గ్యాప్ తర్వాత వస్తున్నారు

ఓ సినిమాకు క్రేజ్‌ను తీసుకురావడంలో కాంబినేషన్స్ కీలక భూమిక పోషిస్తాయి. వ్యాపారపరమైన సమీకరణాల్ని కూడా నిర్ధేశిస్తాయి. అందుకే కొన్ని విజయవంతమైన కలయికల కోసం ప్రేక్షకులు ఉత్సుకతతో ఎదురుచూస్తుంటారు. అందులో హీరోదర్శక ద్వయం కాంబినేషన్ అగ్రస్థానంలో నిలుస్తుంది. ఈ కోవలో సుదీర్ఘ విరామం తర్వాత కొందరు దర్శకహీరోలు తిరిగి భారీ ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు.
‘ఆర్ఆర్ఆర్'తో అపూర్వకలయిక
తెలుగు చిత్రసీమలో ఎన్టీఆర్-దర్శకుడు రాజమౌళిలది విజయవంతమైన కాంబినేషన్‌గా అభివర్ణించవచ్చు. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘స్టూడెంట్ నంబర్ వన్', ‘సింహాద్రి’, ‘యమదొంగ’ చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసాయి. 2001 నుంచి 2007 మధ్య ఆరేళ్ల వ్యవధిలో ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్లో మూడు సినిమాలొచ్చాయి. వీరిద్దరు నాలుగో సినిమా కోసం కలవడానికి పదమూడేళ్లు సమయం పట్టింది. సుదీర్ఘ విరామం అనంతరం ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్' సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. ఇదే ‘ఆర్ఆర్ఆర్' సినిమాతో రామ్‌చరణ్-రాజమౌళి కాంబినేషన్ పదకొండేళ్ల తర్వాత వెండితెరపై పునరావిష్కృతం కాబోతుండటం గమనార్హం. గతంలో రామ్‌చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘మగధీర’ చిత్రం కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నది. రామ్‌చరణ్ కెరీర్‌ను మలుపుతిప్పింది. ఈ ఘన విజయం తర్వాత రామ్‌చరణ్-రాజమౌళి కాంబినేషన్లో మళ్లీ సినిమా రాబోతున్నట్లు వార్తలొచ్చినా అవి కార్యరూపం దాల్చడానికి పదకొండేళ్లు పట్టింది. చారిత్రక, కాల్పనిక అంశాల కలబోతగా రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్'లో తొలితరం స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీం పాత్రల్లో రామ్‌చరణ్, ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.
దశాబ్దం విరామం అనంతరం ‘పుష్ప’
‘ఆర్య’తో విలక్షణ చిత్రాల దర్శకుడు సుకుమార్ సినీరంగ ప్రవేశం చేశారు. వినూత్న ప్రేమకథతో ఈ సినిమాను తెరకెక్కించి దర్శకుడిగా తొలి అడుగులోనే అద్వితీయ విజయాన్ని దక్కించుకున్నారు. హీరోగా ఈ సినిమా అల్లు అర్జున్‌కు పేరుప్రఖ్యాతులతో పాటు స్టార్ ఇమేజ్ను తీసుకొచ్చింది. అనంతరం 2009లో వీరిద్దరి కలయికలో ‘ఆర్య-2’ చిత్రం రూపొందింది. ‘ఆర్య’ సిరీస్ తర్వాత అల్లు అర్జున్-సుకుమార్ పదకొండేళ్ల తర్వాత మళ్లీ కలిసి సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి కలయికలో ‘పుష్ప’చిత్రం రూపొందుతోంది . ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో 1970 బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతున్నది. ఇందులో దొంగగా వైవిధ్యమైన పాత్రలో అల్లు అర్జున్ కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఏపీలోని మారేడుమిల్లి ప్రాంతంలో జరుగుతోంది.
ఆరేళ్ల తర్వాత బాలీవుడ్ సినిమాతో..
‘అల్లుడు శీను’ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్‌ను తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు దర్శకుడు వి.వి.వినాయక్. 2014లో విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించింది. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్, దర్శకుడు వినాయక్ కలయికలో ఓ బాలీవుడ్ సినిమా రూపుదిద్దుకోనున్నది. ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ‘ఛత్రపతి’ హిందీలో రీమేక్ కానున్నది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ రీమేక్‌కు వినాయక్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి పూర్వ నిర్మాణ పనులు జరుగబోతున్నాయి.
పదమూడేళ్ల తర్వాత ‘ఢీ’ సీక్వెల్‌తో..
మంచు విష్ణు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 2007లో రూపొందిన ‘ఢీ’ చిత్రం చక్కటి నవ్వులను పంచింది. విష్ణు కెరీర్లో మంచి సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఈ చిత్రానికి దాదాపు పదమూడేళ్ల తర్వాత సీక్వెల్ రాబోతున్నది. ‘ఢీ&ఢీ’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన ఇటీవలే వెలువడింది. తొలి భాగానికి మించిన కామెడీతో ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఆరేళ్ల తర్వాత విక్రమ్ కుమార్‌తో
నాగచైతన్య కెరీర్లో ‘మనం’ సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అక్కినేని మూడు తరాల హీరోల కలయికలో రూపొందిన ఈ చిత్రానికి విక్రమ్.కె.కుమార్ దర్శకత్వం వహించారు. కుటుంబ విలువల కలబోతగా రూపొందిన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది. ‘మనం’ తర్వాత ఆరేళ్ల విరామం అనంతరం నాగచైతన్య, విక్రమ్.కె.కుమార్ కలయికలో ప్రస్తుతం ‘థాంక్యూ’ సినిమా రాబోతున్నది. వినూత్న ప్రేమకథతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించనున్నారు.
పదకొండేళ్ల అనంతరం
దాదాపు పదకొండేళ్ల విరామం తర్వాత దర్శకుడు రమేష్‌వర్మతో ‘ఖిలాడీ’ సినిమా చేస్తున్నారు హీరో రవితేజ. వీరిద్దరి కలయికలో ఇంతకుముందు 2011లో ‘వీర’ సినిమా రూపొందింది. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ‘ఖిలాడీ’తో రవితేజ-రమేష్‌వర్మ కలయిక కుదిరింది. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేయబోతున్నారు.
తాజావార్తలు
- కపోతం చిహ్నంతో లేడీ గగా శాంతి సందేశం
- పది లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు: కేంద్రం
- చారిత్రక ప్రాంతాల అభివృద్ధికి నిధులు విడుదల
- ఎస్ఎస్వై అడిషనల్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ అరెస్ట్
- టేకు విత్తనాలు చల్లుతున్నపద్మశ్రీ అవార్డు గ్రహీత...!
- మహారాష్ట్రలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు
- నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తుల పట్టివేత
- సినిమా టికెట్ ధరల పరిస్థితి ఏంటి..తగ్గిస్తారా, కొనసాగిస్తారా..?
- కేంద్ర ప్రతిపాదనపై రైతుల విముఖత
- సూర్య సినిమాకు అవమానం జరిగిందా..!