గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Oct 08, 2020 , 00:24:53

ఆ ఇమేజ్‌ మైనస్‌ కాదు: మారుతి

ఆ ఇమేజ్‌ మైనస్‌ కాదు: మారుతి

‘కథల్ని రాసుకోవడానికి లాక్‌డౌన్‌ విరామం చక్కగా ఉపయోగపడింది.   ఈ ఆరు నెలల కాలంలో నాలుగైదు కొత్త కథల్ని సిద్ధం చేసుకున్నా. వచ్చే పుట్టినరోజు లోపు రెండు సినిమాలు చేయాలనే  టార్గెట్‌ పెట్టుకున్నా’ అని అన్నారు దర్శకుడు మారుతి. తెలుగు చిత్రసీమలో వినోదాత్మక చిత్రాల దర్శకుడిగా చక్కటి గుర్తింపును సొంతం చేసుకున్నారాయన.  కుటుంబ విలువలకు సున్నితమైన హాస్యాన్ని జోడిస్తూ ప్రేక్షకుల్ని నవ్విస్తుంటారు మారుతి. కామెడీ పంథాకు తానేప్పుడూ దూరం కానని అంటున్నారాయన. నేడు మారుతి జన్మదినం. ఈ సందర్భంగా నమస్తే తెలంగాణతో మారుతి ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలివి...

కరోనా భయాలు వెంటాడుతున్నా ధైర్యంగా సినిమా చిత్రీకరణల్ని మొదలుపెడుతుండటం శుభపరిణామం. ఆరు నెలల విరామం తర్వాత సినీ పరిశ్రమలో మళ్లీ సందడి కనిపిస్తోంది. డిసెంబర్‌లో నా తదుపరి చిత్రం ప్రారంభకానున్నది.  యూవీ క్రియేషన్స్‌, గీతాఆర్ట్స్‌ సంస్థల భాగస్వామ్యంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాకు కథతో పాటు హీరో కుదిరాడు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాల్ని త్వరలో వెల్లడిస్తాను. మంచి సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. ఈ సినిమా ద్వారా కొత్త మారుతిని చూడబోతున్నారు. 

ఆ భయాలు లేవు

‘ప్రతిరోజు పండగే’ సక్సెస్‌ తర్వాత  తదుపరి సినిమా కోసం ఎక్కువ విరామం తీసుకోవద్దనుకున్నాను. కానీ కరోనా వల్ల గ్యాప్‌వచ్చింది. సక్సెస్‌ తర్వాత  ఎదురయ్యే భయాలు, ఒత్తిడులను నేనెప్పుడూ పట్టించుకోను.  చెప్పాలనుకున్న కథను ధైర్యంగా తెరపై ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తాను. ఏ భావోద్వేగాలకు సమాజం ఎక్కువగా కనెక్ట్‌ అవుతుందో పరిశీలిస్తాను. ఆ అంశాలను మనసులో  పెట్టుకొనే కథలు రాసుకుంటాను.  సమాజంలోని సమస్యలను కమర్షియల్‌ పంథాలో చెబితే ప్రేక్షకుల్ని మెప్పించగలమన్నది నా సిద్ధాంతం. ఆ పంథాలోనే సినిమాలు చేస్తుంటా. కథలురాసుకోవడం దర్శకత్వ పనులతో బిజీగా ఉండటంతో నిర్మాణ వ్యవహారాలపై సరిగా దృష్టిపెట్టలేకపోతున్నా. అందువల్లే నా నిర్మాణ సంస్థపై చేసిన గత చిత్రాలు కొన్ని ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి.  ఆ  ఆలోచనతో నిర్మాణ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నా. 

కామెడీకి దూరం కాను

కామెడీ చిత్రాల దర్శకుడు అనే ముద్ర నాపై పడటం సంతోషంగా ఉంది. దానిని నేనెప్పుడూ మైనస్‌గా భావించను.  సినీ పరిశ్రమలో ప్రత్యేకమైన ఇమేజ్‌ రావడం అడ్వాంటేజ్‌గానే భావిస్తాను. ఈ  ఇమేజ్‌ను నిలబెట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నా. నా శైలి కామెడీకి  దూరం కాకుండా విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నా.థియేటర్‌తో పోలిస్తే ఓటీటీలో సినిమా చూసిన అనుభూతి వేరుగా ఉంటుంది. ఓటీటీ ప్రభావం థియేటర్‌పై  పెద్దగా ఉండదు.  ఓటీటీలో కథ ఎంత థ్రిల్లింగ్‌గా చెప్పమనేదానిపై జయాపజయాలు అధారపడి ఉంటాయి. అందువల్లే ఓటీటీలో ఎక్కువగా థ్రిల్లర్‌ సినిమాలు సక్సెస్‌అవుతుంటాయి. ఫ్యామిలీ సినిమాలకు ఓటీటీలో ఆదరణ తక్కువే. . కొన్నాళ్ల తర్వాత ప్రత్యేకంగా ఓటీటీ కోసమే సినిమాలు చేసే విధానం పెరుగుతుంది.  యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్ల పునఃప్రారంభానికి అనుమతులు ఇవ్వడం మంచిదే. జనవరిలోగా వందశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను నడిపే రోజు వస్తుందనే నమ్మకముంది. ఆహాలో వెబ్‌సిరీస్‌ కోసం ఓ కథ రాశాను. భారీ బడ్జెట్‌తో ఈ సిరీస్‌ తెరకెక్కనుంది.


logo