శనివారం 23 జనవరి 2021
Cinema - Dec 04, 2020 , 21:16:58

థియేటర్లు తెరిచారు.. తొలిరోజు పరిస్థితి ఎలా ఉంది..?

థియేటర్లు తెరిచారు.. తొలిరోజు పరిస్థితి ఎలా ఉంది..?

హైదరాబాద్ : 8 నెలలుగా వేచి చూస్తున్న రోజు రానే వచ్చేసింది. తెలంగాణలో కూడా థియేటర్లు తెరిచారు. ముఖ్యంగా హైదరాబాద్ లో అన్ని చోట్ల మల్టీప్లెక్స్ లు ఓపెన్ చేశారు. 8 నెలల గ్యాప్ తర్వాత ప్రసాద్ ఐమాక్స్ ఓపెన్ చేయడంతో సెలబ్రిటీలు కూడా వెళ్లి ప్రమోషన్ మొదలు పెట్టారు. ఇక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు మళ్ళీ మనం థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సినిమాలు ఇకపై థియేటర్లోనే చూద్దాం అంటూ ప్రమోషన్ చేస్తున్నారు. అయితే థియేటర్లు ఓపెన్ చేసినా కూడా అక్కడ ప్రదర్శించడానికి కొత్త సినిమాలు లేవు. దాంతో మళ్ళీ పాత సినిమాలు వాటిలో వేసుకుంటున్నారు ఎగ్జిబిటర్లు. AMB సినిమాస్, ప్రసాద్ ఐమాక్స్ లో హాలీవుడ్ సినిమా టెనెట్ షోలు అధికంగా వేశారు. తెలుగు సినిమాలు లేకపోవడంతో ప్రేక్షకులు థియేటర్ల వైపు పెద్దగా ఆసక్తి చూపించలేదు. 

ఎంత మంది వచ్చి థియేటర్లకు రండి అని ప్రమోషన్ చేసినా కూడా ఇప్పటికీ ఆ కరోనా ఎఫెక్ట్ అలాగే కనిపిస్తుంది. అందుకే చాలా చోట్ల స్క్రీన్స్ ఓపెన్ చేసిన విషయం కూడా జనాలకు తెలియకుండా పోయింది. ఉన్న థియేటర్లలో ప్రభుత్వం నిబంధనల ప్రకారం 50 శాతం టికెట్లు మాత్రమే అమ్మాల్సి ఉంటుంది. మళ్లీ అందులో కనీసం 50 శాతం టికెట్లు కూడా అమ్ముడు కాలేదు. అంటే 100 మంది కూర్చునే థియేటర్లో కనీసం 20 మంది కూడా లేరన్న మాట. ప్రస్తుతం అన్ని థియేటర్లలో పరిస్థితులు అలాగే ఉన్నాయి. వాటిని మెరుగు పరచడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులను థియేటర్ల వైపు తీసుకు రావడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. 

ఏదైనా పెద్ద సినిమా విడుదల అయితే తప్ప ఇప్పటికిప్పుడు థియేటర్ల వైపు కనిపించడం లేదు. డిసెంబర్ 25న సోలో బ్రతుకే సో బెటరూ సినిమా విడుదల కానుంది. కనీసం ఆ సినిమా వచ్చిన తర్వాత అయినా పరిస్థితులు మళ్లీ మామూలు స్థితికి వస్తాయని వాళ్ళ నమ్ముతున్నారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం అప్పటికి కూడా సర్దుకునేలా కనిపించడం లేదు. ఏదేమైనా కూడా థియేటర్లు తెరుచుకున్నాయి అనే ఆనందం తప్ప మళ్లీ మామూలు పరిస్థితులు కనిపిస్తాయి అన్న ఆశ మాత్రం కనిపించడం లేదు. ఎటు చూసుకున్న తెలంగాణలో తొలిరోజు థియేటర్ల పరిస్థితి అంత ఆశాజనకంగా మాత్రం లేదు. మరి రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo