హీరోగా ఒకే జోనర్‌కు పరిమితమైపోకుండా విభిన్నమైన కథాంశాల్ని ఎంచుకుంటూ వైవిధ్యతను చాటుకుంటున్నారు టాలీవుడ్ (Tollywood) హీరో నాని. ఆయన సినిమా అంటే కొత్తదనం ఉంటుందనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో నిలబెట్టుకున్నారు. నాని నటించిన తాజా చిత్రం టక్ జగదీష్ (Tuck jagadish). ప్రేమకథలతో దర్శకుడిగా మెప్పించిన శివనిర్వాణ (Shiva Nirvana) తన శైలికి భిన్నంగా కుటుంబకథాంశంతో తెరకెక్కించిన చిత్రమిది. థియేటర్లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. నిన్నుకోరి తర్వాత నాని, శివనిర్వాణ కలయికలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా?ఓటీటీలో హిట్ అనిపించుకుందా?లేదా? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
కుటుంబమే ప్రపంచంగా..
భూదేవిపురానికి చెందిన జగదీష్నాయుడికి(నాని) కుటుంబమే ప్రపంచం. అమ్మనాన్నలతో పాటు అన్నయ్య బోసుబాబు (జగపతిబాబు)ఇద్దరు అక్కలతో(రోహిణి, దేవదర్శిని) అతడి ఇళ్లు కళకళలాడుతుంటుంది. జగదీష్నాయుడి తండ్రి ఆదిశేషనాయుడు(నాజర్) ఊరికి మేలు చేయాలని తపిస్తుంటాడు. కానీ అతడి ప్రయత్నాల్ని వీరేంద్రనాయుడు(డానియల్ బాలాజీ) అడ్డుకుంటుంటాడు. తన తండ్రి శేరినాయుడి చావుకు ఆదిశేషనాయుడి కుటుంబమే కారణమని భావనతో వారిపై పగను పెంచుకుంటాడు. రాజకీయాల్లో వీరేంద్రనాయుడు ఎదిగితే అతడి అక్రమాలకు అంతు ఉండదని భావించిన ఊరి ప్రజలు అతడికి ప్రత్యర్థిగా బోసుబాబును జడ్పీటీసీ ఎన్నికల్లో నిలబెట్టాలని అనుకుంటారు.
ఆదిశేషనాయుడు మరణించడంలో బోసుబాబు..వీరేంద్రతో చేతులు కలుపుతాడు. ఆస్తి కోసం తన సొంత అక్కలతో పాటు తమ్ముడిని మోసం చేస్తాడు. కళ్ల ముందే తన కుటుంబం విచ్ఛిన్నం కావడం తట్టుకోలేని జగదీష్‌నాయుడు ఏం చేశాడు? తండ్రి కలను నేరవేర్చడానికి ఎమ్ఆర్ఓ ఉద్యోగిగా ఎంపికైన అతడు వీరంద్రనాయుడి పన్నాగాల్ని ఎలా అడ్డుకున్నాడు? బోసుబాబులో మార్పు తీసుకొచ్చి తన కుటుంబాన్ని ఏ విధంగా ఒక్కటి చేశాడన్నది? అతడి కలకు గుమ్మడివరలక్ష్మి(రీతూవర్మ), చంద్రమ్మ(ఐశ్వర్యరాజేష్) ఎలా అండగా నిలిచారన్నదే మిగతా కథ.
ఉమ్మడి కుటుంబం నేపథ్యంలో..
ఉమ్మడి కుటుంబంలో ఉండే అనుబంధాలు, ఆప్యాయతలకు పెద్దపీట వేస్తూ తెరకెక్కించిన చిత్రమిది. కుటుంబ విలువలకు అన్నదమ్ముల మధ్య ఆస్తితగాదాలు, భూకక్షలను జోడించి దర్శకుడు శివనిర్వాణ ఈ కథను రాసుకున్నారు. కుటుంబంలో వచ్చిన మనస్పర్థలను చిన్నకొడుకు జగదీష్ తన తెలివితేటలు, ధైర్యంతో ఎలా పరిష్కరించాడో చూపించారు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ చిన్నదే అయినా ఆనేక లేయర్లతో కథను అల్లుకున్నారు. ప్రతి పాత్రకు జస్టిఫికేషన్ ఇవ్వడంతో చాలా పెద్ద కథ అనే భావన కలుగుతుంది.
ఊరిలోని భూకక్షలు, వీరేంద్రనాయుడు, శేరినాయుడి కుటుంబాల మధ్య పగలతో కథను మొదలుపెట్టారు దర్శకుడు. జగదీష్నాయుడికి కుటుంబం పట్ల ఉన్న ప్రేమను చూపించే సన్నివేశాలతో ప్రథమార్థం ఆహ్లాదభరితంగా సాగుతుంది. హృద్యంగా సాగిపోతున్న కథ ఆస్తికోసం బోసుబాబు అడ్డం తిరిగడంతో మలుపు తిరుగుతుంది. ఊరిలోని భూములన్నీ తాము హస్తగతం చేసుకోవాలని అనుకున్న బోసుబాబు, వీరేంద్రలకు చెక్ పెడుతూ ఎమ్ఆర్ఓగా జగదీష్‌నాయుడు వచ్చే ట్విస్ట్ బాగుంది. పతాక ఘట్టాలకు ముందు వచ్చే సన్నివేశాలను ఎమోషనల్‌గా తీర్చిదిద్దారు.
