‘దొరసాని’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ చిత్రాల్లో సహజ అభినయంతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు యువ హీరో ఆనంద్ దేవరకొండ. సోమవార తన పుట్టినరోజు సందర్భంగా మూడు కొత్త చిత్రాల్ని ప్రకటించారాయన. ఆనంద్ దేవరకొండ హీరోగా మధురా ఎంటర్టైన్మెంట్స్, రోల్ కెమెరా విజువల్స్ పతాకాలపై మధుర శ్రీధర్‌రెడ్డి, బలరాం వర్మ నంబూరి, బాల సోమినేని నిర్మాతలుగా ఓ చిత్రం తెరకెక్కనున్నది. ఈ సినిమాకు సంబంధించి న వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారు. అలాగే హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్‌లో ఆనంద్ ఓ సినిమా చేయబోతున్నారు. ఉదయ్‌శెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్ సంయుక్తంగా నిర్మించనున్న మరో చిత్రంలో ఆనంద్ దేవరకొండ హీరోగా కనిపించబోతున్నారు.
ఆనంద్ దేవరకొండ తాజా చిత్రం ‘పుష్పక విమానం’లోని ‘సిలకా ఎగిరిపోయావా ఆశలన్ని ఇడిసేసి ఎనకా’ అనే లిరికల్ వీడియోను విజయ్ దేవరకొండ సోమవారం విడుదలచేశారు. ‘మధ్యతరగతి నేపథ్యంలో నడిచే వినోదభరిత చిత్రమిది. త్వరలో విడుదలచేస్తాం’ అని నిర్మాతలు తెలిపారు. దామోదర దర్శకత్వం వహించారు.