శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 27, 2020 , 19:33:22

చిరంజీవి సినిమాను వినాయక్ అందుకే వదులుకున్నాడా..?

చిరంజీవి సినిమాను వినాయక్ అందుకే వదులుకున్నాడా..?

చిరంజీవితో సినిమా చేసే అవకాశం వస్తే ఏ దర్శకుడు కూడా అంత ఈజీగా వదులుకోడు. ఎందుకంటే ఆయనతో సినిమా చేయడం ఒక గౌరవంగా భావిస్తారు దర్శకులు. ఇక ఈ తరం దర్శకులు ఎప్పుడెప్పుడు మెగాస్టార్ తో పనిచేసే అవకాశం వస్తుందా అని వేచి చూస్తుంటారు. అలాంటిది దర్శకుడు వి వి వినాయక్ మాత్రం మెగాస్టార్ చిరంజీవి సినిమాను వదిలేసుకున్నాడు. లూసిఫర్ రీమేక్ చేసే బాధ్యత వినాయక్ చేతిలో పెడితే ఆయన సున్నితంగా ఇందులో నుంచి బయట పడ్డాడు. అప్పుడు దానికి కారణం చిరంజీవి పెట్టిన ఒత్తిడి అని ప్రచారం జరిగింది. కానీ దీనికి అసలు కారణాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. వినాయక్ ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది. 

చిరంజీవికి నచ్చేలా కథ సిద్ధం చేయకపోవడం అనే విషయం పక్కన పెడితే..మరో రీమేక్ కోసం వినాయక్ సినిమా వదులుకున్నాడు. టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ కి వెళ్తున్నాడు. అక్కడ కూడా ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దీనికోసం ప్రభాస్ ఛ‌త్రపతి సినిమాను నమ్ముకున్నాడు బెల్లంకొండ. ఈ సినిమాను త్వరలోనే హిందీలో రీమేక్ చేయబోతున్నాడు. అక్కడ  ఈ సినిమాను వినాయక్ తెరకెక్కించబోతున్నాడు. 15 ఏళ్ల కింద తెలుగులో విడుదలైన చత్రపతి ప్రభాస్ కు మాస్ ఇమేజ్ తీసుకొచ్చింది. ఆయనను స్టార్ హీరోగా మార్చేసింది. ఇప్పుడు ఇదే సినిమాను తన బాలీవుడ్ ఎంట్రీ కోసం వాడుకుంటున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. తనకు ఎంతో ఇష్టమైన దర్శకుడు వి వి వినాయక్ సాయం దీనికోసం తీసుకుంటున్నాడు. తెలుగు ఇండస్ట్రీకి బెల్లంకొండ శ్రీనివాస్ ను పరిచయం చేసింది వినాయక్. 

అల్లుడు శీను సినిమాతో ఐదేళ్ల కింద ఈ హీరోని పరిచయం చేశాడు. మళ్లీ ఇప్పుడు బాలీవుడ్ లో లాంచ్ కావడానికి మరోసారి వినాయక్ సాయం తీసుకుంటున్నాడు. మరోవైపు వినాయక్ కూడా ఒకే హీరోను రెండుసార్లు లాంచ్ చేసే అవకాశం అందుకున్నాడు. ఈ అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. పెన్ మూవీస్ ఈ సినిమాను హిందీలో నిర్మించబోతుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు పూర్తిగా బయటకు రానున్నాయి. ప్రస్తుతానికి దర్శకుడి వివరాలు మాత్రం బయట పెట్టారు. బెల్లంకొండ సినిమా కోసమే చిరంజీవి సినిమాను పక్కన పెట్టేశాడు వినాయక్. ఈ విషయం ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. మరి తెలుగులో రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాను హిందీలో వినాయక్ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.