బుధవారం 30 సెప్టెంబర్ 2020
Cinema - Sep 16, 2020 , 00:09:49

జోరు పెంచిన కథానాయకులు

జోరు పెంచిన కథానాయకులు

ప్రస్తుతం తెలుగు అగ్ర కథానాయకులు సినిమాల వేగాన్ని పెంచారు. కరోనా సంక్షోభం సృష్టించిన నిర్లిప్త భావన నుంచి తేరుకుంటూ వరుస సినిమాలు అంగీకరిస్తున్నారు. గతంలో అగ్రహీరోల సినిమాలంటే ఏడాదికోసారి వచ్చే పండగలా భావించేవారు అభిమానులు. ఒక్కసారి బొమ్మ పడిపోయిందంటే సదరు హీరో సినిమా మళ్లీ ఎప్పుడొస్తుందో తెలియని అనిశ్చితిలో కాలం గడిపేవారు. ఇప్పుడు హీరోల ప్రాధామ్యాలు మారిపోయాయి. కరోనా క్రైసిస్‌ నేర్పిన పాఠంతో సినిమాల విషయంలో జాగు చేయకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. భవిష్యత్తు అనుకున్న విధంగా సాఫీగా ఉంటుందనే భరోసా లేకపోవడంతో ఎక్కువ సినిమాలతో అభిమానుల్ని అలరించడం..బాక్సాఫీస్‌ బరిలో తమ సత్తాచాటాలనే ఉద్ధేశ్యంతో వరుస సినిమాలకు ఉపక్రమిస్తున్నారు.

‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంతో గత ఏడాది మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు నలభైశాతం చిత్రీకరణ పూర్తయింది. కరోనా ప్రభావంతో వాయిదా పడిన షూటింగ్‌ను త్వరలో రీస్టార్ట్‌ చేయబోతున్నారు. సాధారణంగా చిరంజీవి ఓ సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమాకు అంగీకరిస్తుంటారు. గత కొన్నేళ్లుగా ఇదే పద్దతి ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం అందుకు భిన్నంగా మూడు సినిమాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. మలయాళ హిట్‌ చిత్రం ‘లూసిఫర్‌' రీమేక్‌లో చిరంజీవి నటించబోతున్న విషయం తెలిసిందే. సుజిత్‌ దర్శకుడు.  ఈ సినిమాతో పాటు బాబీ, మోహర్మ్రేష్‌ దర్శకత్వంలో చిరంజీవి సినిమాల్ని అంగీకరించారు. తమిళ ‘వేదాళం’ రీమేక్‌కు మెహర్మ్రేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

‘బాహుబలి’ సిరీస్‌ సినిమాల కోసం నాలుగేళ్ల సమయాన్ని వెచ్చించారు ప్రభాస్‌. ఆ తర్వాత ‘సాహో’ చిత్రం కోసం మరో ఏడాది టైమ్‌ తీసుకున్నారు. ఐదేళ్ల కాలంలో ఆయన కేవలం మూడు సినిమాలు మాత్రమే చేయగలిగారు. ఈ విషయంలో ఆయన అభిమానులు కూడా కాస్త అసంతృప్తిని ప్రకటించేవారు. పాన్‌ఇండియా ఇమేజ్‌ను సొంతం చేసుకున్న తమ హీరో వరుస సినిమాలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయంతో ఉండేవారు. అందరూ ఆశిస్తున్నట్లుగానే ప్రస్తుతం ప్రభాస్‌ వరుస సినిమాల్ని అంగీకరించారు.  రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్న ‘రాధేశ్యామ్‌' యాభైశాతం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఈలోపే ప్రభాస్‌ నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో సైంటిఫిక్‌ ఫిక్షన్‌ చిత్రాన్ని అంగీకరించారు. ఈ సంవత్సరాంతంలో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుంది. రామాయణ ఇతిహాసం ఆధారంగా ఓం రౌత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌' చిత్రానికి ఇటీవలే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 500కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్థంలో పట్టాలెక్కనుంది.

