శనివారం 16 జనవరి 2021
Cinema - Dec 01, 2020 , 21:29:10

13 ఏండ్ల‌ కెరీర్‌..రామ్ చరణ్ నో చెప్పిన సినిమాలివే..!

13 ఏండ్ల‌ కెరీర్‌..రామ్ చరణ్ నో చెప్పిన సినిమాలివే..!

చిరంజీవి నట వారసుడిగా 2007లో చిరుత సినిమాతో తెరంగేట్రం చేసాడు రామ్ చరణ్. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ తెరకెక్కించాడు. అప్పట్లోనే ఈ చిత్రం 20 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. నిర్మాతలకు మంచి లాభాలు తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే మగధీరతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసాడు మెగా వారసుడు. అయితే ఈ 13 ఏళ్ల సమయంలో చరణ్ దగ్గరికి మణిరత్నం, గౌతమ్ మీనన్ లాంటి క్లాస్ డైరెక్టర్స్ కూడా కథలు తీసుకుని వచ్చారు. కానీ వాళ్లకు నో చెప్పాడు ఈయన. అలా 13 ఏళ్లలో దాదాపు 5 సినిమాలు ఆయన కాదనుకున్నాడు. కొన్ని కథలు నచ్చక వదిలేసాడు.. ఆ తర్వాత అవి విడుదలై ఫ్లాప్ అయ్యాయి కూడా. అలా పక్కా జడ్జిమెంట్‌తోనే చరణ్ ఈ సినిమాలకు నో చెప్పాడు. మరి అలాంటి సినిమాలేంటో చూద్దాం.. 

1. నేల టిక్కెట్టు: సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి విజయాల తర్వాత నేల టిక్కెట్టు కథ రాసుకుని చరణ్ దగ్గరికి వెళ్లాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల. కానీ కథ నచ్చక ముందు హిట్స్ ఇచ్చినా కూడా నో చెప్పేసాడు రామ్ చరణ్. 

2. కృష్ణార్జున యుద్దం: కళ్యాణ్ కృష్ణ మాదిరే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాలతో వరస విజయాలు అందించాడు మేర్లపాక గాంధీ. అలాంటి సమయంలో ఆయన చరణ్‌కు కృష్ణార్జున యుద్ధం కథ వినిపించాడు. కానీ నాయక్ సినిమాలో ద్విపాత్రాభినయం చేయడం.. కథ కూడా రొటీన్‌గానే ఉండటంతో ఈ సినిమా చేయలేదు చరణ్.

3. ఓకే బంగారం: గీతాంజలి లాంటి క్లాసిక్ తర్వాత తెలుగులో సినిమా చేయని మణిరత్నం.. చరణ్ కోసం ఓకే బంగారం కథ వినిపించాడు. అయితే ఆ సమయంలో బ్రూస్లీ సినిమాతో బిజీగా ఉండటంతో ఈ సినిమా మిస్ అయిపోయాడు చరణ్. ఆ సినిమాతోనే దుల్కర్ సల్మాన్‌కు తెలుగులో గుర్తింపు వచ్చింది. 

4. ఎటో వెళ్లిపోయింది మనసు: నాని హీరోగా వచ్చిన ఈ సినిమా కథను ముందు రామ్ చరణ్ కే చెప్పాడు గౌతమ్. అయితే ఆరెంజ్ డిజాస్టర్ కావడంతో లవ్ స్టోరీస్ వద్దనుకున్నాడు చరణ్. అలా నాని చేతికి వెళ్లింది ఎటో వెళ్లిపోయింది మనసు.

5. సూర్య సన్నాఫ్ కృష్ణన్: చిరుత విడుదలైన ఏడాది లోపే ఈ కథ తీసుకొచ్చి చరణ్ కు చెప్పాడు గౌతమ్. కానీ అంత సాఫ్ట్ సినిమా చేయడం చరణ్ కు యిష్టం లేదు.. పైగా మగధీర కోసం సిద్ధమవుతున్నాడు. ఆ తర్వాత అదే కథ సూర్యతో చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు సూర్య.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.