మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 10, 2020 , 00:10:54

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య

  • టిక్‌టాక్‌లో పరిచయం అయిన యువకుడితో సన్నిహితం
  • వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బ్లాక్‌ మెయిల్‌

వెంగళరావునగర్‌: బుల్లితెర నటి శ్రావణి బలవన్మరణానికి పాల్పడింది. సంచలనం సృష్టించిన ఈ సంఘటన మంగళవారం రాత్రి ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మధురానగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...కాకినాడ సమీపంలోని గొల్లప్రోలుకు చెందిన కొండపల్లి భాస్కర్‌రావు, పాపరత్నం కూతురు శ్రావణి(26) సిమాల్లో నటించాలనే కోరికతో 8 సంవత్సరాల కిందట కుటుంబ సభ్యులతో కలిసి నగరానికి వచ్చింది. ఎల్లారెడ్డిగూడ సమీపంలోని జయప్రకాష్‌ నగర్‌లో తొలుత వీరు నివాసం ఉన్నారు. ఈ క్రమంలో శ్రావణికి టీవి సీరియళ్లలో అవకాశాలు వచ్చాయి. మనసు మమత, మౌనరాగం వంటి సీరియళ్లలో నటిస్తోంది. ఈ నేపథ్యంలో కాకినాడకు చెందిన దేవరాజ్‌ రెడ్డి టిక్‌టాక్‌ ద్వారా శ్రావణికి పరిచయమయ్యాడు. తమ స్వగ్రామానికి చెందినవాడు కావడంతో దేవరాజ్‌ రెడ్డిని శ్రావణి గుడ్డిగా నమ్మింది. ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మబలికాడు. ఈ క్రమంలో దేవరాజ్‌  రెడ్డి గత సంవత్సరం సెప్టెంబరులో నగరానికి వచ్చాడు. తనకు నగరంలో వేరే ఎవరూ లేరని తనకు ఆశ్రయం కల్పించాలని కోరడంతో శ్రావణి ఆమె తల్లిదండ్రులకు ఒప్పించి తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించింది. కొద్ది రోజులకే దేవరాజ్‌ రెడ్డి నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. తనను ప్రేమించానని చెప్పిన దేవరాజ్‌ రెడ్డి ఇతర యువతులతో మాట్లాడుతుండటం శ్రావణి గమనించి నిలదీయడంతో శ్రావణి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి కొందరు మిత్రులతో ఉండసాగాడు.  కొద్ది రోజుల తర్వాత తనకు డబ్బు అవసరం ఉందని దేవరాజ్‌ రెడ్డి కోరడంతో శ్రావణి రూ.30 వేలను గూగుల్‌ పే ద్వారా పంపింది. మరి కొద్దిరోజులకు శ్రావణికి ఫోన్‌ చేసి తన వద్ద ఉన్న వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సామాజిక మాద్యమాల్లో ఉంచుతానని బెదిరింపులకు దిగాడు. తన వద్ద ఉన్న వీడియోలు, ఫొటోలు డిలిట్‌ చేయాలంటే రూ.లక్ష ఇవ్వాలని నిందితుడు బెదిరించడంతో రెండు వాయిదాల్లో డబ్బు చెల్లించింది. అయినప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో జూన్‌ 22న తేదీన ఎస్సార్‌ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరి 25వ తేదీన తనపై అత్యాచార యత్నానికి కూడా పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితునికి నోటీసులు ఇచ్చి పంపించేశారు. తిరిగి దేవరాజ్‌రెడ్డి తరచూ ఫోన్‌లు చేస్తూ శ్రావణిని బ్లాక్‌మెయిల్‌ చేస్తుండేవాడు.  గతంలో ఓసారి పోలీసులకు ఫిర్యాదు చేసినా పెద్దగా ఫలితం లేకపోవడంతో విసుగు చెందిన శ్రావణి మంగళవారం రాత్రి బాత్రూంలోకి వెళ్లి ఉరేసుకుంది. ఇది గమనించిన కుటంబ సభ్యులు వెంటనే ఓ ప్రైవేటు దవాఖానాకు తరలించారు. కాగా అప్పటికే శ్రావణి మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. దేవరాజ్‌ రెడ్డి వేధింపుల కారణంగానే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడినట్లు శ్రావణి తల్లి పాపరత్నం ఎస్సార్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ నర్సింహారెడ్డి తెలిపారు. 

శ్రావణి ఆత్మహత్యకు నేను కారణం కాదు- దేవరాజ్‌ రెడ్డి

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్యకు తానే కారణమమని వివిధ టీవి చానళ్లలో వస్తున్న వార్తలు అవాస్తవమని ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్‌రెడ్డి తెలిపారు. తన వివరణను సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. శ్రావణి ఆత్మహత్యకు ఆమె కుటుంబ సభ్యులు, సాయి అనే వ్యక్తి కారణని తెలిపాడు. కుటుంబ సభ్యులు తీవ్రంగా కొట్టడంతోనే మనస్తాపం చెంది శ్రావణి ఆత్మహత్య చేసుకుందన్నారు. ఈ విషయం శ్రావణి తనకు చెప్పిందని ఫోన్‌ సంభాషణను కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. తన పుట్టిన రోజున తన పేరు చెప్పి శ్రావణి రూ.30 వేలు ఖర్చు చేసిందన్నారు. ఎస్సార్‌నగర్‌ పోలీసు స్టేషన్‌లో తనపై పెట్టిన కేసు కూడా నిజం కాదని, శ్రావణిపై ఒత్తిడి చేసి ఆమె కుటుంబ సభ్యులే తన పై కేసు పెట్టించారని తెలిపాడు. తాను పోలీసుల విచారణకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.


logo