శనివారం 16 జనవరి 2021
Cinema - Dec 01, 2020 , 21:20:11

సిల్వ‌ర్ స్క్రీన్ పై రష్మిక-పూజా హెగ్డే సంద‌డి

సిల్వ‌ర్ స్క్రీన్ పై రష్మిక-పూజా హెగ్డే సంద‌డి

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడున్న క్రేజ్, మార్కెట్ ప్రకారం లెక్కలేసుకుంటే నెంబర్ వన్ హీరోయిన్ పూజా హెగ్డే.. ఆమె తర్వాత ఉన్నది రష్మిక మందన్న. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ప్రస్తుతం వరస సినిమాలతో రప్ఫాడించేస్తున్నారు. పూజా అయితే ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్.. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలతో పాటు బాలీవుడ్ ఆఫర్స్ కూడా అందుకుంటుంది. మరోవైపు రష్మిక కూడా తక్కువేం కాదు. ఈమె కూడా తెలుగులో ఈ ఏడాది ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు, భీష్మ లాంటి హిట్స్ ఇచ్చింది. ఇప్పుడు బన్నీతో పుష్ప.. శర్వానంద్ తో ఆడాళ్లు మీకు జోహార్లు సినిమాలతో పాటు తమిళంలో కార్తితో సుల్తాన్.. కన్నడలో ధృవ సర్జతో పొగరు సినిమాల్లో నటిస్తుంది. మొత్తానికి ఈ ఇద్దరు ఎవరి దారిలో వాళ్లు కుమ్మేస్తున్నారు. మరో ముద్దుగుమ్మకు ఛాన్స్ ఇవ్వకుండా అవకాశాలు అన్నీ లాగేసుకుంటున్నారు. 

ఈ క్రమంలో ఇద్దరూ ఒకే సినిమాలో కలిసి నటిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడు ఆ ఊహను నిజం చేస్తున్నాడు దర్శకుడు హను రాఘవపూడి. పడిపడి లేచే మనసు డిజాస్టర్ తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు హను. ప్రస్తుతం ఈయన మమ్ముట్టి తనయుడు, సెన్సేషనల్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. హను రాఘవపూడి ఈ సినిమాని తెలుగు, తమిళం, మలయాళంలో తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇందులో సైనికుడిగా నటిస్తున్నాడు దుల్కర్. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్లుగా పూజా హెగ్డే, రష్మిక మందన్నలను తీసుకోవాలని చూస్తున్నాడు హను. 

ఇప్పటికే కథ చెప్పి ఒప్పించడమే కాకుండా ఒప్పందాలు కూడా పూర్తి చేసాడని తెలుస్తుంది. దాదాపు 40 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు హను రాఘవపూడి. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. ఏదేమైనా కూడా ఒకే సినిమాలో ఇద్దరు టాప్ హీరోయిన్లను తీసుకోవడం అంటే చిన్న విషయం కాదు. పైగా ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితో ఈ స్థాయి బడ్జెట్ పెట్టడం కూడా చిన్న మ్యాటర్ కాదు. కానీ అక్కడ దుల్కర్ సల్మాన్ ఉన్నాడు. ఈయనకు ఉన్న ఫాలోయింగ్ కారణంగానే ఇద్దరు బ్యూటీస్ నటించడానికి ఒప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూడాలిక.. ఈ టాప్ బ్యూటీస్ ను తన కథతో ఎలా చూపించబోతున్నాడో హను రాఘవపూడి..?

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.