శనివారం 06 జూన్ 2020
Cinema - May 08, 2020 , 22:48:34

క్లాస్‌ పాటనుమాస్‌గా మార్చారు

క్లాస్‌ పాటనుమాస్‌గా మార్చారు

‘జగదేకవీరుడు అతిలోకసుందరి’  వెండితెరపై అద్భుతాల్ని సృష్టించి మూడు దశాబ్దాలు అవుతోంది. చిరంజీవి, శ్రీదేవి జంటగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1990 మే 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా విడుదలై ముప్పై ఏళ్లు అవుతోన్న సందర్భంగా వింటేజ్‌ వైజయంతీ పేరుతో సినిమా నిర్మాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాల్ని చిత్రబృందం  అభిమానులతో పంచుకుంది. సినిమాలోని ప్రతి పాట వెనుకా ఒక ఇంట్రెస్టింగ్‌ స్టోరీ  ఉంది. ఆ కథల్ని వివరిస్తూ హీరో నాని వాయిస్‌ ఓవర్‌తో శుక్రవారం ఓ వీడియోను విడుదల చేశారు. ‘ఈ సెల్యులాయిడ్‌ వండర్‌ వెనుక ఎంతో మంది ఛాంపియన్స్‌ ఉన్నారు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌ను మ్యాజికల్‌గా చూపించిన డీఓపీ విన్సెంట్‌, అందమైన సెట్స్‌తో మైమరపించేసిన ఆర్డ్‌ డైరెక్టర్‌ చలం, ఎడిటింగ్‌ స్కిల్‌తో సినిమాకు సూపర్‌ టెంపోనిచ్చిన  చంటి, పాటలు, మాటలతో మెస్మరైజ్‌ చేసిన వేటూరి, జంధ్యాల. వీళ్లందరి కష్టానికి  ప్రాణం పోశారు ఒకే ఒక్క లెజెండ్‌ ఇళయరాజా.  ఒక పాట ట్యూన్‌ ఇళయరాజా కంపోజ్‌ చేశారు.  కానీ పాట విని ‘అన్నీ మెలోడీ క్లాస్‌ సాంగ్స్‌ అయిపోతున్నాయి. చిరంజీవి, శ్రీదేవి అంటే మాస్‌ సాంగ్స్‌ ప్రేక్షకులు ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు కదా? అని గట్టిగానే అభ్యంతరాలు వచ్చాయి.దాంతో రాఘవేంద్రరావు ఆలోచనలో పడ్డారు. కానీ అశ్వినీదత్‌కు ఇళయరాజా ట్యూన్‌ మార్చడం ఇష్టం లేదు. అప్పుడు వేటూరి ‘ఇదే ట్యూన్‌ని మాస్‌ సాంగ్‌ చేస్తాను చూడండి’ అన్నారు. అలా ‘అబ్బనీ తీయనీ దెబ్బ’ పాట రాశారు.  క్లాస్‌ ట్యూన్‌ని తెలుగు సినిమా చరిత్రలో బిగ్గెస్ట్‌ మాస్‌ ట్యూన్‌గా తయారు చేశారు ఇళయారాజా, వేటూరి. ఈ పాటని డైరెక్టర్‌ రాఘవేంద్రరావు మైసూర్‌, బెంగళూర్‌లలో రెండో రోజుల్లో పూర్తిచేశారు.  ‘ధినక్‌ తా ధినక్‌ రో’ పాటకు వాహినీ స్టూడియోలో భారీ సెట్‌ వేశారు. షూటింగ్‌ అయిపోగానే శ్రీదేవి హిందీ సినిమా షూటింగ్‌కు విదేశాలకు వెళ్లాలి. సరిగ్గా అదే టైమ్‌కు చిరంజీవికి 104 డిగ్రీల హైఫీవర్‌. ఒళ్లు కాలిపోతుంది. ఓ పక్కన విడుదల తేదీ మే 9. ఒక్క రోజు తేడా వచ్చినా మొత్తం పరిస్థితి మారిపోతుంది. చిరంజీవి జ్వరంతోనే షూటింగ్‌కు రెడీ అయ్యారు. సెట్‌లోకి డాక్టర్‌ను తీసుకొచ్చారు. చిరంజీవి శ్రీదేవితో డ్యాన్స్‌లో స్క్రీన్‌పైనా చిన్న తేడా కనిపించదు. అనుకున్న డేట్‌కు సినిమాను విడుదల చేయగలిగామంటే చిరంజీవి అంకితభావమే ముఖ్యకారణమని అశ్వినీదత్‌ మనసారా తలచుకుంటుంటారు’ అంటూ  ఈ సినిమా పాటల వెనకున్న చరిత్రను నాని వివరించారు. 


logo