నాని టక్ ఎందుకు వేసుకుంటాడంటే..!
పాత్ర ఏదైనా దానికి తగినట్లుగా తనను తాను మలుచుకుంటుంటారు నాని. ఈ సినిమాలో కుటుంబాన్ని అమితంగా ప్రేమించే తనయుడిగా సహజ నటనతో మెప్పించాడు. టక్‌తో సినిమా ఆద్యంతం ైస్టెలిష్‌గా కనిపించారు. తాను టక్ వేసుకొని కనిపించడానికి కారణాన్ని దర్శకుడు ఇందులో అర్థవంతంగా చూపించారు. ఎమోషనల్ సన్నివేశాలతో పాటు యాక్షన్ సీన్స్‌లో నాని మెప్పించారు. బోసుబాబుగా భిన్న పార్శ్వాలతో కూడిన పాత్రలో జగపతిబాబు చక్కటి వేరియేషన్స్‌ను చూపించారు. మంచివాడిగా నటిస్తూ ఆస్తికోసం అందరిని మోసం చేసే వ్యక్తిగా విభిన్నంగా కనిపించారు. ఎక్కువగా పట్టణ నేపథ్య సినిమాల్లో నటించిన రీతూవర్మ ఈ సినిమాలో తొలిసారి గ్రామీణ యువతిగా నటించింది. జగదీష్‌కు అండగా నిలిచే ప్రేమికురాలిగా అందం, అభినయంతో మెప్పించింది. చంద్రమ్మగా కథకు కీలకమైన పాత్రలో ఐశ్వర్యరాజేష్ కనిపించింది. నాజర్, రోహిణి, దేవదర్శిని, డానియల్ బాలాజీ తమ అనుభవంతో పాత్రలను రక్తికట్టించారు.
అన్నదమ్ముల మధ్య ఆస్తితగాదాలు రావడం, హీరో కుటుంబాన్ని ఏకం చేయడం అనే పాయింట్‌తో తెలుగులో చాలా సినిమాలొచ్చాయి. అదే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. కథ, పాత్రల్లో ఎలాంటి కొత్తదనం కనిపించదు. కథాగమనం ఊహాతీతంగానే సాగుతుంది. ఎలాంటి మలుపులు లేవు. తన కుటుంబాన్ని నాశనం చేయడానికి విలన్ వేసే ఎత్తులను హీరో తిప్పికొట్టే సన్నివేశాల్లో బలం లేదు. క్లైమాక్స్‌లో ఆసక్తి లోపించింది.
గ్రామీణ ప్రాంతాల్లోని సంప్రదాయాల మేళవింపుతో..
ప్రేమకథా చిత్రాలు మాత్రమే కాదు కుటుంబ కథలకు న్యాయం చేయగలనని శివనిర్వాణ ఈ సినిమాతో నిరూపించారు. ఎమోషన్స్ పండించడమే తన బలం కావడంతోనే వాటిపైనే ఎక్కువగా దృష్టిపెట్టి కథను నడిపించారు. ఆయన రాసిన సంభాషణలు బాగున్నాయి. గరగ లాంటి గ్రామీణ ప్రాంతాల్లోని సంప్రదాయాల్ని చక్కగా సినిమాలో చూపించారు. తమన్ బాణీలు, గోపీసుందర్ నేపథ్య సంగీతం, ప్రసాద్ మూరేళ్ల ఛాయాగ్రహణం ఈ కుటుంబకథకు కొత్త శోభను తీసుకొచ్చాయి. థియేటర్‌ను దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించిన సినిమా కావడంతో నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఉమ్మడి కుటుంబ కథాంశాలతో తెలుగు తెరపై సినిమా వచ్చి చాలా కాలమైంది. కొత్త కాన్సెప్ట్‌లు, ప్రేమకథలకు అలవాటుపడిన ప్రేక్షకుల ఈ సినిమా నవ్యానుభూతిని పంచుతుంది. థియేటర్లో విడుదలైతే ఓపెనింగ్స్, బాక్సాఫీస్ రికార్డులు, కలెక్షన్స్ లాంటి క్యాలికులేషన్స్ ఉంటాయి. అదే ఓటీటీలో అయితే హిట్, ఫ్లాప్‌లతో సంబంధం ఉండదు. టక్ జగదీష్ రెండో కోవకు చెందుతుంది. కుటుంబమంతా కలిసి సరదాగా ఆస్వాదించే చిత్రమిది
రేటింగ్-2.75/5
Sarkaru Vaari Paata| సర్కారు వారి పాటలో మహేశ్ పం…
Mrunal Thakur | విరాట్ కోహ్లీతో పిచ్చిగా ప్రేమలో …
Tiger 3 | సల్మాన్, కత్రినా పాట చాలా కాస్లీ గురూ..బడ్జెట్ ఎంతంటే..?
Vijay Deverakonda | ముంబైతో పోలిస్తే నేను సోమరి హైదరాబాదీని