తెలుగు చిత్రసీమలో గత కొన్నేళ్లుగా పరభాషా నాయికల హవా నడుస్తోంది. తెలుగమ్మాయిలకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదనే చెప్పొచ్చు. పొరుగింటి పుల్లకూర రుచి అన్న చందంగా మన దర్శకనిర్మాతలు కూడా పరభాషా నాయికలవైపే మొగ్గుచూపే ధోరణి ఎక్కువగా కనిపించేది. అయితే ఇటీవల కాలంలో దక్షిణాదిన సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది. తెలుగు భామలు మాతృపరిశ్రమలో రాణించే ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు ఇతర భాషల్లో సత్తాచాటుతున్నారు. భాషాంతరాలు తొలగిపోయి పాన్ ఇండియన్ సినిమాల ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అచ్చ తెలుగు అందాలు పరభాషా సీమల్లో వెలుగులీనుతున్నాయి. ఇప్పుడు పదహారణాల తెలుగుదనాన్ని అన్వేషిస్తూ ఇతర భాషా దర్శకులు హైదరాబాద్ వైపు చూస్తున్నారు.
ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది అచ్చ తెలుగందం రీతూవర్మ. వరుస సక్సెస్‌ల తాలూకు విజయోత్సాహపు ఆనందాన్నిపరిపూర్ణంగా ఆస్వాదిస్తోందామె. ‘బాద్షా’ సినిమాతో 2013లో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన రీతూవర్మ ‘పెళ్లిచూపులు’ సినిమా ద్వారా విజయాల బాట పట్టింది. ప్రేమకథకు వినోదాన్ని మేళవిస్తూ తెరకెక్కిన ఈ చిత్ర అద్వితీయ విజయంతో తమిళ సినీ వర్గాల దృష్టిని ఆకర్షించింది రీతూవర్మ. గత ఏడాది విడుదలైన ‘కన్నుమ్ కన్నుమ్ కొైల్లెయాదితల్’ చిత్రంతో కథానాయికగా కోలీవుడ్‌లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో మోసాలు చేస్తూ డబ్బు సంపాదించే యువతిగా చక్కటి అభినయాన్ని కనబరిచింది. ఈ సినిమా తర్వాత తమిళంలో ఆమెకు సినిమా ఆఫర్స్ పెరిగాయి. విక్రమ్ హీరోగా గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ధృవనక్షత్రిరమ్’లో రీతూవర్మ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే అశోక్ సెల్వన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రంలో నాయికగా కనిపించబోతున్నది. శర్వానంద్ జోడీగా రీతూవర్మ నటిస్తున్న ‘ఒకే ఒక జీవితం’ చిత్రం తమిళంలో విడుదలకాబోతున్నది.
రాజశేఖర్, జీవిత తనయలు శివానీ, శివాత్మిక టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో హీరోయిన్లుగా నిలదొక్కుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ఏడాదే వీరిద్దరు తమిళంలో కథానాయికలుగా తొలి అడుగులు వేయబోతున్నారు. ‘దొరసాని’ చిత్రంలో సహజ నటనతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన శివాత్మిక ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తోంది. గౌతమ్ కార్తిక్ హీరోగా నటిస్తున్న ‘ఆనందం విలయాడుమ్ వీడు చిత్రంలో పల్లెటూరి యువతిగా ఆమె కనిపించబోతున్నది. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సినిమాతో పాటు అశోక్ సెల్వన్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రంలో నాయికగా కనిపించనున్నది. బాలీవుడ్ చిత్రం ‘ఆర్టికల్ 15’ను ఉదయనిధి స్టాలిన్ తమిళంలో రీమేక్ చేయబోతున్నారు. ఈ సినిమాలో శివానీ కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆమె హీరోయిన్గా నటించిన ‘అన్బరివ్’ అనే తమిళ చిత్రం విడుదలకు సిద్ధమైంది.
‘గద్దలకొండ గణేష్’ చిత్రంలో ‘జర జర’ అనే ప్రత్యేకగీతంలో అందచందాలతో ఆకట్టుకున్నది తెలుగమ్మాయి డింపుల్ హయతి. తెలుగు సినిమాలతో తన కెరీర్‌ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తమిళం, హిందీ భాషల్లో చక్కటి అవకాశాల్ని దక్కించుకుంటోంది. తమిళంలో శరవణన్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న సినిమాలో విశాల్‌కు జోడీగా నటిస్తోంది డింపుల్ హయతి. కార్తిక్ఆర్యన్ సినిమాతో హిందీ చిత్రసీమలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యింది.
‘అంతకుముందు ఆ తర్వాత’, ‘అమీతుమీ’, ‘అ!’ చిత్రాలతో మంచి నటిగా పేరుతెచ్చుకున్నది వరంగల్ సొగసరి ఈషారెబ్బా. తెలుగులో చక్కటి విజయాలు అందుకున్నా అవకాశాల రేసులో మాత్రం వెనుకబడిపోయిందామె. ప్రస్తుతం ఇతర భాషలపై దృష్టిసారిస్తున్న ఈషా ఈ ఏడాది ‘ఒట్టు’ అనే సినిమా ద్వారా ఒకేసారి తమిళం, మలయాళ భాషల్లో అరంగేట్రం చేయబోతున్నది. అరవింద్‌స్వామి, కుంచకో బోబన్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నటనకు ఆస్కారమున్న పాత్రలో ఈషారెబ్బా కనిపించబోతున్నట్లు తెలిసింది. అలాగే జీవి ప్రకాష్‌కుమార్ హీరోగా తమిళంలో రూపొందుతున్న హారర్ సినిమాలో ఈషా హీరోయిన్ నటిస్తోంది.
‘రమణ్ రాఘవ్ 2.0’ చిత్రంతో బాలీవుడ్లో తన సినీ ప్రయాణాన్ని ఆరంభించింది తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల. తొలి సినిమాతోనే కథానాయికగా వైవిధ్యతను చాటుకున్నది. తెలుగులో ‘గూఢచారి’ చిత్రంతో అరంగేట్రం చేసిన ఆమె ప్రస్తుతం బహుభాషా నాయికగా కొనసాగుతోంది. విలక్షణ చిత్రాల దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న తమిళ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’లో శోభిత కీలక పాత్రను పోషిస్తుంది. అలాగే దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న మలయాళ చిత్రం ‘కురుప్’లో ప్రతినాయిక ఛాయలున్న పాత్రను పోషిస్తుంది. మరోవైపు ‘మంకీమ్యాన్’ సినిమాతో హాలీవుడ్లో శోభిత ఎంట్రీ ఇవ్వబోతున్నది. వీటితో పాటు హిందీలో ఆమె నటించిన ‘సితార’ చిత్రం విడుదలకు సిద్ధమైంది.
రంగస్థలం, కల్కి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించిన వైజాగ్ సొగసరి పూజిత తమిళంలో ‘భగవాన్’ అనే సినిమాను అంగీకరించింది. ఈ సినిమాలో ఆర్కియాలజిస్టుగా విభిన్నమైన పాత్రలో ఆమె కనిపించబోతున్నది. ‘ఈరోజుల్లో’, ‘బస్‌స్టాప్’ సినిమాలతో సక్సెస్‌లను దక్కించుకున్న ఆనంది తెలుగులో కంటే తమిళంలోనే కథానాయికగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నది. ప్రస్తుతం తమిళంలో ఆమె నాలుగైదు సినిమాల్లో నటిస్తోంది.