పవన్‌కల్యాణ్‌ నటించిన ‘అజ్ఞాతవాసి’ విడుదలై రెండేళ్లు గడచిపోయాయి. ఈ సినిమా అనంతరం రాజకీయాల్లో బిజీ అయ్యారాయన. ప్రస్తుతం వరుసగా సినిమాలకు ఓకే చెబుతున్నారు. ఆయన తాజా చిత్రం ‘వకీల్‌సాబ్‌' దాదాపు చిత్రీకరణ పూర్తిచేసుకుంది.  ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు వేచి చూస్తున్నారు. క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న ‘శివమ్‌' (టైటిల్‌ ఇంకా ఖరారు కాలేదు) లాక్‌డౌన్‌కు ముందే పదిహేను రోజుల చిత్రీకరణ పూర్తిచేసుకుంది. త్వరలో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ పునఃప్రారంభం కానుంది. ఈ సినిమా అనంతరం హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించారు పవన్‌కల్యాణ్‌. గతంలో వీరిద్దరి కలయిలో వచ్చిన ‘గబ్బర్‌సింగ్‌' భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దాంతో తాజా సినిమా ప్రకటనతో అంచనాలు రెట్టింపయ్యాయి. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ నటించనున్న చిత్రాన్ని ఇటీవలే ప్రకటించారు.


గత ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు మహేష్‌బాబు. ప్రస్తుతం ఆయన పరశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటించనున్నారు. త్వరలో చిత్రీకరణ మొదలుకానుంది.  ఈ సినిమా అనంతరం రాజమౌళి దర్శకత్వంలో పాన్‌ఇండియా సినిమాకు సిద్ధమవుతున్నారు మహేష్‌బాబు. ఇక ఎన్టీఆర్‌ ప్రస్తుతం మల్టీస్టారర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొంతభాగం చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఓ సినిమా చేయబోతున్నారు. కన్నడ ‘కేజీఎఫ్‌' ఫేమ్‌ ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్‌ ఓ భారీ యాక్షన్‌ ఎంటర్‌టైన్‌ చేసే ఆలోచన ఉందని సమాచారం.

సినిమా ఎంపికలో సెలెక్టివ్‌గా ఉండే వెంకటేష్‌ ప్రస్తుతం వేగం పెంచారు. ‘వెంకీమామ’ చిత్రంతో గత ఏడాది ప్రేక్షకుల్ని పలకరించిన ఆయన ప్రస్తుతం తమిళ ‘అసురన్‌' చిత్ర రీమేక్‌ ‘నారప్ప’ చిత్రంలో నటిస్తున్నారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. సగభాగం చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమా అనంతరం ఆయన హారికహాసిని సంస్థలో తన 75వ చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ సినిమాకు త్రివిక్రమ్‌ లేదా వెంకీ కుడుముల దర్శకత్వ బాధ్యతలు తీసుకోవచ్చని వినిపిస్తోంది. ఇక రవితేజ ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్‌' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత రమేష్‌వర్మ, వక్కంతం వంశీ దర్శకత్వం వహించే సినిమాల్లో నటించబోతున్నారు. తమిళ ‘అయ్యప్పయున్‌ కోషియుమ్‌' రీమేక్‌లో  రవితేజ నటించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. యువ కథానాయకుడు నాగచైతన్య ప్రస్తుతం శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో ‘లవ్‌స్టోరీ’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ పునఃప్రారంభమైంది. ఈ సినిమా అనంతరం విక్రమ్‌కుమార్‌ దర్శకత్వంలో ‘థాంక్యూ’ సినిమాలో నటించబోతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌ అనంతరం నందినిరెడ్డి దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమాకు అంగీకరించారని తెలుస్తోంది. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సీక్వెల్‌ ‘బంగార్రాజు’ సీక్వెల్‌కు కూడా ఓకే చెప్పారు నాగచైతన్య.


logo