బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Sep 18, 2020 , 14:33:49

జీవం పోసుకున్న.. సుశాంత్ మైనపు బొమ్మ

జీవం పోసుకున్న.. సుశాంత్ మైనపు బొమ్మ

కోల్‌కొతా: ఇటీవల మరణించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మైనపు బొమ్మ ప్రాణం పోసుకున్నది. పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్‌కు చెందిన శిల్పి సుకాంతో రాయ్ దీనిని రూపొందించారు. వైట్ టీ షర్ట్‌పై జాకెట్, బ్లాక్ ప్యాంటులో కనువిందు చేస్తూ తనదైన స్టైల్‌లో నవ్వుతూ ఉన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మైనపు బొమ్మ ఎంతో ఆకట్టుకుంటున్నది. సుశాంత్ అంటే తనకు ఎంతో ఇష్టమని శిల్పి సుకాంతో రాయ్ తెలిపారు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడంత తనకు బాధకలిగించిందని చెప్పారు. సుశాంత్ జ్ఞాపకార్థం ఆయన మైనపు బొమ్మను తయారు చేసి తన మ్యూజియంలో ఉంచినట్లు తెలిపారు.

సుశాంత్ తల్లిదండ్రులు కోరితే వారి కోసం మరో కొత్త మైనపు బొమ్మను తయారు చేస్తానని సుకాంతో రాయ్ చెప్పారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, క్రికెటర్ విరాట్ కొహ్లీ వంటి ప్రముఖుల మైనపు విగ్రహాలను ఆయన తయారు చేసి తన మ్యూజియంలో ఉంచారు. మరోవైపు సుశాంత్ అభిమానులు ఆ మ్యూజియానికి వచ్చి ఆ మైనపు బొమ్మ వద్ద ఫోటోలు తీసుకుంటున్నారు. కాగా లండన్‌లోని ప్రసిద్ధ మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో సుశాంత్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ వేలాది మంది అభిమానులు ఇటీవల ఆన్‌లైన్ పిటిషన్‌‌పై సంతకాలు చేశారు.

జూన్ 14న ముంబై బాంద్రాలోని తన నివాసంలో సుశాంత్ ఫ్యానుకు వేలాడుతూ అనుమానస్పద స్థితిలో చనిపోయారు. అయితే తన కుమారుడి మరణానికి స్నేహితురాలు రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులు కారణమని సుశాంత్ తండ్రి ఆరోపించి పాట్నా పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో బీహార్ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించగా సుప్రీంకోర్టు సమర్ధించింది. దీంతో సీబీఐతోపాటు ఈడీ కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి.  మరోవైపు డ్రగ్స్ కోణంలో దర్యాప్తు చేస్తున్న మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) రియా, ఆమె సోదరుడితో పాటు మరికొందరిని అరెస్ట్ చేసింది.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo