శనివారం 28 నవంబర్ 2020
Cinema - Oct 25, 2020 , 02:14:53

గతంలోకి కథల ప్రయాణం

గతంలోకి  కథల  ప్రయాణం

గతంలోకి  కథల  ప్రయాణం

చరిత్ర అన్వేషణకు అందదు. ఎంత తరచిచూసినా తెలుసుకోవాల్సిన సంగతులు మిగిలే ఉంటాయి. అందుకే వెండితెరపై చారిత్రక, గతం తాలూకు ఇతివృత్తాలు ఎప్పుడూ ఆసక్తినిరేకెత్తిస్తుంటాయి. ప్రస్తుతం తెలుగు సినిమాలో ఈ తరహా సినిమాల నిర్మాణం ఊపందుకుంది. ప్రేక్షకుల్ని గతకాలంలోకి తీసుకెళ్లి సరికొత్త అనుభూతిని అందించడానికి దర్శకులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో చారిత్రక ఇతివృత్తాలతో పాటు 80, 90 దశకాల నాటి కథలు వెండితెరపై దృశ్యమానమవుతున్నాయి.

n ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌' (రౌద్రం రణం రుధిరం). రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగునేలపై తొలితరం స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీం చారిత్రక ఇతివృత్తానికి కాల్పనిక అంశాల్ని జోడించి ఈ సినిమాను రూపొందిస్తున్నారు.  ఈ సినిమా కోసం దర్శకుడు రాజమౌళి 19వ శతాబ్ది తొలినాటి కాలాన్ని పునఃసృష్టిస్తున్నారు.  భిన్న కాలాల్లో జీవించిన ఇద్దరు యోధుల మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఒక ఉమ్మడి లక్ష్యం కోసం వారిద్దరి కలిసి సాగించిన పోరాటమేమిటన్నదే చిత్ర ఇతివృత్తమని సమాచారం. కథానుగుణంగా ఈ సినిమా 1920 దశకంలో ఆరంభమవుతుందని తెలిసింది. బ్రిటీష్‌, నైజాం ఏలుబడిలోని నాటి ఆంధ్ర, తెలంగాణ కాలమాన పరిస్థితుల్ని  ఆవిష్కరిస్తూ సహజత్వానికి పెద్దపీట వేస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఆనాడు ఉపయోగించిన సంప్రదాయ యుద్ధసామాగ్రి, ప్రజల వస్త్రధారణ, వేషభాషల్ని వాస్తవానికి దగ్గరగా చక్కటి ప్రామాణికతతో తెరకెక్కిస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదల చేసిన రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ తొలి పరిచయం తాలూకు టీజర్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాలో అలియాభట్‌, ఒలివియామోరిస్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. కొమురంభీం, అల్లూరిలకు మార్గదర్శిగా నిలిచే కీలక పాత్రలో బాలీవుడ్‌ నటుడు అజయ్‌దేవ్‌గణ్‌ కనిపించనున్నారు.  వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా ప్రేక్షకులముందుకురానుంది.

 

n 1980-90 దశకాల్లో తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది.  నాటి తెలంగాణ సామాజిక పరిస్థితులకు కాల్పనిక అంశాల్ని కలబోసి  ‘విరాటపర్వం’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సాయిపల్లవి, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. 1990 దశకంలో నాటి తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేసిన  మహిళా ఉద్యమకారుల స్ఫూర్తితో ఈ సినిమాలోని పాత్రల్ని తీర్చిదిద్దిన్నట్లు తెలిసింది.  ఈ సినిమాలో 1990 దశకం నాటి తెలంగాణ జనజీవితాన్ని వాస్తవ కోణంలో ఆవిష్కరించబోతున్నట్లు తెలిసింది. తెలంగాణలోని మారుమూల పల్లెల్లో  చిత్రీకరణ జరిపారు. ఈ సినిమాలో కామ్రేడ్‌ భారతక్క పాత్రలో సీనియర్‌ కథానాయిక ప్రియమణి కనిపించనుంది.  సాయిపల్లవి, నందితాదాస్‌, రానా, నవీన్‌చంద్ర, ప్రియమణి  కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. కరోనా కారణంగా   ఈ సినిమా చిత్రీకరణ వాయిదాపడింది. త్వరలో షూటింగ్‌ను పునఃప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. 


