గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Oct 04, 2020 , 00:32:36

ఆర్టిస్టుల పారితోషికాల్లో 20శాతం కోత

ఆర్టిస్టుల పారితోషికాల్లో 20శాతం కోత

కరోనా సంక్షోభ పరిస్థితుల నుంచి కోలుకుంటున్నప్పటికీ..భవిష్యత్తులో సినీ నిర్మాణపరంగా అనేక సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని యాక్టివ్‌ తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌ గిల్డ్‌ అభిప్రాయపడింది. ఈ మేరకు శనివారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. థియేటర్లలో ప్రేక్షకుల ఆక్యుపెన్సీ విషయంలో సందిగ్ధత, యాభైశాతం సీట్ల సామర్థ్యంతో థియేటర్లను నడిపించడం, విదేశి థియేట్రికల్‌ మార్కెట్‌ను పూర్తిగా కోల్పోవడం వంటి అంశాలు సవాళ్లుగా మారబోతున్నాయని పేర్కొంది. ఈ ప్రతికూల పరిస్థితుల్ని కలిసికట్టుగా అధిగమించడానికి,  పారితోషికాలు తగ్గించుకునే అంశంలో మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌తో (మా) చర్చలు జరిపామని యాక్టివ్‌ తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌ గిల్డ్‌ పేర్కొంది. పారితోషికాల్ని 20శాతం తగ్గించుకోవడానికి ‘మా’ సుముఖత వ్యక్తం చేసిందని తెలిపింది. లాక్‌డౌన్‌కు ముందు నిర్ణయించిన రేట్ల ప్రకారం పారితోషికాల్లో 20శాతం కోత ఉంటుందని స్పష్టం చేసింది. రోజుకు ఇరవైవేలలోపు పారితోషికం తీసుకునే ఆర్టిస్టులకు ఈ నియమం నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపింది. ఒక సినిమాకు ఐదు లక్షలకు మించి పారితోషికం తీసుకునే సాంకేతిక నిపుణులు కూడా రెమ్యునరేషన్‌లో 20 శాతం తగ్గించుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత ఈ ఒప్పందంపై పునఃసమీక్ష చేసి నిర్ణయం తీసుకుంటామని యాక్టివ్‌ తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ తెలిపింది.logo