ఆదివారం 07 జూన్ 2020
Cinema - Mar 31, 2020 , 19:08:09

టాలీవుడ్ 2020: తొలి 3 నెలల పరిస్థితి ఇదీ

టాలీవుడ్ 2020: తొలి 3 నెలల పరిస్థితి ఇదీ

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా థియేటర్లన్నీ మూతపడ్డాయి. ఈ మహమ్మారి వ్యాప్తిని తగ్గించేందుకు జనం గుమిగూడకుండా ఉండేందుకు ప్రభుత్వాలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. అయితే 2020వ సంవత్సరంలో అప్పుడే మూడు నెలలు ముగిశాయి. ఈ మూడు నెలలలో టాలీవుడ్ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి పరిశీలిద్దాం. జనవరిలో రెండు బ్లాక్ బస్టర్స్‌తో కళకళలాడిన టాలీవుడ్, ఫిబ్రవరిలో ఒక్క సినిమాకే పరిమితమైంది. థియేటర్స్ బంద్ అయ్యే వరకు మార్చిలో ఏ సినిమా సరైన హిట్టును అందుకోలేకపోయింది. జనవరిలో అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ అన్ని విధాలుగా అందరినీ మెప్పించి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా నిలిచి 160 కోట్ల షేర్ రాబట్టింది. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్ అందుకుని, మహేష్ కెరియర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం 138 కోట్ల షేర్‌ని రాబట్టింది. ఇక జనవరిలో వచ్చిన ‘ఎంతమంచివాడవురా’, ‘డిస్కోరాజా’, ‘అశ్వద్ధామ’ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఫిబ్రవరి విషయానికి వస్తే ‘జాను’ చిత్రం మంచి టాక్‌తో మొదలైనప్పటికీ కలెక్షన్స్ సాధించడంలో ఆ ఊపు కొనసాగించలేకపోయింది.

ఈ నెలలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఎన్నో అంచనాలతో విడుదలైనప్పటికీ మొదటి ఆటకే ఆ సినిమా ఆశించినట్లుగా లేదని ప్రేక్షకులు ఆ సినిమాకి దూరం అయ్యారు. ఇక నితిన్ ‘భీష్మ’ చిత్రం ఫిబ్రవరిలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం మొదటి షో నుంచే మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఈ చిత్రం సాధించిన మొదటి రోజు, మొదటి వారం కలెక్షన్లు చూసిన వారంతా 40 కోట్ల షేర్‌ను ఈజీగా బీట్ చేసి 50 కోట్ల క్లబ్‌లో చేరుతుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా రెండో వారం నుంచి ఈ చిత్రానికి కలెక్షన్లు లేవు. ఫలితంగా ఈ చిత్రం 27 కోట్ల షేర్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక ఫిబ్రవరిలో మరో చిత్రం ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి.. సేఫ్ జోన్‌లోకి వెళ్లింది. విశ్వక్‌సేన్ హీరోగా నాని నిర్మించిన ‘హిట్’ చిత్రం 6 కోట్ల షేర్ రాబట్టి.. ఫిబ్రవరిని విజయవంతంగా ముగించింది. మార్చిలో పలాస 1978 చిత్రం కాస్త పరవాలేదు అనే టాక్‌ తెచ్చుకుంది కానీ కలెక్షన్లు రాబట్టుకోలేకపోయింది. టోటల్‌గా 2020 ఫస్ట్ మూడు నెలలు ముగిసే సరికి టాలీవుడ్‌లో పడిన సరైన సినిమాలు మూడంటే మూడే.


logo