n నాని కథానాయకుడిగా ‘టాక్సీవాలా’ ఫేమ్‌ రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘శ్యామ్‌సింగరాయ్‌'. పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈచిత్రం 1990 దశకం నేపథ్య ఇతివృత్తంతోనే సాగుతుందని  సమాచారం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. రవితేజ కథానాయకుడిగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్నది. 1980-90ల కాలంలో జరిగిన యథార్థ సంఘటనల  స్ఫూర్తితో తెరకెక్కించనున్నట్లు తెలిసింది. అప్పటి కాలాన్ని ఆవిష్కరిస్తూ కథాగమనం సాగుతుందని సమాచారం. ‘దర్శకుడు’ ఫేమ్‌ హరిప్రసాద్‌ జక్కా నిర్ధేశకత్వంలో రూపొందుతున్న ‘ప్లేబ్యాక్‌' చిత్రం 1993 కాలం నాటి కథతో రూపొందుతోంది.  సూర్య కథానాయకుడిగా నటిస్తున్న ‘ఆకాశం నీ హద్దురా’ కథాగమనం   పూర్తిగా 2000 సంవత్సరం ఆరంభకాలంతో ముడిపడి సాగుతోంది. విమానయానాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడానికి 2000-01 సమయంలో ఎయిర్‌ దక్కన్‌ వ్యవస్థాపకుడు జీఆర్‌గోపీనాథ్‌ సాగించిన ప్రయాణం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 


n దివంగత సినీ నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘తలైవి’.  బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఎల్‌.విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జయలలిత సినీ ప్రయాణంతో పాటు రాజకీయ ప్రస్థానాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు.  ఆమె రాజకీయ జీవితంలో ఎదురైన సవాళ్లు, వివాదాల్ని కూడా చర్చించబోతున్నట్లు తెలిసింది. 1970-2000 మధ్యకాలంలో ఈ చిత్ర కథాగమనం సాగబోతున్నట్లు సమాచారం. ప్రేక్షకుల్ని ఆ కాలంలోకి తీసుకెళ్లడానికి సినిమాలోని కొన్ని సన్నివేశాల్ని బ్లాక్‌ అండ్‌ వైట్‌లో చూపించబోతున్నారు. 

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘పుష్ప’. మైత్రీమూవీమేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. చిత్తూరు జిల్లా నేపథ్యంలో ఎర్రచందనం అక్రమరవాణా కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 1970-80దశకం నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుందని సమాచారం. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని నాటి రాజకీయాలు, సామాజిక పరిస్థితుల్ని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పాత్ర మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఆయన ఫస్ట్‌లుక్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ప్రస్తుతం ఈ సినిమా తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లిలో చిత్రీకరణ జరుపుకుంటోంది.

1970ల నాటి యూరప్‌ వైభవాన్ని, చారిత్రక శోభను వెండితెర దృశ్యమానం చేస్తూ ‘రాధేశ్యామ్‌' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్‌, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 1970-80 మధ్యకాలంలో నడిచే ఈ పీరియాడికల్‌ లవ్‌స్టోరీలో  ఆనాటి యూరప్‌ సంస్కృతిని, కళల ఔన్నత్యాన్ని యథాతథంగా ఆవిష్కరించబోతున్నారని తెలిసింది.  ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాల్లో ప్రభాస్‌ రెట్రో శైలి వస్త్రధారణలో  సరికొత్తగా దర్శనమిచ్చారు.  ఆనాటి వింటేజ్‌ కార్లు, ట్రాములు, రాజప్రసాదాలు,  శిల్పకళా సంపదను ఈ సినిమాలో చూపించబోతున్నారు.  యాభై ఏళ్లనాటి యూరప్‌ను పునఃపరిచయం చేసేలా ఈ సినిమాకు రూపకల్పన చేస్తున్నారని చెబుతున్నారు.  చరిత్రలో ప్రసిద్ధి చెందిన ప్రేమికుల స్ఫూర్తితో ఈ సినిమా కథను సిద్ధం చేశారని సమాచారం. యూవీ క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకులముందుకురానుంది.