శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 24, 2020 , 20:06:09

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మహేష్ బాబు ప్రశంసలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మహేష్ బాబు ప్రశంసలు

గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపై తెలుగు చిత్ర పరిశ్రమ స్పందిస్తుంది. ఆయన్ని ప్రశంసలతో ముంచెత్తుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ కోసం కేసీఆర్ కురిపించిన వరాల జల్లు అభినందనీయం అంటూ ఇప్పటికే చాలా మంది ప్రముఖులు చెప్పారు. చిరంజీవి, రాజమౌళి లాంటి దిగ్గజాలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు మహేష్ బాబు కూడా ఇదే చేసాడు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టోలో టాలీవుడ్‌పై ఈయన ప్రేమ కురిపించాడు. అందులో భాగంగానే సినిమాలను..సినిమా కార్మికులను ఆదుకునేలా చాలా ప్రయోజనాలు ప్రవేశపెట్టారు.

10 కోట్ల లోపు బడ్జెట్ ఉన్న సినిమాలకి రాష్ట్ర జీఎస్టీ రీఎంబర్స్‌మెంట్‌, రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లకు విద్యుత్‌ కనీస డిమాండ్‌ చార్జీలు రద్దు చేస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో అంతా ఆనందంలో మునిగిపోయారు. అంతేకాదు రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్స్‌లో షోలను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చాడు ఈయన. మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీలో ఉన్న విధంగా టిక్కెట్ల ధరలను సవరించుకునే వెసులుబాటును కల్పించారు కేసీఆర్. పరిశ్రమలో ఉన్న దాదాపు 40 వేల కార్మికులకు రేషన్‌ కార్డ్‌, హెల్త్‌ కార్డుల సదుపాయం కల్పించి వారిని కూడా ఆదుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దాంతో సినిమా పరిశ్రమలోని పెద్దలంతా ఈయన తీసుకున్న నిర్ణయంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ప్రభుత్వ నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలు పరిశ్రమకు గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చాయని తెలిపాడు. సినిమా పరిశ్రమకు ఊరటనిచ్చేలా నిర్ణయాలు తీసుకున్నందుకు కృతఙ్ఞతలు తెలిపాడు మహేష్ బాబు. ఎంతో మంది కార్మికుల జీవితాలను కాపాడుకునే నిర్ణయాలు తీసుకున్నందుకు థ్యాంక్స్ చెప్పుకొచ్చాడు సూపర్ స్టార్. విపత్కర పరిస్థితుల్లో ముందుకెళ్లేలా సహాయం చేసినందుకు ధన్యవాదాలు తెలిపాడు ఈయన. ఇప్పటికే చిరు, నాగర్జున, వెంకటేష్ సహా అందరూ ప్రభుత్వ నిర్ణయాన్ని కొనియాడారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.