ఉద్యోగం లేక బాధపడుతున్నారా..? ఎన్ని కంపెనీలు తిరిగినా ఉద్యోగం రావడంలేదా..? ఇక మీరు అధైర్యపడకండి.. నిరుత్సాహపడకండి.. మీకు మేం ఉన్నామంటూ హైదరాబాద్ పోలీసులు ముందుకు వచ్చారు… ఒక పక్క శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ చేపడుతూనే.. మరోపక్క నిరుద్యోగ యువతకు సహకారం అందించాలనే లక్ష్యంతో 2016లో ‘జాబ్ కనెక్ట్’ పేరుతో ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టారు.. ఇందుకు ప్రైవేటు సంస్థలకు ఒక వేదికను ఏర్పాటు చేసి.. ప్రతి నెలా జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తున్నారు.. ఇందులో పాల్గొనే నిరుద్యోగులకు పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.. 80 శాతం వరకు ఎంపికైన వాళ్లకు అక్కడికక్కడే నియామక పత్రాలు ఇస్తుండగా.. సాంకేతికపరమైన పరీక్షలు అవసరమైనవారికి మరుసటి రోజు ఆయా సంస్థల్లో నిర్వహించి అందులో ఎంపికైన వారికి ఉద్యోగాలిస్తున్నారు. ఇలా.. ఇప్పటి వరకు 11వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు.. కాగా.. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో హైదరాబాద్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో మహిళలకు ప్రత్యేకంగా జాబ్‌మేళాను నిర్వహించగా.. అందులో ఆరువేల మంది పాల్గొనగా.. గత శనివారం మలక్‌పేటలో నిర్వహించిన జాబ్‌మేళాకు 547 మంది యువత హాజరయ్యారు.. అలాగే.. ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షల్లో పాల్గొనే విధంగా నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కూడా ఇప్పిస్తున్నారు.
ఉద్యోగాలు లేకపోవడంతో నిరుద్యోగులు ఖాళీగా ఉండే పరిస్థితి ఉంది.. అలాంటి వారికి ఫలానా చోట ఉద్యోగం ఉంది.. అని చెప్పే వేదిక ఒకటి ఉండాలని హైదరాబాద్ పోలీసులు ‘జాబ్ కనెక్ట్’ను ఏర్పాటు చేశారు. దీని కోసం ప్రత్యేకంగా ఒక బస్సును ఏర్పాటు చేశారు. ఇందులో సిబ్బంది తిరుగుతూ నిరుద్యోగుల పేర్లను నమోదు చేస్తుంటారు. నగరంలో ఉన్న ఐదు జోన్లలో నెలకు ఒక జోన్లో ‘జాబ్ మేళా’ జరుగుతుంది. ఇందుకు క్షేత్ర స్థాయిలోని పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ సిబ్బంది స్థానిక యువతను అప్రమత్తం చేస్తుంటారు. మన వద్దకు జాబ్ కనెక్ట్ బస్సు వచ్చింది.. ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు మీ పేర్లను నమోదు చేసుకోవాలంటూ సూచిస్తుంటారు. చుదువు నిమిత్తం లేకుండా ఆయా ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు తమ పేర్లను నమోదు చేసుకుంటారు. పేర్లను నమోదు చేసుకున్న వారి ఫోన్ నంబర్‌కు ఫలానా రోజు జాబ్ మేళా ఉందంటూ సమాచారాన్ని ఇస్తారు.
ఒక ఏజెన్సీ సహకారంతో ప్రైవేట్ సంస్థలను జాబ్‌మేళాకు పిలుస్తారు. ప్రతి నెలా జాబ్ మేళాకు ప్రైవేట్ సంస్థలను పిలిపించడం.. అదేవిధంగా జాబ్ కనెక్ట్ బస్సులో పేర్లను నమోదు చేసుకున్న వారిని అక్కడకు రప్పించి.. ఇద్దరిని కలిపిస్తారు. ఆయా కంపెనీలు విద్యార్హతలను బట్టి అర్హత పరీక్షలు, ఇంటర్వ్యూలు అక్కడే నిర్వహిస్తారు. దీంతో నైపుణ్యం ఉన్న వారికి ఉద్యోగం దొరికిపోతుంది. కాగ్నిజెంట్, యాక్సెంచర్, యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, బిర్లా సన్‌లైఫ్, అపోలో ఫార్మసీ, బిగ్‌బాస్కెట్, 24*7, రత్నదీప్ సూపర్ మార్కెట్, అనూస్ బ్యూటీ పార్లర్, కార్వీ, విజయ డయోగ్నస్టిక్స్, యూటుమి మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ, ఏషియన్ థియేటర్స్, టీంలీజ్, కిమ్స్ ఆస్పత్రి, హరిహర సొల్యూషన్స్, రామ్ హోండా, ఐసీసీఎస్, ఐకేఎస్ హెల్త్, బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్, నవత ట్రాన్స్పోర్ట్, ఐటీం ఐఎన్‌సీ తదితర కంపెనీలు ఈ జాబ్ మేళాల్లో పాల్గొంటాయి. అక్కడ తమకు కావల్సిన అర్హతలున్న వారిని ఉద్యోగాలకు ఎప్పిక చేసుకుంటాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పోలీసుల వ్యవస్థలో ప్రభుత్వ ం సమూల మార్పులు తెచ్చింది. ప్రజలు కడుతున్న పన్నులతోనే జీతాలు వస్తున్నాయని, నిరంతరం వారికి పారదర్శక సేవలు అందించడంలో ముందుండాలనే గొప్ప లక్ష్యంతో పోలీసులు పనిచేస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు దగ్గరై.. టెక్నాలజీ సంస్కరణలు, పీడీయాక్టులతో నేరాలు పూర్తిస్థాయిలో కట్టడి చేస్తూ హైదరాబాద్ పోలీసులు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. నేరాలు ఎందుకు జరుగుతున్నాయి, నేరాలను అణిచివేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై సూక్ష్మంగా ఆలోచనలు చేసిన పోలీసు ఉన్నతాధికారులు, తెలంగాణ ఏర్పాటైన తరువాత ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ముందుంటున్నారు. ఇందులో భాగంగా నిరుద్యోగ యువత కోసం జాబ్‌మేళాలు ఏర్పాటు చేస్తున్నారు.
ఉద్యోగ మేళాకు హాజరయ్యే ప్రైవేట్ కంపెనీలు అక్కడే నిరుద్యోగులకు పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి.. అక్కడికక్కడే నియామకపు పత్రాలు అందజేస్తారు. మరికొన్ని కంపెనీలు మరుసటి రోజు తమ కంపెనీల్లో మళ్లీ పరీక్ష నిర్వహించి ఎంపిక చేసుకుంటాయి.
జాబ్ కనెక్ట్‌తో నిరుద్యోగ యువతకు హైదరాబాద్ పోలీసులు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. సామాజిక బాధ్యతగా జాబ్ కనెక్ట్ ప్రోగ్రామ్‌ను నిరంతరం కొనసాగిస్తున్నాం. గత ఏడాది కరోనా కారణంగా తక్కువగా మేళాలు నిర్వహించాం. ఈ ఏడాది మహిళల కోసం ప్రత్యేకంగా షీ టీమ్స్‌తో కలిసి జాబ్ మేళాను నిర్వహించాం. నిరుద్యోగ యువత, మీరు నివాసముండే ప్రాంతానికి జాబ్ కనెక్ట్ బస్సు వచ్చినప్పుడు మీ వివరాలను అందించండి. మీ కోసం ఏర్పాటు చేస్తున్న జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోండి. – అంజనీకుమార్, నగర సీపీ