శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 05, 2020 , 22:47:01

చిత్రసీమ ఇబ్బందులు తాత్కాలికమే

చిత్రసీమ ఇబ్బందులు తాత్కాలికమే

‘సినీ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. కరోనా ప్రభావంతో థియేటర్లూ, స్టూడియోలు మూత పడటంతో వాటిలో పనిచేసే కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వైరస్‌ను వీలైనంత తొందరగా నిర్మూలించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది.  కరోనా వైరస్‌ను తరిమికొట్టి యథావిథిగా సినీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని అన్నారు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంలో సినీ పరిశ్రమ కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి.  ఈ సంక్షోభ పరిస్థితుల్ని రూపుమాపడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల గురించి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మంగళవారం హైదరాబాద్‌లో మీడియాకు వివరిస్తూ ‘ కరోనా వైరస్‌ ప్రభావంతో ఒక  ప్రాంతం, రాష్ట్రం, నగరం అని కాకుండా యావత్‌ ప్రపంచం మొత్తం ఇబ్బందులు పడుతోంది. హైదరాబాద్‌కు ఆయువుపట్టుగా ఉన్న చలన చిత్ర పరిశ్రమ సమస్యల్ని ఎదుర్కొంటుంది.  ఈ విపత్కర పరిస్థితుల్లో దర్శకులు, నిర్మాతలు, నటీనటులతో పాటు ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలి. ప్రభుత్వం అన్ని విధాలుగా సినీ పరిశ్రమకు సహకారాన్ని అందిస్తుంది. ఇండస్ట్రీ అభివృద్ధి కోసం అవసరమైన ప్రణాళికలపై చిరంజీవి, నాగార్జునలతో   ఇదివరకే చర్చించడం జరిగింది.  ముఖ్యమంత్రి సలహాలు, సూచనలతోనే ఈ చర్చలు జరిగాయి. ఇండస్ట్రీ సంక్షేమం కోసం ప్రభుత్వం ఒక పాలసీని ప్రకటించేందుకు సిద్ధమైన తరుణంలోనే కరోనా  ప్రభావం మొదలైంది. తప్పకుండా రాబోవు రోజుల్లో ఉత్తమమైన పాలసీనీ ఇండస్ట్రీ కోసం తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది.   సినీ పరిశ్రమతో వ్యక్తిగతంగా నాకు చక్కటి అనుబంధముంది. ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులున్నారు. వారి మంచి చెడులు తెలిసిన వ్యక్తిగా  లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత అందరితో మాట్లాడి సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా. సాధ్యాసాధ్యాల్ని పరిశీలించి వీలైనంతవరకు సహాయం చేస్తా. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత షూటింగ్‌ల ప్రారంభంతో పాటు ఇండస్ట్రీలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి  అందరి సహకారం తీసుకుంటూ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇండస్ట్రీ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసి వారి సూచనలకు అనుగుణంగానే థియేటర్ల ప్రారంభంపై  తగిన నిర్ణయానికి వస్తాం. థియేటర్లలో భౌతిక దూరం  పాటింపును పరిశీలిస్తాం.  

ప్రస్తుత  పరిస్థితుల్లో తొందరపాటుతో ఇబ్బందులు కొని తెచ్చుకోవడం సరికాదు. పరిస్థితులు ప్రభావం వల్ల మంచి చేసే ప్రయత్నంలో కొన్ని సార్లు చెడు ఎదురుకావొచ్చు.  ఈ నెలాఖరు వరకు వేచి చూసిన తర్వాత జూన్‌లో సినిమా షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలపై స్పష్టత వస్తుంది. టీవీ షూటింగ్‌లకు  అనుమతులు ఇస్తానని నేను అనలేదు.  కేబినెట్‌ మీటింగ్‌ తర్వాత  టీవీ అసోసియేషన్‌లతో మాట్లాడుతానని చెప్పాను. కేరళ ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ర్టాలు ప్రస్తుతం సినీ పరిశ్రమ కోసం తీసుకున్న నిర్ణయాల్ని పరిశీలనలోకి తీసుకుంటాం.  చిత్ర పరిశ్రమ రెండు తెలుగు రాష్ర్టాల్లో  ఉంది కాబట్టి సినిమాలకు సంబంధించిన నిర్ణయాల విషయంలో ఏపీ మంత్రితో మాట్లాడుతాం.   దేశంలోనే అత్యధికంగా సినిమాలు తెలుగులోనే రూపొందుతున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలోని ఇబ్బందులు తాత్కాలికమే. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. సినీ వర్గాల వారు ఇచ్చిన  రిప్రజెంటేషన్స్‌ను పరిశీలించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటాం. ఇండస్ట్రీకి ఏది మంచిదనేది సినీ వర్గాలకే ఎక్కువగా తెలుసు. కాబట్టి అందరి నిర్ణయాల్ని పరిశీలిస్తాం’ అన్నారు.  కరోనా కారణంగా సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ స్టేట్‌ ఫిలింఛాంబర్‌, తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ప్రతినిధులు మంత్రికి వినతిపత్రాల్ని అందించారు. ఈ కార్యక్రమంలో నారాయణ్‌దాస్‌ నారంగ్‌, సునీల్‌ నారంగ్‌, సి.కల్యాణ్‌, దిల్‌రాజు తదితరులు పాల్గొన్నారు. logo