శుక్రవారం 29 మే 2020
Cinema - Jan 19, 2020 , 00:24:01

మహేష్‌ నమ్మకాలన్నీ నిజమయ్యాయి!

మహేష్‌ నమ్మకాలన్నీ నిజమయ్యాయి!

‘నా ఇరవై ఏళ్ల కెరీర్‌లో  ఏ సినిమాకు ఇంతటి ఆదరాభిమానాలను చూడలేదు. నాలుగైదేళ్లుగా నటుడిగా నన్ను కొత్తపంథాలో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని  చేసిన సినిమా ఇది.  కెరీర్‌లో నేను తీసుకున్న మంచి నిర్ణయాల్లో ఈ సినిమాను అంగీకరించడం ఒకటి’ అని అన్నారు మహేష్‌బాబు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్‌ రావిపూడి దర్శకుడు. దిల్‌రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది.  ఈ చిత్ర విజయోత్సవ వేడుక శుక్రవారం హన్మకొండలో జరిగింది.  ఈ సందర్భంగా మహేష్‌బాబు మాట్లాడుతూ ‘అనిల్‌ రావిపూడి ఈ సినిమాలో ఎన్నో అద్భుతాలు చేశాడు. అతడు రాసిన సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. రామ్‌లక్ష్మణ్‌, దేవిశ్రీప్రసాద్‌,  రత్నవేలు..ప్రతి ఒక్కరి కృషితోనే ఈ విజయం సాధ్యమైంది.  ‘కొడుకు దిద్దిన కాపురం’ తర్వాత ముప్ఫై ఏళ్ల అనంతరం విజయశాంతితో పనిచేయడం మరపురాని జ్ఞాపకంగా మిగిలింది. దిల్‌రాజుతో నా కలయికలో వచ్చిన హ్యాట్రిక్‌ హిట్‌ ఇది’ అని తెలిపారు. తన పాత్ర ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచిపోతున్నదని, సైనికుల కుటుంబాల వ్యథలను దర్శకుడు హృద్యంగా ఈ సినిమాలో ఆవిష్కరించారని విజయశాంతి చెప్పింది.

అనిల్‌రావిపూడి మాట్లాడుతూ ‘కథ విన్నప్పుడు మహేష్‌లో ఉన్న నమ్మకం, షూటింగ్‌ సమయంలోని కాన్ఫిడెన్స్‌, డబ్బింగ్‌ పూర్తయిన తర్వాత అంచనా, విడుదల రోజు జడ్జిమెంట్‌ అన్ని నిజమవ్వడం ఆనందంగా ఉంది. నిర్మాతలకు డబ్బులు, ప్రేక్షకుల ముఖాల్లో ఆనందాన్ని కోరుకొని చేసిన సినిమా ఇది’ అని చెప్పారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ ‘నా మాట మీద వరంగల్‌లో దిల్‌రాజు ఈ వేడుకను ఏర్పాటుచేయడం ఆనందంగా ఉంది. హైదరాబాద్‌ తర్వాత వరంగల్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలి’ అని చెప్పారు. ఈ ఆనందాన్ని తదుపరి సినిమాతో కొనసాగించే బాధ్యత తనపై ఉందని వంశీపెడిపల్లి చెప్పారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘ఏడు రోజుల్లోనే ఈ సినిమా లాభాల్లోకి వెళ్లడం సంతోషంగా ఉంది. అనిల్‌ విజయాల జర్నీని ఇలాగే కొనసాగాలి’ అని చెప్పారు. సినిమా ఒక ఎత్తు అయితే మైండ్‌ బ్లాక్‌ సాంగ్‌ మరో ఎత్తుగా నిలుస్తున్నదని నిర్మాత అనిల్‌ సుంకర పేర్కొన్నారు. మహేష్‌బాబుతో మాస్‌ సినిమా చేయాలనే తన కోరిక తీరిందని దేవిశ్రీప్రసాద్‌ అన్నారు. కథాబలమున్న మంచి సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని రష్మిక మందన్న చెప్పింది.ఈ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


logo