ఆదివారం 07 మార్చి 2021
Cinema - Dec 31, 2020 , 17:04:13

రజనీకాంత్ రాజకీయాలపై మోహన్ బాబు స్పందన ఇదే..!

రజనీకాంత్ రాజకీయాలపై మోహన్ బాబు స్పందన ఇదే..!

రజనీకాంత్ అనారోగ్యం కారణంగా రాజకీయాలకు పూర్తిగా దూరం అయిపోయాడు. ఆయన పాలిటిక్స్ నుంచి శాశ్వతంగా సెలవు తీసుకోవడంతో అభిమానులతో పాటు అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. నిన్నటి వరకు ఒక పార్టీ పెడతాడు.. ఆయన రాజకీయాల్లోకి వచ్చి ప్రజలు కోరుకున్న మార్పు తీసుకొస్తాడు అని చాలామంది ఆశించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకున్నాడు రజినీకాంత్.

దీనిపై ఆయన ప్రాణ స్నేహితుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు స్పందించాడు. ప్రత్యేకంగా ఒక లేఖను విడుదల చేశాడు. మోహన్ బాబు విడుదల చేసిన లేఖలో ఇలా చెప్పుకొచ్చారు. రజినీకాంత్ నాకు అత్యంత ఆత్మీయుడు అన్న సంగతి మీ అందరికీ తెలుసు. తన ఆరోగ్య రీత్యా పాలిటిక్స్ లోకి రావడం లేదు అని ప్రకటించాడు. ఒకరకంగా తను రాజకీయాల్లోకి రాకపోవడం మీకు, అభిమానులందరికీ బాధ అయినప్పటికీ ఒక స్నేహితుడిగా తన ఆరోగ్యం గురించి పూర్తి అవగాహన ఉన్న ఒక వ్యక్తిగా రజినీ రాజకీయాల్లోకి రాకపోవడం మంచిది అని నమ్ముతున్నాను.

నా మిత్రునితో ఎన్నో సందర్భాల్లో చెప్పాను. నువ్వు మంచివాడివి. చీమకు కూడా హాని చేయని వాడివి. నా దృష్టిలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్సన్.. నీ లాంటి వ్యక్తికి, నాలాంటి వ్యక్తికి రాజకీయాలు పనికిరావు. ఎందుకంటే మనం ఉన్నది ఉన్నట్టు నిక్కచ్చిగా మాట్లాడతాం. ఎవరికి ద్రోహం చేయం. డబ్బులు ఇచ్చి ఓట్లు, సీట్లు కొనలేం. కొనము కూడా. ఇక్కడ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు.

రాజకీయాల్లోకి రానంత వరకు మంచి వాడివి అన్న వాళ్లే.. రేపు వచ్చిన తర్వాత చెడ్డవాడని అంటారు. రాజకీయం ఒక రొచ్చు. ఒక బురద. ఆ బురద అంటకుండా నువ్వు రాక పోవడమే మంచిదయ్యింది. రజనీకాంత్ అభిమానులు అందరూ రజనీకాంత్ అంత మంచి వాళ్లు. మీరందరూ సహృదయంతో నా మిత్రుడు తీసుకున్న నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీ మోహన్ బాబు..అంటూ లేఖలో రాసుకొచ్చాడు కలెక్షన్ కింగ్.


 


VIDEOS

logo