సమకాలీన కథానాయికలు తమకున్న పుస్తకపఠన వ్యాపకాన్ని మరో మెట్టు ఎక్కిస్తూ రచయిత్రులుగా రాణించే ప్రయత్నం చేస్తున్నారు. బాలీవుడ్ అగ్ర కథానాయిక ప్రియాంకచోప్రా కొన్ని నెలల క్రితం ‘అన్ఫినిష్డ్’ పేరుతో తన బయోపిక్‌ను వెలువరించిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె బాటలో మిల్కీబ్యూటీ తమన్నా రచయితగా అవతారమెత్తింది. అయితే ప్రియాంకచోప్రా తరహాలో జీవిత చరిత్ర కాకుండా ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన పుస్తకాన్ని రచించింది. ‘బ్యాక్ టు ది రూట్స్’ అనే శీర్షికతో రాబోతున్న ఈ పుస్తకాన్ని తమన్నా లైఫ్‌ైస్టెల్ కోచ్ ల్యూక్ కోటిన్హోతో కలిసి రాసింది. ప్రాచీన భారతీయ జీవన విధానం యొక్క గొప్పదనం, శారీరకధారుడ్యం కోసం ఆనాడు ఆచరించిన పద్ధతులు, సుదీర్ఘ జీవనానికి పాటించాల్సిన నియమాల్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు. ‘నేటి యాంత్రిక జీవితంలోని ఉరుకులు పరుగులు, ఒత్తిడితో కూడుకున్న వ్యవహారాల నుంచి ఉపశమనం పొందాలంటే మన భారతీయ ప్రాచీన మూలాల్లోకి వెళ్లాల్సిన అవశ్యకతను ఈ పుస్తకంలో తెలియజెప్పాం. కేవలం శారీరకదృఢత్వం గురించే కాకుండా సాత్విక ఆహార నియమాల్ని కూడా వివరించాం’ అని తమన్నా పేర్కొంది. ఓ అంతర్జాతీయ ప్రచురణ సంస్థ ద్వారా ఈ పుస్తకం మార్కెట్లోకి విడుదలకానుంది.