలు ఈ సినిమాతో కలిసి పనిచేయబోతున్నాయి అందుకే అభిమానులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.30 ఏళ్లుగా తెలుగు సినిమా వైపు చూడని ఈ దర్శకుడు ఇప్పుడు స్ట్రెయిట్ మూవీ చేస్తున్నాడు. దీనికోసం స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేస్తున్నాడు శంకర్. ఇప్పటికే శంకర్ చెప్పిన లైన్ కూడా నచ్చడంతో నిర్మాత దిల్ రాజు ఓకే చెప్పేశాడు.
ఇదిలా ఉంటే సాధారణంగా శంకర్ సినిమా అంటే కచ్చితంగా విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు ఇంకా చాలా కథలు ఉంటాయి. అవన్నీ పూర్తయ్యే సరికి కచ్చితంగా రెండు మూడేళ్లు పడుతుంది. అందుకే గత పదేళ్లలో ఈయన నుంచి మూడు సినిమాలు మాత్రమే వచ్చాయి. తాజాగా రామ్ చరణ్ సినిమాను కూడా రెండు మూడేళ్లు చేస్తాడని ఇప్పటికే ఈ సినిమా గురించి అభిమానులు చర్చ మొదలు పెట్టారు. కానీ ఈ సారి మాత్రం అలా ఉండదంటున్నాడు శంకర్. తనతో సినిమా అంటే కచ్చితంగా రెండు మూడేళ్లు అవుతుందని అంతా ఫిక్స్ అవుతారు కానీ రామ్ చరణ్ సినిమాను మాత్రం వీలైనంత త్వరగా పూర్తి చేస్తానంటున్నాడు. ఈ సినిమాలో ఎలాంటి విజువల్ ఎఫెక్ట్స్ కానీ.. స్పెషల్ సీన్స్ కానీ ఉండవంటున్నాడు ఈ దర్శకుడు. కేవలం కథతోనే ఈ సినిమా ముందుకు వెళ్తుంది కానీ టెక్నికల్ బేస్ మీద కాదంటున్నాడు ఈ దర్శకుడు. రాజకీయ నేపథ్యంలో రామ్ చరణ్ సినిమా ఉండబోతుంది. ఒకే ఒక్కడు సినిమాకు సీక్వెల్ ఇది అనే ప్రచారం కూడా జరుగుతుంది.
ఫైనల్ నెరేషన్ అయిపోతే షూటింగ్ కు వెళ్లడమే తరువాయి అంటున్నాడు ఈ దర్శకుడు. దిల్ రాజు కూడా ఈ నెరేషన్ కోసమే చూస్తున్నాడు. తెలుగు, తమిళంతో పాటు మలయాళం, కన్నడ, హిందీల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది. 2022 సమ్మర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాను రూ.150 కోట్లతో నిర్మించాలని చూస్తున్నాడు దిల్ రాజు. అందులో చెరో రూ.40 కోట్ల పారితోషికం శంకర్, రామ్ చరణ్‌కు ఇస్తున్నాడు దిల్ రాజు. మిగిలిన రూ.70 కోట్లు ప్రొడక్షన్ కాస్ట్ అని తెలుస్తుంది. అనుకున్న దానికంటే మహా అయితే 10-20 కోట్లు ఎక్కువైతే పర్లేదు కానీ మరీ ఎక్కువ మాత్రం కాకుండా జాగ్రత్త పడుతున్నాడు దిల్ రాజు. మరి ఈయన ప్లానింగ్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి